యువతరం నైపుణ్యాభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:52 AM
గ్రామీణ ప్రాంత విద్యార్థులను నేటి ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోంది.

పల్లె నుంచి ప్రపంచానికి పోటీనిచ్చేలా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానంపై తర్ఫీదు
పైలట్ ప్రాజెక్టుగా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహణ
డిసెంబరు నుంచి కొనసాగుతున్న శిక్షణ
ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు
హుస్నాబాద్, మార్చి16 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులను నేటి ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం తదితర అంశాలపై ఉచితంగా తర్ఫీదు ఇస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సైనోహబ్ అనే సంస్థ ఆధ్వర్యంలో 2024 డిసెంబరు నుంచి ఈ తరగతులు జరుగుతున్నాయి. కళాశాలలోని కెరియర్ గైడెన్స్‌సెల్ ఆధ్వర్యంలో జరిగే ఈ తరగతుల్లో సైనోహబ్‌కు చెందిన నిపుణులు విద్యార్థులకు ఆయా అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. హుస్నాబాద్ డిగ్రీ కళాశాలకు చెందిన 100 మంది, పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 50 మంది.. మొత్తం 150 మంది విద్యార్థులు ఈ తరగతులకు హాజరవుతున్నారు. ఆరు నెలల పాటు సాగే ఈ శిక్షణకు ప్రభుత్వం రూ. కోటీ వరకు ఖర్చు చేస్తోంది. ఈ తరగతుల కోసం ప్రత్యేక సిలబస్ అమలు చేస్తున్నారు. తరగతి గదుల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు. అలాగే, సుమారు రూ.30 లక్షల వ్యయంతో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌నూ ఇటీవల ప్రారంభించారు. విద్యార్థులది గ్రామీణ నేపథ్యం కావడంతో తొలుత స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి.. శిక్షణ తరగతుల్లో విద్యార్థులు ఆంగ్లంలో చేసిన ప్రసంగాలను చూసి అబ్బురపడ్డారు. విద్యార్థులు మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్ కళాశాలలో వచ్చిన ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్‌కు కృతజ్ఞతలు
విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సైనోహబ్ ద్వారా నిర్వహిస్తోన్న శిక్షణ తరగతులు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాన్ని హుస్నాబాద్ కళాశాలకు మంజూరు చేయడం సంతోషకరం. ఇందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరికి కృతజ్ఞతలు
- విజయగిరి భిక్షపతి, హుస్నాబాద్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
ఇంగ్లిష్ మాట్లాడటం సులువైంది
ఈ శిక్షణ వల్ల ఇంగ్లిష్ మాట్లాడటం నాకు సులువైంది. ఈ శిక్షణ ద్వారా నేను నేర్చుకున్న స్కిల్స్ చూసి మా అమ్మానాన్న సంబరపడుతున్నరు. ఇది అదృష్టంగా భావిస్తున్నాం - సీహెచ్ జ్యోతి,
బీజడ్సీ ఫైనల్ ఇయర్