G. Kishan Reddy: సింగరేణికి అన్యాయం చేయను!
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:09 AM
తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.
తెలంగాణ బిడ్డగా నాకూ బాధ్యత ఉంది
గనులపై ప్రధానికి నివేదిస్తా: కిషన్‌రెడ్డి
తెలంగాణలోని గనుల మీద సింగరేణికి
గుత్తాధిపత్యాన్ని పునరుద్ధరించండి
బ్లాకులన్నీ కేటాయిస్తేనే సింగరేణి మనుగడ
కేంద్రాన్ని కోరిన ఉప ముఖ్యమంత్రి భట్టి
దేశవ్యాప్త బొగ్గు గనుల వేలం ప్రారంభం
సింగరేణి అక్రమాలపై
సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సంస్థ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం: బండి
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. గనులను ఆదాయం కోసం వేలం వేయడం లేదని, సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల నేపథ్యంలో పారదర్శక విధానాలను పాటించే క్రమంలో వేలం వేస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో పదో విడత దేశవ్యాప్త బొగ్గుగనుల వేలాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో పోలిస్తే బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుక బడిందని చెప్పారు.
దేశీయంగా బొగ్గు ఉత ్పత్తిని పెంచుకుంటూ దిగుమతులను క్రమంగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్ల కాగితాలపై రాస్తే బొగ్గు గనులు కేటాయించే వారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. గనుల కేటాయింపులో కోలిండియాకు ఇచ్చినట్లు సింగరేణికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఒడిశాలోని నైనీ బ్లాకులో బొగ్గు ఉత్పత్తి కోసం అక్కడ కొలువైన బీజేపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ప్రకటించారు. పదేళ్ల కిందట కరెంట్ కోసం తెలంగాణలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసేవారని, రోజుకు కొన్ని గంటలే కరెంటు ఇచ్చే వారని, వ్యవసాయానికి కూడా కరెంట్ సరిగా అందేది కాదని కిషన్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో అనుసరించిన విధానాల వల్లే విద్యుత్‌రంగంలో సాధికారత సాధించి, కరెంటు కొరత తీరిందని వ్యాఖ్యానించారు. బొగ్గు బ్లాకుల వేలంతో కేంద్రానికి వచ్చే ఆదాయమంటూ ఏమీ లేదని, మొత్తం ఆదాయం రాష్ట్రానికే వస్తుందని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో బ్లాక్‌లకు వేలం వద్దు: భట్టి
కోల్‌బెల్ట్‌లో సింగరేణి గనుల మధ్యలో ఉన్న బ్లాకులను వేలం వేసే ప్రయత్నాలను విడనాడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గనుల అభివృద్ధి చట్టం 17(ఏ) సెక్షన్-2 ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలకు ఉదారంగా గనులు కేటాయించే అధికారం కేంద్రానికి ఉంటుందని చెప్పారు. శుక్రవారం గనుల వేలం ప్రారంభం సందర్భంగా భట్టి మాట్లాడుతూ, సింగరేణి తెలంగాణకే ఆయువుపట్టు లాంటిదని చెప్పారు. 2015లో గనుల అభివృద్ధి చట్టం తెచ్చే వరకు 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణికి రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌లన్నింటి మీద గుత్తాధిపత్యం ఉండేదని భట్టి గుర్తు చేశారు. చట్టం వచ్చాక దానికి గండి పడిందని తెలిపారు. సింగరేణి అన్వేషించిన గనులను కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆక్షేపించారు. ఇప్పటికే రెండు గనుల వేలం పూర్తయిందని, సత్తుపల్లిగనిని అవంతిక సంస్థకు, కోయగూడెం బ్లాకును అరో ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారని భట్టి విచారం వ్యక్తం చేశారు.
సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో 42 వేల మంది కార్మికులతో నడుస్తోందని చెప్పారు. ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు లేక కొన్ని మూత పడనున్నాయని చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూత పడబోతున్నాయని, ఆ తర్వాత మరో ఐదేళ్లలో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్‌కాస్టులు మూతపడతాయని వివరించారు. 2037-38 నాటికీ మరో 5 గనులు మూత పడనున్నాయన్నారు. రానున్న 15 ఏళ్లలో సింగరేణి మరింత కుదించుకుపోయి 12 గనులు, 8 వేల మంది కార్మికులు మిగులుతారని చెప్పారు. సింగరేణి సంస్థకు గోదావరి, ప్రాణహిత పరీవాహక ప్రాంతంలో ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యాన్ని పునరుద్ధరించాలని భట్టి డిమాండ్ చేశారు. కిషన్‌రెడ్డి ప్రధానిని కలిసేందుకు అనుమతి తీసుకుంటే ముఖ్యమంత్రితో పాటు అన్ని పార్టీల నేతలను తీసుకొని వచ్చి కలుస్తామన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డగా కిషన్‌రెడ్డి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు.
రానున్న రోజుల్లో 4000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌కు, మరో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీకి, సింగరేణి నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్‌కు 24 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉందని ప్రస్తావించారు వేలమంది సింగరేణి కార్మికులు, పరోక్షంగా ఆధారపడిన లక్షల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థకు గనులు కేటాయించాలని విజ్ఙప్తి చేశారు. ఇప్పటికే వేలంపాటలో రెండు గనులు గెలుచుకున్న సంస్థలు ఇవ్వజూపిన ఆదాయం కన్నా 0.5 శాతం అదనంగా ఇవ్వడానికిసింగరేణి సిద్ధంగా ఉందని చెప్పారు. గనుల అభివృద్ధి చట్టాన్ని వెంటనే సవరించి తక్షణమే గనులు కేటాయించాలని కోరారు. మంత్రి కిషన్‌రెడ్డికి ఇదే అంశంపై వినతిపత్రాన్ని అందించారు.