Share News

BRS: టార్గెట్‌.. పార్లమెంట్‌..! గ్రేటర్‌లోని స్థానాలపై బీఆర్‌ఎస్‌ నజర్‌

ABN , Publish Date - Jan 02 , 2024 | 10:19 AM

అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌(BRS) నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి కేటీఆర్‌(KYR) రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్‌ల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.

BRS: టార్గెట్‌.. పార్లమెంట్‌..! గ్రేటర్‌లోని స్థానాలపై బీఆర్‌ఎస్‌ నజర్‌

- బరిలో నిలిచేందుకు నేతల ఆసక్తి

- గ్రేటర్‌లో సానుకూల ఫలితాల నేపథ్యంలో పెరిగిన పోటీ

- మల్కాజ్‌గిరి నుంచి పలువురి పేర్లు

- సికింద్రాబాద్‌లో ఎవరికి అవకాశం..?

- సమర్థ అభ్యర్థులు పోటీ చేస్తారన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌(BRS) నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి కేటీఆర్‌(KYR) రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్‌ల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. ఇప్పటి నుంచి ఏం చేయాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిటింగ్‌లను మారిస్తే మరిన్ని శాసనసభా స్థానాలు పెరిగేవన్న అభిప్రాయాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని యోచిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా.. గ్రేటర్‌లో మాత్రం ఏకపక్ష విజయం సాధించింది. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని 24 స్థానాలకుగాను 16 చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. గతంతో పోలిస్తే మెజార్టీలూ భారీగా పెరిగాయి. నగరంలో పార్టీకి ఉన్న ఆదరణ పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కొనసాగేలా మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని ఇటీవలి సమావేశంలో కేటీఆర్‌ చెప్పారు.

రెండుచోట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే..

ఇటీవలి ఎన్నికల్లో గ్రేటర్‌లో పార్టీకి అపూర్వ ఆదరణ దక్కిన నేపథ్యంలో ఇక్కడి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు పార్టీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. చేవేళ్ల నుంచి సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి పేరు ఇప్పటికే దాదాపు ఖరారైంది. కొన్నాళ్ల క్రితం పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో ఇటీవల సమావేశమైన కేటీఆర్‌ మార్గనిర్దేశనం చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి స్థానాల నుంచి ఎవరు బరిలో ఉంటారన్న ఆసక్తి నెలకొంది. రెండు లోక్‌సభల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇది తమకు లాభిస్తుందన్నది బీఆర్‌ఎస్‌ ఆశావహుల ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఇతర జిల్లాలకు చెందిన నేతలూ నగరంలోని పార్లమెంట్‌ స్థానాల నుంచి బరిలో దిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

మల్కాజిగిరి నుంచి..

మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆసక్తి చూపుతుండగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌, నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిల పేర్లూ వినిపిస్తున్నాయి. మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశమూ లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అగ్రనేత లు ఆ దిశగా ఆలోచిస్తే మల్లారెడ్డి తనయుడు బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తిరిగి అదే కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలో నిలపడం ఎన్నికల్లో ప్రతికూలంగా మారే ప్రమాదమూ ఉందన్న చర్చ కూడా పార్టీలో జరుగుతున్నట్టు తెలిసింది.

సికింద్రాబాద్‌ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ తనయుడు సాయికిరణ్‌కు మరోసారి అవకాశం కల్పిస్తారా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు దాసోజు శ్రవణ్‌ ఆసక్తి చూపుతుండగా.. మాజీ మేయర్‌ రామ్మోహన్‌ సికింద్రాబాద్‌ లేదా మల్కాజ్‌గిరి స్థానాల్లో ఒక చోట పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వీరిని కాదని ఇతర జిల్లాల నుంచి కీలక నేతలను సికింద్రాబాద్‌ నుంచి పోటీలో నిలిపే అవకాశం లేకపోలేదన్న వాదనా వినిపిస్తోంది. హైదరాబాద్‌ పార్లమెంట్‌పై పార్టీ అంతగా ఆశలు పెట్టుకోలేదు.

Updated Date - Jan 02 , 2024 | 10:19 AM