Share News

Transco: బకాయిలు చెల్లించకుంటే లైన్లు వెయ్యం, విద్యుత్‌ ఇవ్వం

ABN , Publish Date - Nov 06 , 2024 | 03:44 AM

డెవల్‌పమెంట్‌ చార్జీలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించకపోతే ఎత్తిపోతల పథకాలకు సబ్‌స్టేషన్లు నిర్మించలేమని, కొత్త లైన్లు వేయలేమని, విద్యుత్‌ కూడా ఇవ్వలేమని నీటిపారుదల శాఖకు ట్రాన్స్‌కో స్పష్టం చేసింది.

Transco: బకాయిలు చెల్లించకుంటే లైన్లు వెయ్యం, విద్యుత్‌ ఇవ్వం

  • నీటిపారుదల శాఖకు ట్రాన్స్‌కో అల్టిమేటం

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): డెవల్‌పమెంట్‌ చార్జీలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించకపోతే ఎత్తిపోతల పథకాలకు సబ్‌స్టేషన్లు నిర్మించలేమని, కొత్త లైన్లు వేయలేమని, విద్యుత్‌ కూడా ఇవ్వలేమని నీటిపారుదల శాఖకు ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. నీటి పారుదల శాఖలోని ఎత్తిపోతల పథకం సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ/చీఫ్‌ ఇంజనీర్లతో ట్రాన్స్‌కో డైరెక్టర్లు జగత్‌రెడ్డి, సూర్యప్రకాష్‌ విద్యుత్‌ సౌధలో మంగళవారం సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద రూ.2000 కోట్లు, కాళేశ్వరం అదనపు టీఎంసీ పథకానికి రూ.2700 కోట్లు, సీతారామ ఎత్తిపోతల పథకం కింద రూ.120 కోట్లు సహా దాదాపు రూ.6 వేల కోట్ల దాకా డెవల్‌పమెంట్‌ చార్జీలు కింద తమకు చెల్లించాల్సి ఉందన్నారు.


అలాగే, 2014 నుంచి ఇప్పటిదాకా ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.14,957 కోట్ల విద్యుత్‌ బిల్లులు నీటిపారుదల శాఖ బకాయి ఉందని పేర్కొన్నారు. తక్షణమే ఆయా బకాయిలను చెల్లించాలని ట్రాన్స్‌కో ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అలాగే, 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లు/లైన్ల కోసం నిర్దేశిత మొత్తంలో నిధులు ఇస్తేనే పనులు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ఎత్తిపోతల పధకాలకు సబ్‌స్టేషన్లు, లైన్లను ట్రాన్స్‌ కో వేస్తుండగా డిస్కమ్‌లు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. సబ్‌స్టేషన్లు, లైన్లు వేసినందుకు డెవల్‌పమెంట్‌ చార్జీలను నీటిపారుదల శాఖ ట్రాన్స్‌కోకు చెల్లించాలి. అలాగే, డిస్కమ్‌లకు ఇంధన, స్థిర చార్జీలు చెల్లించాలి. దాదాపు ఆరేళ్లుగా ఈ చెల్లింపులు జరగకపోవడంతో పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి.

Updated Date - Nov 06 , 2024 | 03:44 AM