Bhatti Vikramarka:P జనాభా దామాషాలో వనరుల పంపిణీకే..
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:21 AM
ప్రభుత్వం చేపట్టిన కులగణన... రేషన్ కార్డులనో, పథకాల లబ్ధిదారులను తగ్గించడానికో కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సర్వే జరగొద్దని కొంతమంది కుట్ర చేస్తున్నారని, అందుకే అపోహలు సృష్టిస్తున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆరోపించారు.
అందుకే కులగణన : డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన కులగణన... రేషన్ కార్డులనో, పథకాల లబ్ధిదారులను తగ్గించడానికో కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సర్వే జరగొద్దని కొంతమంది కుట్ర చేస్తున్నారని, అందుకే అపోహలు సృష్టిస్తున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆరోపించారు. నిజానికి సమాజంలోని వివిధ వర్గాలకు వారి జనాభా దామాషా పద్ధతిన రాష్ట్ర సంపద అందాలన్న ఉద్దేశంతోనే సర్వే చేపట్టామని వివరించారు. బుధవారం భట్టి ప్రజా భవన్లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడుతుందన్నారు. ఇది ఒక విప్లవాత్మక కార్యక్రమమని, దేశానికి దిశ దశ చూపబోతోందన్నారు. ఈ సర్వే పత్రంలో ఏ ప్రశ్నలు ఉండాలన్న విషయంపై వివిధ వర్గాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు.
సర్వే పేరుతో సమాజంలో చీలికలు తెచ్చే ప్రమాదముందన్న కొందరి ఆరోపణలు కూడా వాస్తవం కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ దేని కోసం కుటుంబ సర్వే చేపట్టిందో వారికే తెలియదన్నారు. దానిని ఎందుకు వాడారో కూడా తెలియదన్నారు. ఆ సర్వే, తమ సర్వేలోని సమాచారం పూర్తి భిన్నంగా ఉంటుందని, తమ సర్వే పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి చేపడుతున్నదని, సమగ్రంగా ఉంటుందన్నారు. ఈ సర్వేకు ప్రత్యేక బీసీ కమిషన్కు సంబంధం లేదన్నారు. కాగా, ప్రజలపై భారం మోపకుండా ఆర్థిక వనరుల సమీకరణపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని భట్టి ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, భూగర్భ గనులు, ఖనిజాల శాఖల ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సిమెంట్, స్టీల్, స్ర్కాప్ వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయమై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్పకుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ ముర్తుజా రిజ్వీ పాల్గొన్నారు.