Littles : నిజమైన మంత్రదండం
ABN , Publish Date - Jun 21 , 2024 | 12:10 AM
అవంతీపురాన్ని పరిపాలించే రాజమహేంద్రవర్మకు చదరంగం అంటే ఇష్టం. దాంతో ఎక్కువ సమయం ఆ ఆట ఆడుతూ గడిపేవాడు
అవంతీపురాన్ని పరిపాలించే రాజమహేంద్రవర్మకు చదరంగం అంటే ఇష్టం. దాంతో ఎక్కువ సమయం ఆ ఆట ఆడుతూ గడిపేవాడు. రాజ్యానికి సంబంధించిన విషయాలు పట్టించుకొనేవాడు కాదు. అతని మంత్రి వినయుడు కష్టపడి పనిచేసే స్వభావం కలిగినవాడు. మహేంద్రవర్మ అప్పుడప్పుడు తన మంత్రితో- ‘‘మన దగ్గర ఒక మంత్రదండం ఉంటే బావుంటుంది. ఎవరు ఏమి అడిగినా ఇచ్చేయవచ్చు’’ అంటూ ఉండేవాడు. రాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకొని మంత్రి వినయుడు ఒక రోజు- ‘‘రాజా.. మన రాజ్యంలోకి ఒక మునీంద్రుడు వచ్చాడు. ఆయన దగ్గర ఉన్న మంత్రదండం మహిమ కలిగినది. ఎవరు ఏమి అడిగినా వెంటనే ప్రత్యక్షమవుతుంది. మీరు ఆ ముని మంత్రదండం అడిగి తీసుకోండి’’ అన్నాడు.
వెంటనే రాజు ముని దగ్గరకు వెళ్లి మంత్రదండం అడిగాడు. అప్పుడు ఆ ముని- ‘‘రాజా! ఈ మంత్రదండం వద్దనే ఒక వ్యక్తిని చూపించు.. అప్పుడు నీకు ఈ మంత్రదండం ఇస్తా’’ అన్నాడు. దాంతో రాజు తన రాజ్యమంతా దండోరా వేయించాడు. అందరు ప్రజలు మంత్రదండం కోసం ఎగబడ్డారు. గూఢచారులు వచ్చి- ‘‘రాజా! రాజధాని సమీపంలో కట్టెలు కొట్టుకొని బతికే చిన్నయ్య మాత్రం మంత్రదండంపై ఎలాంటి ఆసక్తి చూపించటం లేదు’’ అని చెప్పారు. అప్పుడు రాజు అతనిని పిలిచింది- ‘‘నీకు మంత్రదండం ఎందుకు వద్దు..? కారణం చెప్పు?’’ అన్నాడు. అప్పుడు చిన్నయ్య- ‘‘నేను గొడ్డలితో చెట్లు నరుకుతాను. సంపాదించుకుంటాను. నా గొడ్డలే నా మంత్రదండం’’ అన్నాడు. అప్పుడు రాజుకు తాను చేస్తున్న తప్పు అర్ధమయింది.