Pending Bills: ప్రభుత్వ శాఖల బకాయిలు 72 వేల కోట్లు..
ABN , Publish Date - Aug 11 , 2024 | 03:39 AM
అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది, సర్కారు కొలువుదీరింది. తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు.
ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకోని తీరు
విద్యుత్తు, ఇరిగేషన్ బిల్లులే 57 వేల కోట్లు
ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులూ పెండింగే
స్కాలర్‌షిప్పులు, దోభీఘాట్ల సొమ్మూ అంతే..
ముఖ్యమైన బిల్లులైనా చెల్లించాలన్న డిమాండ్లు
ప్రభుత్వ సానుకూల స్పందనకై నిరీక్షణ
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపొంది, సర్కారు కొలువుదీరింది. తమ బిల్లులు వస్తాయని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కాలేజీల యాజమాన్యాలు ఇలా అనేక వర్గాల వారు ఆశగా ఎదురుచూశారు. రూ.వేల కోట్ల బిల్లులకు మోక్షం లభిస్తుందని ఆశ పడ్డారు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. పూర్తిస్థాయి బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని, బిల్లులన్నీ క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు.
ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తామని, డీఏలు ఇస్తామని, పీఆర్సీ అమలు చేస్తామనీ పేర్కొన్నారు. ఫీజు రీ-యింబర్స్‌మెంట్ బకాయిలైతే వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇటీవల పూర్తిస్థాయి బడ్జెట్‌నూ ప్రవేశపెట్టారు. కానీ, వివిధ ప్రభుత్వ శాఖలకు రూ.వేల కోట్లలో పెండింగ్‌లో ఉన్న బిల్లులపై మాత్రం దృష్టి సారించలేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, కాంట్రాక్టర్లకు రావాల్సిన సొమ్ములు, విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇలా ఒకటేమిటి? అన్ని శాఖల బిల్లులూ పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి దాదాపు రూ.72 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ప్రభుత్వం రెండో విడత రైతుల రుణమాఫీ కూడా చేసినందున ఇక తమ బిల్లులపై దృష్టి పెడుతుందని, పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అవుతాయని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ ‘బిల్లుల పెండింగ్’ సమస్య ఈనాటిది కాదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే పెద్ద గుదిబండగా తయారైంది. అప్పటి ప్రభుత్వం బిల్లుల క్లియరెన్స్‌ను గాలికొదిలేసింది. కనీసం రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల బిల్లులను కూడా క్లియర్ చేయని ఘటనలున్నాయి. ఇది చాలా జటిలమైన సమస్య అయినప్పటికీ.. బిల్లులను క్లియర్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
కానీ, ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు పూర్తయినా.. బిల్లులపై ఇంకా దృష్టి సారించలేదు. మొత్తం రూ.72 వేల కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉండగా.. విద్యుత్తు, ఇరిగేషన్ శాఖల బిల్లులే 57,399 కోట్లవరకు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సర్కారు ఇంత భారీ మొత్తంలో నిధులు సమకూర్చలేని పరిస్థితి ఉంటే.. ముఖ్యమైన బిల్లుల్ని అయినా ముందుగా క్లియర్ చేయాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి.
సాగునీరు, విద్యుత్తు శాఖల బిల్లులే ఎక్కువ..
పెండింగ్ బిల్లుల్లో ప్రధానంగా విద్యుత్తు, సాగునీటి పారుదల శాఖలకు సంబంధించినవే రూ.57 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్తు పంపిణీ సంస్థల(డిస్కమ్‌ల)కు ప్రభుత్వ శాఖలు/ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.43,770 కోట్లు కాగా.. సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టు పనులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.13,629.18 కోట్ల వరకు ఉన్నాయి. రెండు శాఖలకు కలిపి మొత్తం రూ.57,399.18 కోట్లు చెల్లించాల్సి ఉంది. నీటి పారుదల ప్రాజెక్టుల్లో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డికి రూ.5243.18 కోట్లు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూ.4123.85 కోట్లు, డిండికి రూ.369.64 కోట్లు, కల్వకుర్తికి రూ.313.2 కోట్లు, నెట్టెంపాడుకు రూ.244.3 కోట్లు, ఎల్లంపల్లికి రూ.446.87 కోట్లు, దేవాదులకురూ.238.76 కోట్లు, సీతారామ/సీతమ్మ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు రూ.934.57 కోట్లు, ఇలా అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.13629.34 కోట్లను చెల్లించాల్సి ఉంది.
ఫీజు రీ-యింబర్స్‌మెంట్ బకాయిల కుప్ప
రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్పులు, ఫీజు రీ-యింబర్స్‌మెంట్ బిల్లులూ పెండింగ్‌లో ఉండడం వారిని తీరని ఆవేదనకు గురి చేస్తోంది. ఏళ్ల తరబడి ఇవి క్లియర్ కాకపోవడంతో కోర్సులు పూర్తయిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే సందర్భాల్లో కాలేజీ యాజమాన్యాలు సతాయిస్తున్నాయి. ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిలే రూ.4,769 కోట్ల వరకు ఉన్నాయి. గత మూడేళ్ల నుంచి ఈ రీ-యింబర్స్‌మెంట్ బిల్లులు క్లియర్ కావడం లేదు.
2021-22లో రూ.326 కోట్లు, 2022-23లో రూ.1,830 కోట్లు, 2023-24లో రూ.2,250 కోట్లతో పాటు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి 2020-21లో రూ.250 కోట్లు, ఇక మెస్ చార్చీల్జలకు సంబంధించి రూ.500 కోట్లు కలిపి రూ.5,156 కోట్ల బకాయిలున్నాయి. గతేడాది డిసెంబనేలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత బకాయిల కింద రూ.387 కోట్లను చెల్లించింది. ఇవి పోను.. ఇంకా సుమారు రూ.4,769 కోట్ల బకాయిలున్నాయి. విద్యార్థులకు ఏటా చెల్లించే స్కాలర్‌షిప్పుల బిల్లులు మరో రూ.500 కోట్ల వరకు ఉన్నాయి. ఇలా మొత్తం రూ.5,269 కోట్ల మేర పెండింగ్ పడిపోయాయి. ఇవి కాకుండా ప్రస్తుత విద్యా సంవత్సరానికి మరో రూ.2,250 కోట్లు కావాలి.
ఉద్యోగులకు ఉపశమనమెప్పుడో!?
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి చెప్పనలవిగా మారింది. వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులు రెండున్నరేళ్లుగా క్లియర్ కావడం లేదు. కనీసం ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే ఆర్థిక ప్రయోజనాల బిల్లులు కూడా క్లియర్ కాక.. అవస్థలు పడుతున్నారు. ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా(టీజీజీఎల్‌ఐ), తెలంగాణ ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్(టీజీజీపీఎ్‌ఫ)కు సంబంధించిన పార్ట్ ఫైనల్, గ్రాట్యుటీ, మెడికల్ రీ-యింబర్స్‌మెంట్, గృహ, వాహన రుణాల బిల్లులు క్లియర్ కావడం లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే దాదాపు 10 వేల బిల్లులకు పైగా పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిని క్లియర్ చేయాలంటే కనీసం రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా.
ఇక రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్ శాఖల కింద పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు క్లియర్ కాక లబోదిబోమంటున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోనే రూ.1000 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. బీటీ రోడ్ల రెన్యువల్ పనులు, ప్యాచ్ వర్క్‌లు, కొత్త రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు రెండేళ్లుగా చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. గ్రామీణ రోడ్లు పనులకు సంబంధించి రూ.1200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ బిల్లులే రూ.1700 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. మున్సిపాలిటీలలో దోభీఘాట్ల నిర్మాణ బిల్లులను కూడా చెల్లించకపోవడం గమనార్హం. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అన్ని రకాల బిల్లులు కలిపి 4137.85 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
శాఖలవారీగా
పెండింగ్ బిల్లులు(రూ.కోట్లలో)
విద్యుత్తు 43,770
ఇరిగేషన్ 13,629
ఫీజులు, స్కాలర్‌షిప్పులు 5269
పురపాలక, పట్టణాభివృద్ధి 4137
ఉద్యోగులు 2000
పంచాయతీరాజ్ 1700
రోడ్లు-భవనాలు 1000
మొత్తం 72,055
పోలీసులకు ‘భద్రత’ ఏదీ?
పోలీసు శాఖలో ‘ఆరోగ్య భద్రత’ స్కీము బిల్లులు రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసు గృహ నిర్మాణ సంస్థ వివిధ జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల భవనాలను నిర్మిస్తుంటుంది. ఈ భవనాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ.100 కోట్ల వరకు ఉన్నాయి. పోలీసుల సరెండర్ లీవ్స్, ప్రయాణ చార్జీలకు సంబంధించి మరో రూ.250 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇలా ఒక్క పోలీసు శాఖ బిల్లులే రూ.550 కోట్ల వరకు క్లియర్ చేయాల్సి ఉంది.
ఇక ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న క్షేత్రస్థాయి పరిశీలకులకు ప్రభుత్వం గత రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. మొత్తం రూ.15.28 కోట్లు పెండింగ్ పడిపోయాయి. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రావాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 18 నెలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొత్తం రూ.2280 కోట్లు బకాయి ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు నెలకు రూ.120 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది.