Delhi Liquor Scam: నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
ABN, Publish Date - Aug 20 , 2024 | 07:39 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణ చేపట్టనుంది.
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు (మంగళవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టనుంది. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసి మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహాడ్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తిహాడ్ జైలులో ఉండగానే అరెస్టు చేసింది.
ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.
తనకు ఆరోగ్య సమస్యలున్నాయని.. జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతుందని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. అయితే కవిత అరెస్ట్ నాటి నుంచి బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా సార్లు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ వేయడం... అందుకు కోర్టు ధిక్కరచడం షరా మామూలుగా మారింది. దీంతో గత కొద్ది నెలలుగా కవిత జైలు జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. మరోసారి కవిత తరపున లాయర్లు కీలకమైన అంశాన్ని బెయిల్ పిటిషన్‌లో పొందుపరుస్తూ డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నిర్దేశిత 60 రోజుల గడువులో పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడంలో సీబీఐ విఫలం అయ్యిందంటూ కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ కోర్టు మరోసారి వాయిదా వేసింది. దీంతో మరికొంత కాలం కవిత జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Updated Date - Aug 20 , 2024 | 07:48 AM