Nature: ఆనందారణ్యం.. ఆధ్యాత్మికం!
ABN , Publish Date - Dec 26 , 2024 | 03:32 AM
పచ్చని ప్రకృతి.. పిల్లగాలులు.. సెలయేళ్లు, వాటర్‌ఫాల్స్ మధ్య వన్య ప్రాణులను చూస్తూ గడిపితే ఆ ప్రశాంతతే వేరు! దీనికి ఆధ్యాత్మిక వాతావరణం తోడైతే గనక అక్కడి నుంచి కదలబుద్దేయదు! మరికొంత సమయం గడిపితే బాగుణ్ను అని అనిపిస్తుంది.
టూరిజం ప్రత్యేక కారిడార్‌గా కవ్వాల్ అభయారణ్యం
ఎకో, టెంపుల్ టూరిజంల కోసం రూట్‌మ్యాప్ సిద్ధం
అభయారణ్యం, వాటర్‌ఫాల్స్, ప్రాజెక్టుల సందర్శనకు ఏర్పాట్లు
బాసర, కదిలి, బూరుగుపల్లి ఆలయాల సందర్శనకు అవకాశం
నిర్మల్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పచ్చని ప్రకృతి.. పిల్లగాలులు.. సెలయేళ్లు, వాటర్‌ఫాల్స్ మధ్య వన్య ప్రాణులను చూస్తూ గడిపితే ఆ ప్రశాంతతే వేరు! దీనికి ఆధ్యాత్మిక వాతావరణం తోడైతే గనక అక్కడి నుంచి కదలబుద్దేయదు! మరికొంత సమయం గడిపితే బాగుణ్ను అని అనిపిస్తుంది. ఇదే అనుభూతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అటవీ ప్రాం తంలో పర్యాటకులను కట్టిపడేయనుంది. టూరిజం ప్రత్యేక కారిడార్‌గా కవ్వాల్ అభయారణ్యాన్ని ప్రభు త్వం అభివృద్ది చేయనుంది. ఇందుకు ఎకో టూరిజం (పర్యావరణహిత పర్యాటకం) పేరిట అధికారులు ప్రత్యేక ప్రతిపాదనలతో కూడిన రూట్ మ్యాప్ ను రూపొందించారు. ఈ రూట్‌మ్యా్‌పలో భాగంగా టెంపుల్ టూరిజాన్ని చేర్చనున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ ఆలయం, ఆ జిల్లాలోని కదిలి పాపహరేశ్వరాలయం, బూరుగుపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఆదిలాబాద్ సమీపంలోని సూర్య దేవాలయం వంటి వాటన్నింటినీ కలిపి టెంపుల్ టూరిజం కారిడార్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు, వాటికి ఆమోదం లభించి, ఆ తర్వాత నిధులు మంజూరైన వెంటనే పనులు మొదలు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, మహారాష్ట్రలోని తడోబా తరహాలో కవ్వాల్ టైగర్ జోన్‌ను కూడా టూరిజం కారిడార్‌గా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు.
నిర్మల్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని 80వేల హెక్టార్లల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ టైగర్‌జోన్‌లో 20శాతం మేర కోర్, బఫర్ ఏరియా ల్లో మాత్రమే ఈ టూరిజం స్పాట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అడవిలో సందర్శించేందుకు అనుకూలమైన ప్రదేశాలకు సంబందించి ప్రత్యేక రూట్ మ్యాప్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఈ టూరిజం స్పాట్ నిర్వహణను పీపీపీ (పబ్లిక్, ప్రైవేటు, పార్టీసిపేషన్) కింద నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం, గంగాపూర్, ఎక్బాల్‌పూర్, ఉడుంపూర్, కల్వకుంట్ల, అకొండపేట్, గంగాపూర్ ప్రాంతాలను ఈ టూరిజం స్పాట్ పరిధిలోకి చేర్చారు. కడెం మండలంలోని ఉడుంపూర్ వద్ద గల ఐలవ్ కవ్వాల్ లోగో ప్రాంతం నుంచి మైసంపేట్, గంగాపూర్, లక్ష్మిపూర్ ప్రాంతాలను చూసేందుకు ప్రత్యేకంగా సఫారీని ఏర్పాటు చేయనున్నారు. టూరిస్టుల కోసం దిమ్మదుర్తి వద్ద 12, జన్నారం వద్ద 10 చొప్పున కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ టూరిజం స్పాట్ కింద కడెం ప్రాజెక్ట్‌ను కూడా కవర్ చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు సమీపంలో దాదాపు 550 మీటర్ల ఎత్తున గల గుట్టపై అధికారులు ఇప్పటికే వాచ్ టవర్‌ను నిర్మించారు. టూరిస్టులను ఇక్కడి వరకు తీసుకువెళ్లి కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంతో పాటు దట్టమైన అడవులను చూపించనున్నారు.
అందమైన గడ్డిమైదానాలు
ప్రస్తుతం అటవీ శాఖ 50 ఎకరాల్లో ఇప్పటికే అందమైన గడ్డి మైదానాలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ టూరిజం స్పాట్‌లో ఈ గడ్డి మైదానాలను కూడా చేర్చారు. మరో నెల రోజుల్లో మొత్తం ఈ టూరిజం స్పాట్ పనులన్నీ పూర్తి కానున్నాయి. ఇప్పటికే సఫారీ వాహనాలు తిరిగేందుకు రోడ్ల నిర్మాణాలను సైతం అధికారులు పూర్తి చేశారు. టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ పేరిట ఏకో టూరిజం కోసం ఈ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ప్రత్యేక గైడ్‌లను కూడా నియమించనున్నారు. ఈ టూరి జం స్పాట్ నిర్వహణ మాత్రం పీపీపీ పద్ధతి కింద చేపట్టనుండగా.. ప్రత్యేక చెక్‌పోస్టుల వద్ద అటవీ శాఖ ఎంట్రీ ఫీజు వసూలు చేయనుంది.