Vijay Babu: కేసీఆర్ వల్లే చిన్న లిఫ్టులు నిర్వీర్యం
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:09 AM
ఉమ్మడి రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతాంగానికి మేలు చేసిన ఇరిగేషన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఐడీసీ)ను పదేళ్లలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు విమర్శించారు.
వాటి పునరుద్ధరణకు సర్కారుకు ప్రతిపాదనలు
తెలంగాణ ఐడీసీ చైౖర్మన్ మువ్వా విజయ్‌బాబు
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతాంగానికి మేలు చేసిన ఇరిగేషన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఐడీసీ)ను పదేళ్లలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు విమర్శించారు. గురువారం ఐడీసీ తొలి పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం విజయ్‌బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 643 లిఫ్టులు ఉండగా అందులో 180 పూర్తిగా మూతపడ్డాయని, వీటి పునరుద్ధరణకు రూ.400 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఐడీసీ లిఫ్టులు పనిచేయగా.. కాలక్రమంలో మూతపడటం, నిర్వహణ లేకపోవడంతో సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా లిఫ్టులు మూతపడ్డాయని, వాటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. నీటిపారుదల శాఖ నిర్వహణలోకి వెళ్లిన లిఫ్టులను తిరిగి ఐడీసీ చేతుల్లో పెట్టాలని పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశామని విజయ్‌బాబు వెల్లడించారు.