Uke Abbayya: తెలంగాణలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ABN , Publish Date - Nov 24 , 2024 | 11:12 AM
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ(ఆదివారం) ఉదయం తుది శ్వాస విడిచారు. ఇల్లందు మండలం హనుమంతుల పాడు గ్రామానికి చెందిన అబ్బయ్య సీపీఐ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి తొలుత సుదిమల్ల సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అబ్బయ్య అంచలంచెలుగా ఎదిగి బూర్గంపాడు, ఇల్లందు నుంచి సీపీఐ తరుపున పోటీ చేసి రెండుమార్లు గెలుపొందారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అనంతరం బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 1983లో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి, 1994, 2009లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అబ్బయ్య మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, గుమ్మడి నరసయ్య, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు సంతాపం తెలిపారు. అబ్బయ్య మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు.