KTR: నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను: కేటీఆర్
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:04 PM
హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nandita) రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయానని, లాస్యను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని అన్నారు. గత ఏడాది ఆమె తండ్రి సాయన్న చనిపోయారని, ఇప్పుడు ఈమె చనిపోవటం బాధాకరమని అన్నారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆమె కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఆ కుటుంబాన్ని ఆయన ఇవాళ పరామర్శించారు.
కాగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం, పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్ (ORR)పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.