MonkeyPox: మంకీపాక్స్‌పై తెలంగాణ సర్కార్ అప్రమత్తం.. గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు
ABN , Publish Date - Aug 23 , 2024 | 02:59 PM
విదేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్(Monkey Pox) వ్యాధిపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వ్యాధి ప్రవేశించకుండా పలు చర్యలు తీసుకుంది.
హైదరాబాద్: విదేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్(Monkey Pox) వ్యాధిపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వ్యాధి ప్రవేశించకుండా పలు చర్యలు తీసుకుంది. ఎయిర్ పోర్ట్‌ల్లో ప్రయాణికులను చెక్ చేసి.. ఆరోగ్య సమస్యలుంటే వారిని ప్రత్యేకంగా ఉంచుతోంది. మంకీపాక్స్ వ్యాప్తిపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనుమానితులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండటానికి గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులను సిద్ధం చేశారు. ఎంపాక్స్ అనుమానితులను, వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించేందుకు అక్కడే ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఎంపాక్స్ చికిత్స కోసం ప్రస్తుతం 20 పడకలు కేటాయించారు. ఇందులో పురుషులకు, మహిళలకు పదేసి పడకలు కేటాయించినట్లు వైద్యులు తెలిపారు.
ఫీవర్ ఆస్పత్రిలో ఆరు పడకలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేసులు నమోదు కాలేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎంపాక్స్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని చెప్పారు. మంకీ పాక్స్ ప్రస్తుతం పాకిస్థాన్ సహా ఆఫ్రికాలోని పలు దేశాల్లో విజృంభిస్తోంది. కాంగో, నైజీరియా, కామెరూన్ దేశాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆయా దేశాల నుంచి తెలంగాణకు వచ్చే వారిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. అనుమానితులు ఐసోలేషన్‌లో ఉండటం, లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు.
మంకీపాక్స్ కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును సిద్ధం చేసినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్ కుమారి తెలిపారు. మంకీ పాక్స్ బాధితుల చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మంకీపాక్స్ లక్షణాలు..
జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, శరీరంలోని వివిధ అవయవాలపై దద్దుర్లు, దురద, వెన్నునొప్పి, చలి, తీవ్ర అలసట. ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.