హాకీ జట్టు లక్ష్యం.. పునర్‌వైభవం
ABN , Publish Date - Jul 22 , 2024 | 05:14 AM
ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్‌ది తిరుగులేని ఆధిపత్యం. ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది స్వర్ణాలు సాధించడం మన జట్టు సత్తాకు తార్కాణం. కానీ ఇదంతా గతం. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో మన జట్టు చివరి పసిడి
.
ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్‌ది తిరుగులేని ఆధిపత్యం. ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది స్వర్ణాలు సాధించడం మన జట్టు సత్తాకు తార్కాణం. కానీ ఇదంతా గతం. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో మన జట్టు చివరి పసిడి పతకం అందుకున్నాక భారత హాకీ ప్రమాణాలు పూర్తిగా దిగజారాయి. మళ్లీ పుంజుకొని ఒలింపిక్స్ హాకీలో పతకం కోసం నాలుగు దశాబ్దాలకుపైగా వేచి చూడాల్సి వచ్చింది. మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో జట్టు గత టోక్యో క్రీడల్లో చారిత్రక కాంస్య పతకంతో హాకీ ప్రేమికుల్లో నూతనోత్సాహం నింపింది. ఈసారి హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో బరిలో దిగుతున్న మన జట్టు మరింత మెరుగ్గా రాణించాలని పట్టుదలగా ఉంది. తద్వారా ఒలింపిక్స్ హాకీలో పునర్‌వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.
టోక్యో గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిననాటి మధుర స్మృతులు మదిలో మెదులుతుండగా పురుషుల హాకీ జట్టు పారి్‌సలో కాలుమోపింది. 41 ఏళ్ల పతక కరువును తీరుస్తూ గత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం చేజిక్కించుకున్న నాటి భారత జట్టులోని 11 మంది ఆటగాళ్లు ఈసారీ ఆడుతున్నారు. 2023 ఏషియాడ్‌లో స్వర్ణ పతకం కైవసం చేసుకోవడం ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నేరుగా క్వాలిఫై అయ్యింది. క్రెయిగ్ ఫుల్టన్ కోచింగ్‌లో మనోళ్ల ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఎదురు దాడికి దిగుతూనే డిఫెన్సుకూ ప్రాధాన్యమిస్తోంది. దాంతో గత ఏడాదిగా ప్రపంచ మేటి జట్లను మట్టికరిపించి విజయాలు అందుకుంది. ఇక, పారిస్ విశ్వక్రీడల్లో భారత జట్టు.. డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌లతో కలిసి గ్రూప్-బి నుంచి తలపడుతోంది. కాగా, భారత్ తదుపరి రౌండ్‌కు చేరాలంటే ఆరుజట్ల ఈ గ్రూప్‌లో టాప్-4లో నిలవాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులు, యువకుల సమాహారంతో పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమైన భారత్.. స్వర్ణ పతకాన్ని సాధించి పునర్‌వైభవం దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం.