14 స్థానాల హస్తగతానికై..
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:27 AM
ఎక్కడికక్కడ గ్రూపులు.. ముఖ్య నేతల కొట్లాటలు.. నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి... ఇదీ ఒకప్పుడు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ
అంతా తానై నడిపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఒక్కో స్థానంలో మూడు దఫాలుగా పర్యటన
బహిరంగ సభలు, రోడ్డు షోలకు ప్రణాళికలు
మోదీ వైఫల్యాలపైనే ప్రధానంగా ప్రచారం
వంద రోజుల్లో అమలు చేసిన గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు దిశా నిర్దేశం
మంత్రులు, ముఖ్య నేతలకు ఇన్‌చార్జి బాధ్యతలు
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఎక్కడికక్కడ గ్రూపులు.. ముఖ్య నేతల కొట్లాటలు.. నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి... ఇదీ ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. కానీ.. ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా వ్యూహ, ప్రతివ్యూహాలు రచించడం.. ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం.. ఇలా ఒకటీ, రెండు కాదు.. అన్ని అంశాల్లోనూ పైచేయి సాధిస్తోంది. ఆరు గ్యారెంటీల్లో చాలా పథకాలు అమలు చేస్తున్నామని, ఆగస్టు 15కల్లా రుణమాఫీ సైతం అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలో 17లోక్ సభ స్థానాలు ఉండగా.. కనీసం 14 చోట్ల గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అన్నీ తానైౖ వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి తోడు ఎవరెలా పని చేస్తున్నారన్న దానిపై అధిష్ఠానం ఓ కన్నేసి ఉంచడంతో.. తమకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పూర్తిగా దృష్టి పెడుతున్నారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ వంటి స్థానాల్లో గెలుస్తామని పూర్తి భరోసా ఉన్నా.. ఏ స్థానాన్నీ తేలికగా తీసుకోకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తామో.. ఈ స్థానాల్లోనూ అంతే కష్టపడి పని చేయాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పోటీ నామమాత్రమేనన్న అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు.. మెజారిటీ స్థానాల్లో బీజేపీతోనే ముఖాముఖి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో భేటీ అయిన ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం.. బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, బీజేపీనే టార్గెట్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సహా పార్టీ నాయకులందరూ బీజేపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు పెంచారు. బీఆర్‌ఎ్‌సపై విమర్శలు చేస్తున్నా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఉనికి ఉండదన్న తరహాలోనే మాట్లాడుతున్నారు. ఆ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణనలోకి తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రకటించిన ప్రతి సారీ.. ఆ పార్టీ ఎమ్మెల్యేనో, ముఖ్య నేతో తమ పార్టీలో కనిపించేలా చర్యలు తీసుకుంటోంది.
మోదీ వైఫల్యాలే అస్త్రాలుగా
రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిన తీరును వివరించడమే కాకుండా... హామీల అమల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణను కాంగ్రెస్ అమలు చేస్తోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పిన మోదీ.. పదేళ్లలో ఇచ్చింది 7.21 లక్షల ఉద్యోగాలేనని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ కాలేదని.. తన ప్రసంగాల్లో సీఎం రేవంత్ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పొందుపరిచిన హామీలనూ అమలు చేయని వైనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేసిందని, కేంద్రంలోనూ అధికారం ఇస్తే పాంచ్ న్యాయ్ గ్యారెంటీలనూ అమలు చేస్తుందని చెబుతున్నారు. ఇక, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై ఉన్న గందరగోళానికి తెరదించుతూ ఆగస్టు 15 కల్లా రుణమాఫీ అమలు పూచీ తనదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.
అంతా తానై రేవంత్ ప్రచారం
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణను అంతా తానై నడిపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అభ్యర్థుల తరఫున ప్రచారాన్నీ తన భుజస్కందాలపైనే వేసుకున్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లోనూ సభలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలకు హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3 కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, మహబూబాబాద్, మెదక్, భువనగిరి అభ్యర్థుల తరపున ఒక దఫా సభల్లో పాల్గొన్నారు. అలాగే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మే నెల మొదటి వారంలో నల్లగొండ, భువనగిరిలో ప్రియాంక రోడ్‌షో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు బాధ్యతలు
పోల్ మేనేజ్‌మెంట్‌పై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న, అధికారంలోకి వస్తే ఇండియా కూటమి అమలు చేయనున్న గ్యారెంటీలను ప్రతి ఓటరును కలిసి వివరించేందుకు బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వరకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. మండల, నియోజకవర్గ సమన్వయకర్తల భాగస్వామ్యంతో ఈ కార్యాచరణను అమలు చేసే ప్రధాన బాధ్యతను బూత్‌స్థాయి నేతలకు అప్పగించింది. బూత్ స్థాయిలో బాగా పని చేసిన వారికి గ్రామ, మండల స్థాయిల్లో పదవులు, కమిటీ సభ్యత్వాల్లో ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఓటరును పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి ఓటేయించే బాధ్యతను వారికే అప్పజెప్పింది.