Share News

KTR: అభయ హస్తమని చెప్పి.. భస్మాసుర హస్తమయ్యారు!

ABN , Publish Date - Aug 01 , 2024 | 03:30 AM

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో తీయ్యటి, పుల్లటి హామీలిచ్చి.. అధికారంలోకొచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: అభయ హస్తమని చెప్పి.. భస్మాసుర హస్తమయ్యారు!

  • 420 హామీలతో ప్రజలను మోసం చేశారు

  • రాష్ట్రాన్ని రోగి అనంటే పెట్టుబడులొస్తాయా?

  • సబితక్క, సునీతక్కపై సీఎం హీనాతిహీనంగా

  • నోరుపారేసుకున్నారు.. క్షమాపణలు చెప్పాలి

  • నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నిరసనలు

  • రేవంత్‌, నేను స్నేహితులమే..

  • పదేళ్లుగా మాకు చెడింది: కేటీఆర్‌

  • ఒక్క కొలువిచ్చినట్లు వారు చెప్పినా రిజైన్‌ చేస్తా!

  • ఆంక్షలు, కొర్రీలతో రుణమాఫీలో కోతలు పెడుతున్నారు

  • రీకాల్‌ లేనందున మరో 4 ఏళ్లు మిమ్మల్ని భరించక తప్పదు

  • సబితక్క, సునీతక్కపై సీఎం నోరుపారేసుకున్నారు: కేటీఆర్‌

  • సీఎం వ్యాఖ్యలపై నేడు నిరసనలు

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో తీయ్యటి, పుల్లటి హామీలిచ్చి.. అధికారంలోకొచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చినవి 420 హామీలని.. ఓట్ల సమయంలో ప్రజలకు అభయ హస్తమిచ్చి.. అధికారంలోకి వచ్చాక భస్మాసుర హస్తంగా పరిణమించారని విమర్శించారు. హామీల విషయంలో ఎన్నికలకు ముందు రజనీకాంత్‌ తరహాలో మాట్లాడి.. ఆ తర్వాత గజనీకాంత్‌లా మారారని మండిపడ్డారు. ‘‘మిమ్మల్ని అభినందించడం కాదు... అభిశంసించాలి. రీకాల్‌ విధానం లేనందువల్ల మరో నాలుగేళ్లు మిమ్మల్ని భరించక తప్పని పరిస్థితి నెలకొంది’’ అని రేవంత్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై, అనంతరం సభ బయట మీడియా పాయింట్‌ వద్ద కేటీఆర్‌ మాట్లాడారు.


రేవంత్‌ సర్కారు ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించినా లక్ష మందితో తాము సన్మానం చేస్తామని ప్రకటించారు. తమ హయాంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, అందులో 1.8 లక్షల ఉద్యోగాలు తామిచ్చామని పేర్కొన్నారు. తామిచ్చిన నోటిఫికేషన్లలోంచే 30వేల ఉద్యోగాలను ఇచ్చి.. మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెబుతున్నారని ఆక్షేపించారు. సభను వాయిదా వేసి అశోక్‌నగర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళదామని, కాంగ్రెస్‌ సర్కారు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చినట్లు అక్కడి నిరుద్యోగులు చెబితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు.


గోబెల్స్‌ బతికి ఉంటే గనక కాంగ్రెస్‌ సర్కారు వద్ద ట్యూషన్‌ చెప్పించుకునేవారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉండగా రూ.లక్ష దాకా మాఫీ చేయడానికి రూ.16 వేల కోట్లు అయ్యాయని, ఇప్పుడు రూ.1.5 లక్షల రుణమాఫీకి రూ.12 వేల కోట్లు ఎలా సరిపోతాయి? అని ప్రభుత్వాన్ని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆంక్షలు, కొర్రీలతో ఎంతోమందిని పథకానికి దూరం చేశారని విమర్శించారు. తాము రైతుబంధును నాట్లు వేసేటప్పుడు ఇస్తే.. కాంగ్రెస్‌ ఓట్లు వేసేటప్పుడే నిధులు జమచేసిందని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక ఇప్పటిదాకా 382 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. ఫసల్‌ బీమా యోజనను మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ బేకార్‌ అంటోందని, అది మనమెందుకు తీసుకోవాలి? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.


  • బట్టకాల్చి మీదేసే ధోరణి..

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై మాట్లాడేముందు ఆ పదేళ్లకు ముందున్న పరిస్థితి ఎలా ఉండేదనేదానిపై మాట్లాడాలని ప్రభుత్వానికి కేటీఆర్‌ సూచించారు. పదేళ్ల క్రితం 4లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర సంపద, ప్రస్తుతం రూ.14.64 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. తలసరి ఆదాయంలోనూ దేశంలో తెలంగాణ నంబర్‌ 1 గా ఉందన్నారు. ఆదాయంగా వచ్చే ప్రతి రూపాయిలో 47పైసలు జీతభత్యాలు, వడ్డీలు, సబ్సిడీలకు వెళుతున్నాయని... 53 పైసలు అభివృద్ధి పనులకు మిగులుతున్నాయని చెప్పారు. 2014లో రూ.369 కోట్ల మిగులుతో రాష్ట్రం ఇస్తే... 2023లో రూ.5944 కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించామని చెప్పారు. జీతాల కోసమూ అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందంటూ రాష్ట్రం గురించి ప్రచారం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రచారం చేయడాన్ని ఆపాలని సూచించారు. కాంగ్రెస్‌ సర్కారు తమపై బట్టకాల్చి మీదేసి బద్నాం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని క్యాన్సర్‌ రోగిలా, ఎయిడ్స్‌ రోగిలా ఉందని చెబితే బయట నుంచి పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు.


  • సీఎంగా రేవంత్‌ అన్‌ఫిట్‌

మహిళాసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్‌ అసభ్యంగా, హీనాతిహీనంగా మాట్లాడారని.. ఏ నాయకుడు కూడా అంత అసభ్యంగా మాట్లాడరని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ అక్కలను నమ్ముకుంటే నన్ను ముంచారు. రేపు నీ బతుకూ నికృష్ణంగా జూబ్లీ బస్‌స్టాండ్‌ అవుతుంది’’ అంటూ సీఎం మాట్లాడారని, ఇది ఇద్దరు మహిళా సభ్యులకే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ అవమానమని పేర్కొన్నారు. రేవంత్‌ వెంటనే ఆడబిడ్డలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


మీడియా పాయింట్‌ వద్దకు కేటీఆర్‌ వచ్చి ప్రభుత్వానికివ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎంగా రేవంత్‌ అన్‌ఫిట్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సభ్యులను ఉద్దేశించి నోటికొచ్చినట్లు వాగడం తగదని, సిగ్గు తెచ్చుకుని, బుద్ధి తెచ్చుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా తమ ఆడబిడ్డలను ఉద్దేశించి ఏ మొహం పెట్టుకుని సభకు వస్తారు అని ఎలా అంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సబిత, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలపై గురువారం నిరసనలు చేపట్టాలని, రేవంత్‌ దిష్టిబొమ్మ దహనం చేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.


12.jpg

  • ఆ 30 వేల ఉద్యోగాలు మీరెందుకు ఇవ్వలేదు: సీతక్క

30 వేల ఉద్యోగాలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తే... ఆ ఉద్యోగాలు తామిచ్చిన నోటిఫికేషన్లతో వచ్చాయని కేటీఆర్‌ చెబుతున్నారని, మరీ ఆ ఉద్యోగాలు పదేళ్లు అధికారంలో ఉండగా ఎందుకివ్వలేకపోయారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. తాము అధికారంలోకొచ్చి 8 నెలలు కాలేదని, హామీలు అమలు చేసేందుకు తమకు సమయం ఉందన్నారు. అధికారంలోకి వచ్చాకా పెట్టిన పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌కే ఇంత భయపడితే ఎట్లా? అని మంత్రి శ్రీధర్‌ బాబు ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ దళితులను మోసం చేసినంతగా మరెవరినీ చేయలేదని విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. పదేళ్లలో దళితుల కోసం 73 వేలు కేటాయించి... 28 వేల కోట్లను మాత్రమే బీఆర్‌ఎస్‌ ఖర్చు చేసిందన్నారు. దళిత బంధు కోసం 39 వేల కోట్లు ప్రకటించి, రూ.3 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 03:30 AM