Share News

India vs Pakistan: మరో సమరానికి దాయాది దేశాలు సిద్ధం.. కానీ ఓ మెలిక!

ABN , Publish Date - Jul 03 , 2024 | 08:36 PM

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ దశలో తలపడ్డ భారత్, పాకిస్తాన్ జట్లు.. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమవుతున్నాయి. అమీతుమీ తేల్చుకునేందుకు త్వరలోనే బరిలోకి దిగబోతున్నాయి.

India vs Pakistan: మరో సమరానికి దాయాది దేశాలు సిద్ధం.. కానీ ఓ మెలిక!
India vs Pakistan

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గ్రూప్ దశలో తలపడ్డ భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు.. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమవుతున్నాయి. అమీతుమీ తేల్చుకునేందుకు త్వరలోనే బరిలోకి దిగబోతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా.. మార్చి 1వ తేదీన ఈ దాయాది దేశాలు పోటీ పడబోతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు లాహోర్ వేదిక కాబోతోంది. జులై 3వ తేదీన ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి పంపించింది. అయితే.. ఇక్కడో చిన్న మెలిక ఉంది. తమ జట్టుని పాకిస్తాన్‌కి పంపించే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.


ఈ విషయంపై ఐసీసీ బోర్డుకి చెందిన ఓ సభ్యుడు మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఏడాదిలో జరగబోయే 15 మ్యాచ్‌ల ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన డ్రాఫ్ట్‌ను పీసీబీ సమర్పించింది. మొత్తం ఏడు మ్యాచ్‌లో లాహోర్‌లో జరుగుతాయి. మరో ఐదు మ్యాచ్‌లు రావల్పిండిలో, మిగిలిన మూడు మ్యాచ్‌లో కరాచీలో నిర్వహించబడతాయి’’ అని చెప్పుకొచ్చారు. ప్రారంభ మ్యాచ్‌తో పాటు ఓ సెమీఫైనల్ కరాచీలోనూ.. మరో సెమీ ఫైనల్ రావల్పిండిలోనూ.. ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లోనూ ఉండనున్నాయని స్పష్టం చేశారు. ఇండియాకు సంబంధించిన మ్యాచ్‌లన్ని లాహోర్‌లోనే ఉంటాయని వెల్లడించారు. బీసీసీఐ మినహాయించి.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల బోర్డు చీఫ్‌లు తమ మద్దతు ప్రకటించాయని తెలిపారు. బీసీసీఐ మాత్రం ప్రభుత్వాన్ని సంప్రదించాక.. ఐసీసీకి అప్డేట్ ఇస్తారని చెప్పారు.


కాగా.. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది. రాజకీయ విభేదాల కారణంగా.. ఈ ఇరుజట్లు కేవలం ఐసీసీ & ఆసియా కప్ టోర్నమెంట్‌లలోనే తలపడుతున్నాయి. అటు.. ఐసీసీ వరల్డ్‌కప్-2023లో పాల్గొనేందుకు గాను పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చింది. అయితే.. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం సేన భారీ ఓటమిని చవిచూసింది. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా చేతిలో పరాజయం పాలైంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 08:36 PM