Viral News: కారు వద్దు.. హెలికాప్టర్ ముద్దు.. ఈ మహిళ చేసిన పని చూస్తే..
ABN , Publish Date - Jun 20 , 2024 | 04:52 PM
నగరాల్లో వాహనాలు లేని వాళ్లు తమ గమ్యస్థానానికి చేరుకోవడం కోసం ‘ఊబర్’ వంటి రైడ్స్‌ని బుక్ చేసుకుంటారు. ఈ రైడ్స్ తక్కువ ఖర్చుతో కూడుకున్నవే కాదు.. నిర్దేశిత ప్రాంతానికి..
నగరాల్లో వాహనాలు లేని వాళ్లు తమ గమ్యస్థానానికి చేరుకోవడం కోసం ‘ఊబర్’ (Uber) వంటి రైడ్స్‌ని బుక్ చేసుకుంటారు. ఈ రైడ్స్ తక్కువ ఖర్చుతో కూడుకున్నవే కాదు.. నిర్దేశిత ప్రాంతానికి వేగంగా తీసుకెళ్తాయి. కానీ.. ఓ మహిళ తన గమ్యానికి మరింత వేగంగా చేరుకోవడం కోసం ఏం చేసిందో తెలుసా? ఏకంగా హెలికాప్టర్‌నే (Helicopter) బుక్ చేసుకుంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. అంతేకాదు.. ఊబర్ రైడ్‌కి, హెలికాప్టర్ రైడ్‌కి మధ్య ‘పేమెంట్’ వ్యత్యాసాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో.. ఆ మహిళ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆ మహిళ పేరు ఖుషీ సూరి (Khushi Suri). క్లైనర్ పెర్కిన్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె మాన్‌హాటన్‌లో (Manhattan) నివసిస్తోంది. ఇటీవల పని నిమిత్తం క్వీన్స్‌లోని జాన్ ఎఫ్. కెనెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. క్యాబ్‌లో వెళ్లాలని నిర్ణయించి, తన ఫోన్‌లో ఊబర్ యాప్ ఓపెన్ చేసింది. అందులో.. ట్రాఫిక్ కారణంగా ప్రయాణం 60 నిమిషాల పాటు సాగుతుందని, ఇందుకు 131.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని ఆ యాప్ చూపించింది. తాను అత్యవసరంగా ఎయిర్‌పోర్టుకి చేరుకోవాలి కాబట్టి.. మరో మార్గం కోసం అన్వేషించింది. అప్పుడే హెలికాప్టర్ రైడ్ గురించి తెలుసుకుంది. అందులో ఎంత ఖర్చవుతుందని చూడగా.. 165 డాలర్లేనని తేలింది. పైగా.. ఐదు నిమిషాల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో.. ఆమె ఊబర్ రైడ్‌ని కాదని, హెలికాప్టర్ రైడ్‌ని ఎంపిక చేసుకుంది.
ఈ విశేషాలను ఎక్స్ మాధ్యమంగా షేర్ చేసుకున్న ఖుషీ సూరి.. ఆ రెండు రైడ్‌ల మధ్య వ్యయం, టైమింగ్ వ్యత్యాసాలను చూపే స్క్రీన్‌షాట్‌లను కూడా పోస్ట్ చేసింది. ఊబర్ రైడ్‌కి, హెలికాప్టర్ రైడ్‌కి మధ్య ఖర్చు కేవలం 30 డాలర్ల తేడానే అని.. పైగా ఊబర్‌తో పోలిస్తే హెలికాప్టర్‌లో ఐదు నిమిషాల్లోనే గమ్యానికి చేరుకోవచ్చని తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో.. నెటిజన్లు సైతం తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఒకవేళ ఇది నిజమే అయితే.. తానూ హెలికాప్టర్‌లో ప్రయాణం చేయాలని అనుకుంటున్నానని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు మాత్రం.. హెలికాప్టర్ మనల్ని నిర్దేశిత ప్రాంతంలో డ్రాప్ చేయదని, పైగా అది ఎక్కేందుకు మనమే దాని వద్దకు వెళ్లాల్సి ఉంటుందని, ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యావంటూ కామెంట్ పెట్టాడు.
Read Latest Viral News and Telugu News