Group-2 Exam: గ్రూప్-2 ప్రశ్నలపై వివాదం
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:22 AM
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్-2020 డాక్యుమెంట్‌ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది..? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి, కావూరి సాంబశివరావుల కంపెనీలు ఏమిటో గుర్తించండి..?
పరీక్షల్లో మావోయిస్టులు, ఎన్‌కౌంటర్లపై పది ప్రశ్నలు
చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ తయారీ సంస్థ ఏదీ?
రాయపాటి, లగడపాటి, టి.సుబ్బరామిరెడ్డి కంపెనీలు ఏవీ?
సమైక్య పాలకుల గురించి అడిగారంటూ విమర్శలు
ప్రశ్నలు ఏపీపీఎస్సీ కోసమా?: మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్-2020 డాక్యుమెంట్‌ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది..? రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి, కావూరి సాంబశివరావుల కంపెనీలు ఏమిటో గుర్తించండి..? ఇవి గ్రూప్-2 పరీక్షలో అడిగిన రెండు ప్రశ్నలు.. ఇలా సమైక్య పాలకులను గుర్తు చేసే పలు ప్రశ్నలను అడగడం వివాదాన్ని రేపింది. ముఖ్యంగా సంబంధం లేని ప్రశ్నలను అడిగారంటూ విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు, ఎన్టీఆర్ పాలన వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలు చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో ఆదివారం మొదలైన గ్రూపు-2 పరీక్షలు.. సోమవారం నాటితో ప్రశాంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు మొత్తం నాలుగు పేపర్లకు సంబంధించిన పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 45.57 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూపు-2 పోస్టులకు మొత్తం 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 2,51,486 మంది పరీక్షలు రాశారు. ఎకానమీలో రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లపై, వివిధ పథకాలపై ప్రశ్నలను ఇచ్చారు. రెవెన్యూ లోటు, వివిధ జిల్లాల ర్యాంకులపై ప్రశ్నలను అడిగారు. అలాగే.. వివిధ సర్వేలు, పలు పంటలు, జనాభా లెక్కలపై కూడా ప్రశ్నలను ఇచ్చారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి వంటి పథకాలపై కూడా ప్రశ్నలను ఇచ్చారు. అభ్యర్థులకు అనేక అంశాల్లో పూర్తి అవగాహన ఉంటే తప్ప సమాధానాలు రాయలేని ప్రశ్నలు చాలా ఉన్నాయని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు.
గద్దర్, విమలక్క గేయాలపై..
తెలంగాణ ఉద్యమ చరిత్రపై ముఖ్యంగా తొలి దశ, మలిదశ ఉద్యమాలు, వివిధ కమిటీలు, పలువురు ఉద్యమకారులు, సంస్థలు, పార్టీల గురించి పలు ప్రశ్నలు అడిగారు. గద్దర్, విమలక్క గేయాలపై, ప్రొఫెసర్ జయశంకర్‌లపై కూడా కొన్ని ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ తల్లి పాత రూపానికి సంబంధించి ఓ ప్రశ్నను అడిగారు. తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదో గుర్తించండి అంటూ.. ‘ఈమె గద్వాల, పోచంపల్లి చీరలను పోలిన చీరలో ఉంది. తెలంగాణ తల్లి విగ్రహ కిరీటం, వడ్డాణంలో కోహినూరు, జాకబ్ వజ్రాలను కూర్చినారు. ఈమె ఒక చేతిలో బోనం పట్టుకుంది. ఈమె పాదాల మెట్టెలు కరీంనగర్ ఫిలిగ్రీ వెండితో తయారు చేశారు’ అంటూ ఆప్షన్లను ఇచ్చారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదిలాబాద్ జిల్లాను దత్తతకు తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సుమారు 190 టీఎంసీల నీటిని ప్రకాశం జిల్లాకు తరలించే ప్రయత్నం చేశారు’ అని ప్రశ్నలను ఇచ్చి ఇందులో ఏవి సరైనవో గుర్తించండని అడిగారు.
ఎన్టీయార్ హయాంలోని పలు విషయాలపై ప్రశ్నలను అడిగారు. ‘1983 ఎన్నికల్లో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రచారం చేశాడు. తెలుగు తల్లి అనే భావమును ప్రచారం చేయడం, ట్యాంక్‌బండ్‌పై ఆంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసి, ఎన్టీఆర్ తెలంగాణ సమాజ, సాంస్కృతిక పునాదులపై దాడి చేశాడు’ అనేవి ఇచ్చి ఇందులో ఏవి సరైనవి అని అడిగారు. ఇటు మావోయిస్టులపై కూడా పలు ప్రశ్నలను ఇచ్చారు. నక్సలైట్ల ఉద్యమానికి సం బంధించి ‘ఇప్పటి నుంచి నాట్యం లేదు, పాట లేదు, ఉపన్యాసం లేదు అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ము ఖ్యమంత్రి ఎవరని’ అడిగారు. అలాగే.. ఎన్‌కౌంటర్లు, కిడ్నా్‌పలు ఇలా సుమారు 10 ప్రశ్నలను అడిగారు.
మీరు తెస్తామన్న మార్పు ఇదేనా..?: హరీశ్
గ్రూప్-2 పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు చూస్తుంటే.. ఆ పరీక్ష ఏపీపీఎస్సీ కోసమా? అన్న అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమచరిత్ర స్థానంలో సమైక్యపాలకుల చరిత్రను చేర్చడమేనా.. కాంగ్రెస్ సర్కారు తెస్తామన్న మార్పు అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తున్నట్లు 2009లో తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలిపింది. సరైందా? కాదా?.. రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి.సుబ్బరామిరెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అక్కడ నీటి పారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది నిజమా కాదా?’ అనే ప్రశ్నలు ఉండటం అభ్యంతరకరమన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉనికి లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ‘తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలన్న నీ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది. తగిన బుద్ధి చెబుతుంది’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాగా.. మేడ్చల్ జిల్లా కీసరలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల హాస్టల్లో ఎలుకలు కొరకడంతో.. ఐదుగురు విద్యార్థినులు ఆసుపత్రి పాలు కావడం దారుణమని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల బాట కార్యక్రమం చేపట్టి 24 గంటలు గడవక ముందే వారి డొల్లతనం బయటపడిందని విమర్శించారు. ప్రచారం పేరిట ఒక్కరోజు తమాషా చేయడం కాదని.. గురుకులాల్లో పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు లేకుండా చూడాలని సూచించారు.
పురిటినొప్పులతోనే పరీక్ష రాసిన గర్భిణి..
నాగర్‌కర్నూల్ టౌన్/పాల్వంచ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 పరీక్షల సందర్భంగా పురిటి నొప్పుల బాధను అనుభవిస్తూ ఓ గర్భిణి పరీక్ష రాయగా.. మరో అభ్యర్థికి ఛాతీ నొప్పి రావడంతో చికిత్స చేయించుకోని పరీక్ష రాశాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో నిండు గర్భిణి అయిన రేవతి పరీక్ష రాసేందుకు రాగా.. మధ్యలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమై ఆమె కోసం పరీక్షా కేంద్రం వద్ద 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రసవం కోసం వైద్యులను సిద్ధం చేసి ఉంచారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఆమె కోసం పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆమెను డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని రోడ్డులోని గౌతమి స్కూల్ కేంద్రంలో కొమరవరపు రవికుమార్ మధ్యాహ్నం పరీక్ష రాస్తుండగా ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో పరీక్ష నిర్వాహకులు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అతడిని అంబులెన్స్‌లో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రవిని పరీక్షించి చికిత్స అందించారు. కాసేపటికి కోలుకున్న అతడిని పరీక్షా కేంద్రానికి తరలించగా పరీక్ష రాశాడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ప్రభుత్వ కళాశాలలో ఎల్.నగేశ్ అనే అభ్యర్థికి పరీక్ష రాస్తుండగానే ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. భద్రాద్రి జిల్లాలోని పాల్వంచలో ఓ అభ్యర్థి హల్‌చల్ చేశాడు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అతడిని అధికారులు పరీక్షకు అనుమతించకపోవడంతో అక్కడే దుస్తులు విప్పి నిరసన తెలిపాడు. పాల్వంచలోని నెహ్రూనగర్ సాంఘిక సంక్షేమ గురకుల బాలికల డిగ్రీ కళాశాల సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే విధుల్లో ఉన్న అశ్వారావుపేట పోలీసులు అతడిని హెచ్చరించడంతో చివరకు వెళ్లిపోయాడు.