Share News

Phone Tapping: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఫోన్‌ను ట్యాప్ చేయించిన కేసీఆర్ సర్కార్

ABN , Publish Date - May 27 , 2024 | 06:14 PM

తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..

Phone Tapping: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఫోన్‌ను ట్యాప్ చేయించిన కేసీఆర్ సర్కార్

హైదరాబాద్, ఆంధ్రజ్యోతి మే 27: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ‘తెలంగాణ ఫోన్ ట్యాపింగ్’ కేసులో (Phone Tapping) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంతో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తేలింది. ఆర్కే ఫోన్‌ను కేసీఆర్ సర్కారే ట్యాప్ చేయించినట్లు ఆయన నిజాలన్నీ కక్కేశారు. దీంతో పాటు మరో ఛానల్‌ యజమాని ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ జరిగిందని రాధాకిషన్‌రావు వెల్లడించారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేశామని వాంగ్మూలంలో పూసగుచ్చినట్లుగా చెప్పేశారు.


ఎవర్నీ వదల్లేదుగా!

ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేసినట్లు తెలిపారు. గద్వాల, కోరుట్ల, మానకొండూరుకు చెందిన విపక్ష నేతలు.. దీంతో పాటు.. కన్‌స్ట్రక్షన్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్‌ చేసినట్లు రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో చెప్పారు. బీఆర్ఎస్‌కు ఇబ్బందికరం అనిపించిన ఏ ఒక్క రాజకీయ నేతనూ, వ్యాపారులను.. మరీ ముఖ్యంగా మీడియా అధిపతులను వదలకుండా వారందరి ఫోన్లను కేసీఆర్ ట్యాపింగ్ చేయించిందని దీన్ని బట్టి క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవచ్చు.


వాంగ్మూలంలో ఇంకా ఏముంది..?

బీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టాం. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్‌ రాజుపై నిఘా నిజమే. కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై కూడా నిఘా పెట్టాం. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా పెట్టాం. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులపైన నిఘా ఉన్నది. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు కూడా ట్యాప్ చేశాం. జానారెడ్డి కొడుకు రఘువీర్‌ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్ల ట్యాప్ చేశాం. ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని వాట్సప్ స్నాప్‌చాట్‌లో మాట్లాడిన వారి వివరాలు కూడా సేకరించాంఅని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఉంది.


ఎవరా మీడియా యజమాని..?

ఇదిలా ఉంటే.. ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డ్స్‌ను ప్రణీత్‌రావు విశ్లేషించినట్లు తేలింది. నాటి మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో ప్రణీత్‌రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి ఓ మీడియా యజమాని వెళ్లినట్లు తేలింది. మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్‌రావు కుండ బద్ధలు కొట్టారు. అక్టోబర్, నవంబర్‌ నెలల్లో వీఐపీల సమాచారాన్ని ప్రణీత్‌రావుకు సదరు మీడియా యజమాని అందించినట్లు తాజాగా తేలిపోయింది. దీంతో పాటు.. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా పెట్టామని.. మరీ ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని ప్రణీత్‌రావు టార్గెట్ చేశారని రాధాకిషన్ వాంగ్మూలంతో బయటికి వచ్చింది.

Read Telangana News and Telugu News

Updated Date - May 27 , 2024 | 07:17 PM