Farmers: మిర్చి రైతుకు నష్టాల ఘాటు!
ABN , Publish Date - Dec 17 , 2024 | 05:50 AM
మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎర్ర బంగారం ధరలు నేలచూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు.
భారీగా పడిపోయిన ధరలు
ఇప్పటికే కోటి బస్తాలు కోల్డ్ స్టోరేజీల్లో
గతేడాది రూ.23 వేల వరకు పలికిన ధర
ఈసారి క్వింటా 12 వేల నుంచి 16 వేలే..
విదేశాలకు ఎగుమతులు తగ్గడమే కారణం
వరంగల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎర్ర బంగారం ధరలు నేలచూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు. గతేడాది ఇదే నెలలో గరిష్ఠంగా రూ.23 వేల ధర పలికిన ఎండు మిర్చి, ప్రస్తుతం రూ.16 వేలు కూడా దాటడం లేదు. క్వింటాల్ మిర్చికి రూ.7 వేల వరకు నష్టాలతో అమ్ముకోవాల్సిన దుస్థితి. గతేడాదే తక్కువ ధరలు వచ్చాయని కోటి బస్తాలకు పైగా మిర్చిని కోల్డ్‌స్టోరేజీల్లో రైతులు నిల్వ చేశారు. ఇప్పుడు గతం కంటే ధరలు పతనం కావటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విదేశీ మార్కెట్‌కు మిర్చి ఎగుమతులు తగ్గటంతోనే ధరలు పతనమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2020-22 మధ్యకాలంలో మిర్చికి మంచి ధరలు పలకడంతో చాలా మంది రైతులు పత్తిని కాదని మరీ మిర్చి వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ మహబూబ్‌నగర్‌లలో అత్యధికంగా మిర్చి సాగు చేస్తున్నారు.
అయితే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మిర్చిని పండించటం ఒక ఎత్తయితే.. ఆరబోసి, ఎండబెట్టడం మరో ఎత్తు.. ఇంతా చేసి మార్కెట్‌కు తీసుకెళ్తే ఆశించిన ధర దక్కడం లేదు. గతేడాది ఆశించిన స్థాయిలో ధరలు లభించకపోవటంతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు.. ఈ ఏడాది కూడా ఎర్ర బంగారం ధరలు పడిపోతుండటం గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. కొత్త మిర్చి ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తుండగా.. రైతులు ఎక్కువ సాగు చేసే తేజ రకం మిర్చికి రూ.12 వేల నుంచి రూ.16 వేల వరకు.. వండర్ హాట్ మిర్చికి రూ.11 వేల నుంచి రూ.14 వేల మధ్య ధరలున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే తేజ రకం మిర్చికి క్వింటాలుకు రూ.7 వేల వరకు, వండర్‌హాట్ రకానికి రూ.14 వేల వరకు ధరలు తగ్గినట్టుగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇటు గతేడాది కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న ఏసీ మిర్చికి అదే స్థాయిలో ధరలు తగ్గాయి. ఒక్క వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లోనే సుమారు 25 లక్షల బస్తాలను నిల్వ చేయగా, ఖమ్మంతో పాటు మిగతా వ్యవసాయ మార్కెట్లలో 75 లక్షలకు పైగా బస్తాలను భద్రపరిచారు. గతేడాది డిసెంబరులో తేజ రకం ఏసీ మిర్చికి గరిష్ఠంగా రూ.24,250 ధర ఉండగా, వండర్‌హాట్ రకానికి రూ.27,300 వరకు పలికింది. అయితే ప్రస్తుతం ఏసీ తేజ రకానికి రూ.15,500 వరకు, వండర్ హాట్ రూ.13 వేల వరకే ధరలున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ధరల పతనంతో పాటు కోల్‌స్టోరేజీల్లో నిల్వకు బస్తాకు రూ.150 నుంచి రూ.300 వరకు చెల్లించటం అదనపు భారంగా మారిందని వాపోతున్నారు.
ఎగుమతులు లేకనే..
మిర్చి ధరల పతనానికి విదేశాలకు ఎగుమతులు తగ్గడమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం మిర్చికి మంచి ధరలు రావటంతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిందని.. అయితే అదే స్థాయిలో ఎగుమతులు లేవంటున్నారు. మిర్చి ఎగుమతుల్లో 70 శాతం చైనా, శ్రీలంక, ఽథాయ్‌లాండ్ దేశాలకేనన్నారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎగుమతులపై ప్రభావం పడిందని.. అలాగే చైనాకు కూడా భారీగా ఎగుమతులు తగ్గటంతో ధరల పతనానికి దారి తీసిందని అంటున్నారు.