Share News

Hydra: రెవెన్యూ కోరలు!

ABN , Publish Date - Sep 11 , 2024 | 05:04 AM

కీలక శాఖల నుంచి అభ్యంతరాలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారాలు దక్కేందుకు మార్గం సుగమం..! ఆక్రమణల కూల్చివేత సందర్భంలో ఇబ్బందులు రాకుండా పోలీస్‌ సిబ్బంది కేటాయింపు..! ఇలా.. చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌-అసెట్స్‌

Hydra: రెవెన్యూ కోరలు!

హైడ్రాకు అధికారాల బదలాయింపునకు న్యాయశాఖ ఓకే?

ఫైల్‌ సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లిన వెంటనే ఆమోదం

పోలీస్‌ శాఖ నుంచి 15 మంది సీఐలు, 8 మంది ఎస్సైలు

కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ.. నెలాఖరుకు ప్రత్యేక ఠాణా

త్వరలో సాగునీరు, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ నుంచీ సిబ్బంది

‘గొలుసుకట్టు’లో చెరువుల బాగు.. తొలుత తమ్మిడికుంటతో..

చెరువుల్లోని నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయొద్దు

పీటీఐఎన్‌, తాగునీటి, విద్యుత్‌ కనెక్షన్లను కూడా ఇవ్వొద్దు

సంబంధిత శాఖలకు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వినతి

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కీలక శాఖల నుంచి అభ్యంతరాలు తలెత్తకుండా పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారాలు దక్కేందుకు మార్గం సుగమం..! ఆక్రమణల కూల్చివేత సందర్భంలో ఇబ్బందులు రాకుండా పోలీస్‌ సిబ్బంది కేటాయింపు..! ఇలా.. చెరువుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌-అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)ని ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాల సంరక్షణ, చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు, అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సంబంధించిన సర్వాధికారాలను హైడ్రాకు ఇచ్చేందుకు ఫైల్‌ కదిలింది. రెవెన్యూ, ఆక్రమణల నిరోధం చట్టంపై కలెక్టర్ల నుంచి కిందిస్థాయి వరకు ఉన్న అధికారాలను హైడ్రాకు అప్పగించేందుకు అభ్యంతరాలు లేవని న్యాయ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఫైల్‌ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వద్దకు వెళ్లింది. ఒకటి, రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డికి చేరనుంది. ఆ వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, నీటి పారుదల, పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాలు తదితర ముఖ్య శాఖల అధికారాలు హైడ్రాకు దక్కనున్నాయి. మరోవైపు మిగిలిన శాఖలకు సంబంధించిన పైళ్లు కూడా చకచకా కదులుతున్నాయి. సీఎం రేవంత్‌ ఓకే చెప్పాక, అసెంబ్లీ సమావేశాల్లో.. ఆయా శాఖల అధికారాలను హైడ్రాకు కట్టబెడుతూ చట్టం తెస్తారా లేక ఆర్డినెన్స్‌ ద్వారా చట్టబద్ధత కల్పిస్తారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. రెవెన్యూ, ఆక్రమణల నిరోధం, వాటర్‌, ల్యాండ్‌ అండ్‌ ట్రీస్‌ (వాల్టా), నీటి పారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్‌ పరిధి అధికారాలను.. ప్రభుత్వం అంగీకారం తర్వాత హైడ్రా అమలు చేయనుంది. భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటివరకు నోటీసులు కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దారు ఆధ్వర్యంలో ఇస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలోనైతే ఇది ఆయా సంస్థలకు ఉంటుంది. అధికారాల బదలాయింపు తరువాత సంబంధిత చట్టాలపై హైడ్రాదే అజమాయిషీ అవుతుంది.

పోలీస్‌ బలగం..

ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రాకు డిప్యూటేషన్‌పై 15 మంది ఇన్‌స్పెక్టర్లు, 8 మంది ఎస్‌ఐలను పోలీస్‌ శాఖ కేటాయించింది. వీరి జాబితాను అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేష్‌ భగవత్‌ యూనిట్‌ ఆఫీసర్లకు పంపారు. అవసరాన్ని బట్టి కానిస్టేబుళ్లనూ డిప్యూటేషన్‌పై పంపించనున్నారు. రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల అధికారులూ త్వరలో హైడ్రాకు వచ్చే అవకాశముంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా శాఖలకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మరోవైపు ఆక్రమణదారులపై హైడ్రా విజ్ఞప్తి మేరకు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణ కేసుల తరహాలో కాకుండా.. ప్రత్యేక స్టేషన్‌ ద్వారా అయితే విచారణ వేగిరమై.. బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నెలాఖరుకు పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని హైడ్రా వర్గాలు భావిస్తున్నాయి.


ఆ నిర్మాణాలకు

చెరువుల పరిరక్షణకు బహుముఖ వ్యూహంలో భాగంగా హైడ్రా ఇంకో కీలక నిర్ణయమూ తీసుకుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలకు ఆస్తి పన్ను మదింపు చేయవద్దని పురపాలక శాఖను కోరింది. హైదరాబాద్‌ మీర్‌పేటలోని చెరువుల్లో నిర్మాణాలకు ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (పీటీఐఎన్‌) ఉన్నట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ గుర్తించారు. దీనినే యజమాన్య హక్కుగా కొందరు చెబుతున్న దృష్ట్యా.. ఇలాంటి నిర్మాణాలకు పన్ను మదింపు చేయకుండా చూడాలని పురపాలక శాఖ కీలక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై త్వరలో అధికారిక నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. నాలాలు, చెరువులను చదును చేస్తున్న అక్రమార్కులు.. చిన్న గదులు, ఇతర నిర్మాణాలు చేపట్టి నంబర్లు తీసుకుంటున్నారు. కోర్టు కేసులు, ఇతర సందర్భాలలో దానిని యజమాన్య హక్కుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. వివాదాస్పద స్థలాల్లో యజమాని పేరిట కాకుండా ఆవరణకు యజమాని (ఓనర్‌ ఆఫ్‌ ది ప్రెమిసెస్‌) అంటూ పీటీఐఎన్‌ కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా.. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని నిర్మాణాలను మదింపు చేయవద్దని హైడ్రా కోరినట్టు తెలిసింది. ఇక ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న నివాసేతర నిర్మాణాలకు విద్యుత్తు, తాగునీటి సరఫరా నిలిపివేసేలా టీజీఎ్‌సపీడీసీఎల్‌, వాటర్‌ బోర్డుల ద్వారా కసరత్తు చేస్తున్నారు. ఆ నిర్మాణాల కనెక్షన్లను హోల్డ్‌లో పెట్టేలా ఉన్నత స్థాయి ఆదేశాలు జారీ అయ్యే అవకాశముంది. నల్లాలపై పురపాలక శాఖ, విద్యుత్‌ కనెక్షన్లపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్థలానికి సంబంధించిన రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌, గుర్తింపు కార్డు, యజమాని ఫొటోలుంటే విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నారు. నోటరీ అయితే దరఖాస్తుదారు ఇండెమ్నిటి బాండ్‌ సమర్పించాలి. భవనం అనుమతి, నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి నివాసయోగ్యపత్రం తదితర వివరాలను సమర్పిస్తే నల్లా కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉన్నా.. వాటర్‌ బోర్డు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న నివాసేతర భవనాల కనెక్షన్లను హోల్డ్‌లో పెట్టడంతో పాటు.. కొత్త నిర్మాణాలకు విద్యుత్‌, తాగునీరు సరఫరా చేయొద్దని హైడ్రా కోరింది.

గొలుసుకట్టు పద్ధతిలో.. తొలుత తమ్మిడికుంటతో..

చెరువుల్లో ఆక్రమణల తొలగింపే కాదు.. వాటిని పూర్వ స్థితికి తేవడంపైనా హైడ్రా దృష్టిసారించింది. పూడిక తొలగించి నీటి నిల్వ సామర్ధ్యం పెంచడంతో పాటు.. చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న నాలాలను పునరుద్ధరించనుంది. తమ్మిడికుంట చెరువును నమూనాగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీనికి ఎగువన, దిగువన ఉన్న చెరువుల మధ్య నాలాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్టు హైడ్రా వర్గాలు తెలిపాయి. తమ్మిడికుంట శిఖంలో ఉన్న ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌-కన్వెన్షన్‌ను కూల్చివేసిన విషయం విదితమే.

Updated Date - Sep 11 , 2024 | 08:08 AM