Share News

Paralympics : ఈ స్టార్ల ప్రతిభకు పసిడి పంటే!

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:35 AM

సమ్మర్‌ ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించిన పారిస్‌ ఇప్పుడు పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 22 క్రీడాంశాల్లో 4500 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్న ఈ ఈవెంట్‌ ఈనెల 29 నుంచి 11 రోజుల పాటు జరుగనుంది. ఇందులో గత

Paralympics : ఈ స్టార్ల ప్రతిభకు పసిడి పంటే!

పారాలింపిక్స్‌

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

సమ్మర్‌ ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించిన పారిస్‌ ఇప్పుడు పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 22 క్రీడాంశాల్లో 4500 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్న ఈ ఈవెంట్‌ ఈనెల 29 నుంచి 11 రోజుల పాటు జరుగనుంది. ఇందులో గత పారాగేమ్స్‌లో విశేష ప్రతిభ కనబర్చడంతో పాటు బరిలోకి దిగిన ప్రతీ అంతర్జాతీయ వేదికపై అద్భుతంగా రాణిస్తున్న గ్లోబల్‌ స్టార్లున్నారు. తాజా గేమ్స్‌లోనూ వారిపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఓసారి అలాంటివారిపై లుక్కేద్దాం..

బంగారు చేప..

సిమోన్‌ బార్లామ్‌ స్విమ్మింగ్‌

పారాగేమ్స్‌ స్విమ్మింగ్‌లో ఇటలీ ఆధిపత్యానికి బార్లామ్‌దే కీలక పాత్ర. మిలన్‌కు చెందిన 24 ఏళ్ల సిమోన్‌ కాలు మరో కాలితో పోలిస్తే చిన్నదిగా ఉంటుంది. చిన్నతనంలో సర్జరీల కోసం అతను పారిస్‌లో కొంతకాలం గడిపాడు. 14 ఏళ్ల వయస్సులో స్విమ్మింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న బార్లామ్‌ ఎస్‌ 9 కేటగిరీలో టోక్యో గేమ్స్‌లో ఓ స్వర్ణం, రెండు రజతాలు, ఓ కాంస్యం సాధించాడు. అలాగే గతేడాది వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ఆరు విభాగాల్లో ఆరు స్వర్ణాలు అందుకుని తాజా పారాలింపిక్స్‌లో ప్రత్యర్థులకు దడ పుట్టించబోతున్నాడు.

అజేయుడు... అలెక్సిస్‌ హాన్‌క్విన్‌క్వాంట్‌

ట్రయాథ్లాన్‌

పీటీఎస్‌4 ట్రయాథ్లాన్‌లో పోటీపడే 38 ఏళ్ల అలెక్సిస్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ కూడా. టోక్యో గేమ్స్‌ తర్వాత అతను పాల్గొన్న ఏ టోర్నీలోనూ అపజయమే లేదు. 2010లో యాక్సిడెంట్‌కు గురైన అలెక్సిస్‌ కుడి మోకాలి కింది భాగం నుంచి కాలును తీసేయాల్సి వచ్చింది. అయినా నిరాశచెందకుండా 2016 నుంచి పారా ట్రయాథ్లాన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు.


ఒక్సానా మాస్టర్స్‌

చెర్నోబిల్‌ రియాక్టర్‌ పేలుడు జరిగిన మూడేళ్లకు శారీరక లోపాలతో జన్మించిన ఒక్సానా అనాఽథాశ్రమంలో పెరిగింది. ఆ తర్వాత ఏడేళ్ల వయస్సులో యూఎస్‌ మహిళ దత్తత తీసుకోవడంతో ఉక్రెయిన్‌ నుంచి తరలివెళ్లింది. ముందు రోయర్‌గా లండన్‌ పారాగేమ్స్‌లో కాంస్యం సాధించిన ఒక్సానా అనంతరం పారా సైక్లింగ్‌, క్రాస్‌ కంట్రీ స్కీయింగ్‌ వైపు దృష్టి సారించింది. టోక్యోలో సైక్లింగ్‌ రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు దక్కించుకుంది.

నెంబర్‌వన్‌.. డీడే డి గ్రూట్‌

వీల్‌చెయిర్‌ టెన్నిస్‌

వీల్‌ చెయిర్‌ టెన్ని్‌సలో 27 ఏళ్ల డీ గ్రూట్‌ మహిళల సింగిల్స్‌, డబుల్స్‌లోనూ వరల్డ్‌ నెంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఆమె ఖాతాలో మొత్తం 42 టైటిళ్లున్నాయి. ఆ జోరుతోనే టోక్యో పారాలింపిక్స్‌ సింగిల్స్‌, డబుల్స్‌లోనూ స్వర్ణాలు సాధించగలిగింది. కుడి కాలు లోపంతో జన్మించిన గ్రూట్‌ ఏడో ఏట టెన్నిస్‌పై ఆసక్తి పెంచుకుంది. 2017లో తొలి టైటిల్‌ అందుకున్న తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. అంతేకాకుండా 2021 నుంచి ఈ ఏడాది వరకు వరుసగా ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఘనతలకు గుర్తుగా ఈ ఏడాది ఆరంభంలో అంగవైకల్య విభాగంలో ప్రతిష్టాత్మక లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గానూ నిలవడం విశేషం.

సిల్వర్‌ బుల్లెట్‌.. మార్సెల్‌ హగ్‌

అథ్లెటిక్స్‌

తలకు సిల్వర్‌ హెల్మెట్‌తో బరిలోకి దిగే మార్సెల్‌ దృష్టి మాత్రం ఎప్పుడూ స్వర్ణంపైనే ఉంటుంది. ఎందుకంటే 38 ఏళ్ల ఈ స్విస్‌ గ్రేట్‌ ఖాతాలో ఇప్పటికే ఆరు పారాలింపిక్స్‌ స్వర్ణాలున్నాయి. వెన్నెముక సమస్యతో జన్మించిన హగ్‌ టోక్యో పారాగేమ్స్‌ టీ54 కేటగిరీలో మారథాన్‌తో పాటు 800, 1500, 5000మీ.లలోనూ స్వర్ణాలు దక్కించుకున్నాడు. అంతకుముందు రియో పారాగేమ్స్‌లో రెండు స్వర్ణాలు అందుకున్నాడు. ఈసారి కూడా హగ్‌ ఈ నాలుగు విభాగాలను క్లీన్‌స్వీ్‌ప చేస్తాడనే అంతా భావిస్తున్నారు.

బ్లేడ్‌ జంపర్‌.. మార్కస్‌ రెహ్మ్‌

అథ్లెటిక్స్‌

ఇప్పటికే 4 ఒలింపిక్‌ స్వర్ణాలను ఖాతాలో వేసుకున్న మార్కస్‌ రెహ్మ్‌ను అంతా బ్లేడ్‌ జంపర్‌గా పిలుచుకుంటారు. లాంగ్‌జం్‌పలోనే అతను మూడు గోల్డ్‌ మెడల్స్‌ సాధించాడు. పారిస్‌ పారా అథ్లెటిక్స్‌లోనూ అతడినే ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. నీటిలో వేక్‌బోర్డింగ్‌ చేస్తున్న సమయంలో రెహ్మ్‌ తన కుడి కాలిని కోల్పోయాడు. 2011లో ప్రొస్థెసిస్‌ కాలుతో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో పాల్గొని టీ64 ఈవెంట్‌లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. అలాగే 8.72మీ. దూరంతో వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు.

Updated Date - Aug 24 , 2024 | 06:35 AM