Kashmir: ప్రధాని మోదీనే మెప్పించి సెల్ఫీ దిగిన ఈ నజీమ్ ఎవరు?
ABN , Publish Date - Mar 07 , 2024 | 06:44 PM
ఆర్టికల్ 370 రద్దు తరువాత గురువారం తొలిసారి ప్రధాని మోదీ(PM Modi) జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒకరితో సెల్ఫీ దిగుతూ.. ఆయన తన ఫ్రెండ్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు తరువాత గురువారం తొలిసారి ప్రధాని మోదీ(PM Modi) జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒకరితో సెల్ఫీ దిగుతూ.. ఆయన తన ఫ్రెండ్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫ్రెండ్ వివరాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మోదీని మెప్పించి సెల్ఫీ దిగిన వ్యక్తి పేరు నజీమ్. శ్రీనగర్‌కు చెందిన ఆయన విక్షిత్ భారత్ ప్రోగ్రాం లబ్ధిదారుడు. ప్రభుత్వ సాయం అందుకుని వ్యాపారాన్ని వృద్ది చేసి.. నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు.
10వ తరగతితో ప్రారంభం..
నజీమ్ 2018లో 10వ తరగతిలో ఇంటి పైకప్పుపై తేనెటీగలు పెంచడం ప్రారంభించాడు. అలా తేనెటీగల పెంపకంపై ఆసక్తి పెరగడంతో ఆన్‌లైన్‌లో దాని గురించి వెతకడం మొదలుపెట్టాడు. “2019 లో విక్షిత్ భారత్ కింద 25 తేనెటీగల పెట్టెలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీ పొందాను. రోజు 75 కిలోల తేనెను తీసేవాడిని. ఆ తేనెను గ్రామాల్లో విక్రయించడం ప్రారంభించాను. నెలకు రూ.60,000 ఆదాయం సంపాదించేవాడిని. అలా బిజినెస్ వృద్ధి చెందడం ప్రారంభించింది.
25 పెట్టెల నుంచి 200 పెట్టెలను కొనుగోలు చేసే స్థాయికి వెళ్లాను. ఇందుకోసం PMEGP (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) సహాయం తీసుకున్నాను. ఆ పథకం కింద రూ.5 లక్షలు అందుకున్నాను. తేనెటీగల వ్యాపారం విస్తరించడంతో 2020లో వెబ్‌సైట్ ప్రారంభించాను. నా బ్రాండ్ తేనె ప్రాచుర్యం పొందింది. 2023లో 5 వేల కిలోల తేనెను విక్రయించాను. ప్రస్తుతం నా కంపెనీలో 100 మంది పని చేస్తున్నారు. కంపెనీకి ఎఫ్‌పీఓ కూడా వచ్చింది ”అని నజీమ్ చెప్పారు.
తీపి విప్లవానికి నాంది పలికారన్న మోదీ..
ప్రభుత్వ సాయాన్ని అందుకుంటూ నజీమ్ తీపి విప్లవానికి నాంది పలికారని ప్రధాని మోదీ కొనియాడారు. ఎక్స్‌లో.."నజీమ్.. మీ తల్లిదండ్రులు నిన్ను డాక్టర్ లేదా ఇంజినీర్‌గా చూడాలని కోరుకున్నారు. అయితే నీ ఆసక్తిని గమనించి వారు ప్రోత్సహించారు. అలా నీకు నచ్చిన మార్గంలో వెళ్లి కశ్మీర్‌లో తీపి విప్లవం తీసుకొచ్చావ్. అభినందనలు. ఇది మీకు పూర్తిగా నూతన రంగం. తేనెటీగలు వ్యవసాయానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీ సంస్థ రైతులకు కూడా ఉపయోగపడుతుంది.
మీ ఆలోచనలను పెట్టుబడిగా పెడితే ప్రభుత్వం మీకెప్పుడూ అండగా ఉంటుంది. నజీమ్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. అతని భవిష్యత్ ప్రయత్నాలకు నా తరఫున శుభాకాంక్షలు. విజయానికి షార్ట్‌కట్ ఏదీ ఉండదు. కష్టపడి పని చేస్తేనే ప్రతిఫలం లభిస్తుంది. 2014లో నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి దేశ ప్రజల కోసం కొన్నే పథకాలే ఉండేవి. కానీ ఎన్డీఏ హయాంలో ఎన్నో పథకాలను తీసుకొచ్చాం" అని మోదీ వివరించారు. ప్రధాని తన ప్రయాణం గురించి అడిగారని నజీమ్ మీడియాతో చెప్పారు. వాటికి సమాధానాలు చెబుతూ.. సెల్ఫీ కోసం అభ్యర్థించానని దానికి మోదీ అంగీకరించి.. సెల్ఫీ ఇవ్వడం చాలా సంతోషానిచ్చిందని నజీమ్ సంబరపడ్డాడు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి