Telangana: గతమెంతో ఘనం.. ప్రస్తుతమంతా అస్తవ్యస్థం.. కారు పార్టీకి ఫిరాయింపుల ఫికర్.. !
ABN , Publish Date - Mar 29 , 2024 | 09:08 PM
బళ్ళు ఓడలవుతాయి.. ఓడలు బళ్ళవుతాయి అంటే ఇదేనేమో.. తెలంగాణ ప్రస్తుతం బీఆర్‌ఎస్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది. బీఆర్ఎస్ టికెట్ల కోసం విపరీతమైన పోటీ.. టికెట్ కోసం పైరవీలు.. బల నిరూపణలు.. అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు.. ఒక టికెట్ కోసం పది, ఇరవై మంది పోటీ.. ఇది ఒకప్పటి బీఆర్‌ఎస్ పరిస్థితి.
బళ్ళు ఓడలవుతాయి.. ఓడలు బళ్ళవుతాయి అంటే ఇదేనేమో.. తెలంగాణ ప్రస్తుతం బీఆర్‌ఎస్ పరిస్థితి చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది. ఒకప్పుడు తెలంగాణలో ఇప్పటి బీఆర్ఎస్ అయినా.. అప్పటి టీఆర్ఎస్ అయినా పార్టీ టికెట్ కోసం విపరీతమైన పోటీ.. టికెట్ కోసం పైరవీలు.. బల నిరూపణలు.. అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు.. ఒక టికెట్ కోసం పది, ఇరవై మంది పోటీ.. ఇది ఒకప్పటి బీఆర్‌ఎస్ పరిస్థితి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీఆర్‌ఎస్(BRS) టికెట్ అంటే యమ క్రేజీ.. పార్టీ టికెట్ ఇస్తే చాలు.. గెలుపు ఖాయమనే ధీమా.. కాని 2023లో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో టికెట్ల కోసం ప్రగతి భవన్ చుట్టూ నాయకులు క్యూ కట్టేవాళ్లు. ఇప్పుడు టికెట్ ఇస్తాం రావాలంటూ నాయకులను బతిమలాడుకునే పరిస్థితి వచ్చిందట కారు పార్టీకి.
తాజాగా వరంగల్ (Warangal) లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను బీఆర్‌ఎస్ ప్రకటించింది. తీరా ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ గులాబీ బాస్‌కు కడియం ఫ్యామిలీ షాకిచ్చింది. వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నానని లేఖ రాస్తూ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. మరోవైపు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు సైతం పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరారు.
Harish Rao: ఆ నేతలు అందుకే పార్టీ మారుతున్నారు
ఎంపీలు జంప్..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చూపిస్తామని కేటీఆర్ చెప్పారు. చేవెళ్ల పార్లమెంట్ స్థాయి సమీక్షా సమావేశం పెట్టి.. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని, గెలిపించాలని కార్యకర్తలను కోరారు. తీరా చూస్తే రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరి చేవెళ్లలో హస్తం పార్టీ అభ్యర్థి అయ్యారు. కేసీఆర్ ఎంతో నమ్మిన పట్నం మహేందర్ రెడ్డి సైతం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కుటుంబం తర్వాత.. కీలక వ్యక్తిగా ఉన్న కే కేశవరావు సైతం కారు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ పరిణామాలతో గులాబీ బాస్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎందుకీలా..
బీఆర్‌ఎస్‌కు ఇలాంటి పరిస్థితి వస్తుందని కేసీఆర్ ఊహించి ఉండకపోవచ్చు. బతికి ఉన్నంత కాలం.. ఈ రాష్ట్రానికి కేసీఆర్ సీఎంగా ఉంటారని ఎన్నోసార్లు ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పారు. అలా చెప్పిన నేతలే ఇప్పుడు ఆయనతో లేరు. బీఆర్‌ఎస్‌లో గెలిచి.. పక్క పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నా.. ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్‌కు పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నప్పుడు కూడా.. ఇతర పార్టీల నేతలను హోల్‌సేల్‌గా పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను నేతలు వీడి అధికార పార్టీలోకి వెళ్తున్నా.. కేసీఆర్ పట్లగాని, బీఆర్‌ఎస్ పార్టీ పట్ల గాని ఎటువంటి సానుభూతి వ్యక్తం కావడం లేదు.
అహంకారమే కొంప ముంచిందా..!
సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన అపాయింట్‌మెంట్ కోసం ఎమ్మెల్యేలు లేదా పార్టీలో ఇతర నాయకులు కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది.. సీఎంను కలిసి నియోజకవర్గం సమస్యలు చెప్పుకుందామని ప్రగతి భవన్ గేటు వరకు వెళ్లిన ఎమ్మెల్యేలు, మంత్రులు.. అపాయింట్‌మెంట్ దొరక్క వెనక్కు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా అధికారం ఉంది కాబట్టి అప్పుడు ఏ నాయకుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అప్పట్లో ఈ విషయాన్ని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బహిర్గతం చేయగా.. ఆయనపై భుకబ్జా ఆరోపణలు వచ్చాయంటూ మంత్రివర్గంలోచి తొలగించారు. దీంతో ఆయన పార్టీ వదిలి వెళ్లిపోవల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించిన పలువురు నేతలు.. ఇప్పుడు కారు దిగి హస్తం గూటికి చేరిన తర్వాత అవే ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఆత్మగౌరవం లేదని దానం నాగేందర్ లాంటి వాళ్లు చెబుతున్నారు.
TG Politics: అందుకే ఇన్నాళ్లు బీఆర్ఎస్‌లో ఉన్నా.. కేశవరావు కీలక వ్యాఖ్యలు
వరుస దెబ్బలు..
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు బీఆర్‌ఎస్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరగే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. ఇప్పటికే సీనియర్ నేతలు బీఆర్‌ఎస్‌ను వీడి ఇతర పార్టీలో చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ భవిష్యత్తు ముగిసినట్లేననే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం.. తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని పైకి చెబుతున్నా లోపల మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
CM Revanth: చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సిందే.. కేటీఆర్‌కు రేవంత్ వార్నింగ్..
కారణం ఎవరు..?
బీఆర్‌ఎస్‌లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరంటే.. కేసీఆర్ కుటుంబమే అనే సమాధానం ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ అహంకారమే ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిందనే చర్చ లేకపోలేదు. ఏది ఏమైనప్పటికి బీఆర్‌ఎస్ ఇంత త్వరగా తన పరపతిని కోల్పోతుందని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కారు పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ దశలో బీఆర్‌ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. ఏదైనా జాతీయ పార్టీలో విలీనమవుతుందా.. లేకపోతే కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
TS News: ‘పార్టీలో చెత్తంతా పోయింది’
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..