Passports Licence Seize: రోడ్ల మీద ఆ పని చేస్తే మీ లైసెన్స్, పాస్‌పోర్ట్ గోవిందా
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:27 AM
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రోడ్ల మీద అలాంటి పనులు చేస్తే.. పాస్‌పోర్ట్, లైసెన్స్ సీజ్ చేస్తామని.. కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఇంతకు ప్రభుత్వం దేని కోసం ఈ ఆంక్షలు విధించింది అంటే..

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆంక్షలే విధించింది. ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ మాసం చివరి శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని కఠిన ఆంక్షలు విధించింది. ఎవరైనా రోడ్ల మీదకు వచ్చి నమాజ్ చేస్తే.. పాస్‌పోర్ట్, లైసెన్స్ సీజ్ చేస్తామని హెచ్చరించింది. మీరట్ పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మీరట్ సూపరింటెండెంట్ ఆయుష్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. "మసీదు, ఈద్గాల్లోనే ఈద్ ప్రార్థనలు నిర్వహించాలి. రోడ్ల మీద ఎవరు నమాజ్ చేయకూడదు. అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఒక్కసారి క్రిమినల్ కేసు నమోదైతే.. వారి పాస్‌పోర్ట్ సీజ్ చేస్తాం.. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. పాస్‌పోర్ట్ తిరిగి పొందాలంటే.. కోర్టు నుంచి నో అబ్జెక్షన్ ఫామ్ తెచ్చుకోవాలి" అని తెలిపాడు.
అలానే "సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసే వారి మీద, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు" అని విక్రమ్ సింగ్ హెచ్చరించారు. "గత సంవత్సరం, కొంతమంది వ్యక్తులు మా ఆదేశాలను ధిక్కరించి రోడ్లపై ప్రార్థనలు చేశారు. దీని ఫలితంగా 80 మందికి పైగా వ్యక్తులపై చర్యలు తీసుకున్నాము. ఈసారి, ఎవరైనా ఈ నియమాలని ఉల్లంఘించినట్లయితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము” అని తెలిపారు. అంతేకాక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి మీరట్ పోలీసులు కఠిన ఆంక్షలు జారీ చేశారు. ప్రజలు శాంతియుతంగా పండుగ చేసుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
వేగంగా వచ్చి సైకిల్‌ను ఢీకొన్న లారీ.. చివరకు సినిమా తరహా ట్విస్ట్..
దేశంలోని ఈ యూనివర్శిటీని కాలబెడితే ఎన్ని నెలలు కాలిందో తెలుసా