Share News

ఓయూలో ఆందోళనల రద్దు ఉత్తర్వుపై.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

ABN , Publish Date - Mar 17 , 2025 | 04:48 AM

వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నమే ఈ సర్క్యులర్‌ అని ఆరోపించాయి.

ఓయూలో ఆందోళనల రద్దు ఉత్తర్వుపై.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

  • ఆర్ట్స్‌ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన

  • ధర్నా.. సర్క్యులర్‌ పత్రాల దహనం

ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నమే ఈ సర్క్యులర్‌ అని ఆరోపించాయి. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు ఆదివారం ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో భేటీ అయ్యారు. అనంతరం ఆందోళన నిర్వహించి, సర్క్యులర్‌ ప్రతులను తగులబెట్టారు. వర్సిటీ అధికారుల నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా మరో ఉద్యమానికి కార్యాచరణను రూపొందించారు. ఈ ధర్నాలో ఏబీవీపీ, యూటీఏసీటీఎస్‌, ఎన్‌ఎ్‌సయూఐ తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఆంధ్రా పాలకులు ఇలాంటి ఆంక్షలు పెట్టి ఉంటే.. వర్సిటీలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగి ఉండేది కాదన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిర్బంధాలను అడ్డుకుంటామన్నారు. విద్యార్థి సంఘాలతో చర్చించకుండా.. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం దారుణమన్నారు. ఐదు నెలల వీసీ పాలనలో.. సమస్యలు చెప్పుకొనేందుకు వెళ్లిన దివ్యాంగ విద్యార్థులను అమానుషంగా అరెస్టు చేయించి, వారిపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. వర్సిటీ అధికారుల నిర్ణయంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ప్రొఫెసర్‌ సి.కాశీం, ఏఐడీఎ్‌సవో రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌రాజ్‌ సైతం తాజా సర్క్యులర్‌ను తప్పుబట్టారు.


బీఆర్‌ఎ్‌సదే ఆ పాపం: చనగాని దయాకర్‌

విశ్వవిద్యాలయాల్లో నిర్బంధాలను విధించింది గత బీఆర్‌ఎస్‌ సర్కారేనని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. ఆ ముళ్ల కంచెలను తొలగించామని గుర్తుచేశారు. ‘‘వర్సిటీ అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌తో విద్యార్థులు, పరిశోధకులకు ఏం నష్టం జరుగుతుందో కేటీఆర్‌ చెప్పాలి. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఓయూను అష్టదిగ్బంధం చేశారు. నిరుద్యోగి మురళి ముదిరాజ్‌ ఆత్మహత్య చేసుకుంటే.. పోలీసులతో విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేయించి, జైళ్లలో నిర్బంధించారు. అధికారం పోగానే.. కేటీఆర్‌ ఇప్పుడు ఓయూపై కపట ప్రేమను నటిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.


ప్రశాంత వాతావరణం కోసమే: రిజిస్ట్రార్‌ నరేశ్‌రెడ్డి

ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు విద్యనభ్యసించాలనే ధర్నాలు, ఆందోళనలకు వ్యతిరేకంగా సర్క్యులర్‌ను జారీ చేశామని వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నరేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. పరిపాలన భవనం, అధికారుల చాంబర్లలో ఆందోళనలు చేయడం సరికాదని, విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు ఈ విషయాన్ని సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ.. రిజిస్ట్రార్‌, వీసీ చాంబర్లలోకి చొరబడడం లాంటి ఘటనలతో పాలనకు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 04:48 AM