Bad Habits at Work: జాబ్ చేసే వారికి సమస్యలు తెచ్చిపెట్టే అలవాట్లు ఇవే
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:14 PM
ఉద్యోగస్థులకు కొన్ని అలవాట్లు చేటు తెస్తాయని నిపుణులు చెబుతున్నారు. వారి కెరీర్‌కే ముప్పుగా మారతాయని అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ విజయం సాధించాలని ఉంటుంది. కష్టించే తత్వం, పట్టుదల ఉంటే విజయం సాధించొచ్చు. అయితే, కొన్ని రకాల అలవాట్లు మాత్రం అవతలి వారికి మనపై అపనమ్మకం కలగ జేస్తాయి. ఎంతగా అంటే చివరకు నలుగురిలో పరువు ప్రతిష్ఠలు పోతాయి. ఉద్యోగస్థులు ఇలాంటి పరిస్థితుల్లో తమ జాబ్ కూడా కోల్పోవచ్చు. కాబట్టి, జాబ్ చేసే వారికి ఉండకూడని అలవాట్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏ ఉద్యోగంలో అయినా డెడ్‌లైన్స్ తప్పవు. ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అలా కుదరకపోవచ్చు. కానీ పదే పదే డెడ్‌లైన్స్ మిస్సవుతుంటే మాత్రం ప్రతిష్ఠ మనసకబారుతుంది. సమయపాలన తెలీదన్న అపప్రధ మూటగట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఆధారపడదగిన వారు కాదన్న అభిప్రాయానికి బాస్ లేదా పైఅధికారులు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది సమస్యలు తెచ్చి పెడుతుంది.
Also Read: ఈ విషయాలను బయటవారికి ఎప్పుడూ చెప్పొద్దు
కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం కూడా పలు ఇబ్బందులకు దారి తీస్తుంది. ఎలాంటి బంధమైనా సజావుగా సాగాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఈమెయిల్స్‌కు సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన సూచనలను తప్పుగా అర్థం చేసుకున్నా, సమావేశాల్లో మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పలేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నలుగురితో కలిసి పనిచేయలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగా అవతలి వారు చెప్పేది శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. ఒకటికి పదిసార్లు ఆలోచించాకే నోరు విప్పాలి. సందేహాలు ఏమైనా ఉంటే అడిగి నివృత్తి చేసుకోవాలి.
ప్రతికూల ఆలోచనలు కూడా మంచివి కావు. ఆఫీసుల్లో వదంతుల వ్యాప్తి చేయడం, ఇతరులపై అసూయ వంటివన్నీ ఉద్యోగంలో విజయానికి ప్రతిబంధకంగా మారతాయి. కాబట్టి, నిత్యం సానుకూల దృక్పథంతో మసులుకోవాలి. మన అపజయాలు, అసంతృప్తులకు ఇతరులను బాధ్యులను చేయకూడదు. సమస్య ఎదురైనప్పుడు సానుకూల ఆలోచనా ధోరణితో ముందడుగు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ఈ పది అలవాట్లతో మీ జీవితం గుర్తుపట్టలేనంతా మారిపోతుంది!
బద్ధకం, పనులను వాయిదా వేయడం కెరీర్‌కు ఎంత మాత్రం పనికిరావు. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయాలని ఉన్నతాధికారులు ఆశిస్తారు. కానీ వ్యక్తిగత పనులు, సోషల్ మీడియా, ఇతర అంశాలపై సమయం వృథా చేస్తే చివరకు పని తగ్గిపోతుంది. చివరకు ఉద్యోగం పోయినా పోవచ్చు
నేటి జమానాలో ఉద్యోగంలో కూడా అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులకు అనుగూణంగా ఉద్యోగులు తమని తాము మలుచుకోవాలి. విమర్శలను సానుకూల ధోరణితో స్వీకరించి పనితీరు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి. అలా కానీ పక్షంలో పరిస్థితులను తట్టుకోలేక చతికిలపడాల్సి వస్తుంది. చివరకు ఉద్యోగానికే ఎసరు వస్తుంది.