ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramoji Rao: అర్ధ శతాబ్ది... అద్వితీయ ముద్ర!

ABN, Publish Date - Jun 09 , 2024 | 05:07 AM

రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.

  • తెలుగునాట సామాజిక జీవనంపై రామోజీ సంతకం.. ప్రయోగాలే వేదికగా వ్యాపార సామ్రాజ్య విస్తరణ

హైదరాబాద్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): రామోజీరావు (Ramoji Rao) లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్‌ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు. మీడియా మొఘల్‌ రామోజీరావు కేవలం వ్యాపారవేత్త కాదు. తెలుగు రాష్ట్రాల అర్ధ శతాబ్దపు రాజకీయాలను, సామాజిక జీవనాన్ని తన మీడియా సంస్థల ద్వారా ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యాపారవేత్తగా ఆరు దశాబ్దాల ప్రయాణంలో వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించడమే కాకుండా తన సంస్థల ద్వారా దాదాపు పాతిక వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. యాడ్‌ ఏజెన్సీతో తొలి అడుగులు వేసిన ఆయన తన జీవితకాలంలో స్పృశించిన వ్యాపార రంగాలు చూస్తే భారతదేశ వాణిజ్యవేత్తల్లో చేతివేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత కొద్ది మందికే సాధ్యమైన వ్యవహారం అది.

రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!



రైతు కుటుంబం నుంచి వ్యాపారవేత్తగా ఎదగాలన్న ఆకాంక్షతో ఢిల్లీదాకా అన్ని అవకాశాలను అన్వేషించి, చివరకు హైదరాబాద్‌లో చిట్‌ఫండ్‌ కంపెనీ ద్వారా తన విజయయాత్రను ప్రారంభించారు. అందులో కుదురుకున్నాక రైతుల కోసం ఏదైనా చేయాలన్న తపనతో 1969 నుంచి దాదాపు ఐదు దశాబ్దాల పాటు అన్నదాత పేరుతో రైతుల కోసం పత్రిక నడిపారు. తర్వాత ఐదేళ్లకు ‘ఈనాడు’ ద్వారా దినపత్రిక రంగంలో అడుగు పెట్టారు. అప్పటికే దిగ్గజ పత్రికలున్న నేపథ్యంలో తెలుగునాట పెద్దగా రాజకీయ ప్రాధాన్యం లేని వైజాగ్‌ నుంచి ‘ఈనాడు’ను ప్రారంభించి, ప్రయోగాలనే మెట్లుగా చేసుకుంటూ రాష్ట్రమంతటా విస్తరించారు. దేశంలోనే తొలిసారిగా స్థానిక వార్తల కోసం ట్యాబ్లాయిడ్‌ను తీసుకొచ్చారు. వాటి కోసం మండల స్థాయులో విలేకరులను నియమించే సంప్రదాయానికి తెర తీశారు. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి, ఉదయం 6 గంటలకే పత్రిక ఇంటి ముందుకు వచ్చే సంప్రదాయానికి తెరతీశారు.


సినిమాల్లోకి..

తెలుగు ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేస్తున్న రంగం సినిమాలేనని రామోజీరావు గ్రహించారు. చిన్న సినిమాలతో మొదలెట్టి వివిధ భాషల్లో 85 సినిమాలు నిర్మించారు. కొద్ది బడ్జెట్‌తో సమకాలీన సమస్యలను కథలుగా తీసుకొని భారీ విజయాలు సాధించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ సిటీని నిర్మించారు. టాలీవుడ్‌ మాత్రమే కాకుండా బాలీవుడ్‌, కోలీవుడ్‌, ఇతర భాషా ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో సినిమాలు తీసుకొనే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. దేశం గర్వించదగ్గ బాహుబలి లాంటి సినిమా టాలీవుడ్‌లో రూపొందడానికి ఆయన పరోక్ష సహకారం ఉంది. చెన్నై, ముంబైలకు పోటీగా ప్రస్తుతం హైదరాబాద్‌ భారతీయ సినిమాకు కీలకంగా మారడంలో ఆయన పాత్ర ఉంది. ఫిల్మ్‌సిటీని పర్యాటక ప్రాంతంగా మలిచి ఏటా 13 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా వందల మంది గాయకులను తెలుగునేలకు పరిచయం చేశారు.


టీవీ రంగంలోకి..

దూరదర్శన్‌ ఏకఛత్రాధిపత్యం నశించి స్టార్‌ టీవీతో దేశంలో ప్రైవేటు టీవీ చానల్‌ విప్లవం ముంచుకొస్తున్న విషయాన్ని రామోజీరావు గ్రహించారు. 1995లోనే తెలుగునాట ప్రైవేటు చానల్‌కు తెర తీశారు. క్రమంగా వివిధ భాషల్లో 12 టీవీ చానెళ్లు స్థాపించి దేశంలోనే అతిపెద్ద చానళ్ల వ్యవస్థను సృష్టించారు. మీడియా మొఘల్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.


ఫీడ్‌ బ్యాక్‌కు పెద్దపీట

రామోజీరావు ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌ కోసం పరితపించేవారు. తన పత్రిక కథనాల మీద ఎవరు అభ్యంతరాలు లేవనెత్తినా స్పందించి తిరుగు లేఖలు రాసేవారు. సహేతుకమైన విమర్శలు చేస్తే, అభినందించి తన తప్పు దిద్దుకొనేవారు. ఆయన సంతకంతో లేఖలను అపురూపంగా దాచుకున్న వారు వేలమంది ఉంటారు. తన ఉద్యోగులు చెప్పిన విషయాలను కూడా రామోజీరావు అంతే శ్రద్ధగా వినేవారు. చాంతాడంత పొడుగు రిపోర్టులు రాసినా విసుక్కోకుండా చదివేవారు. ఎందులో ఏ మంచి ఆలోచన ఉంటుందో అన్నది ఆయన ఉద్దేశం.


తెలుగు అంటే ప్రాణం

రామోజీరావుకు తెలుగు భాష అంటే ప్రాణం. ఆధునిక కాలపు తెలుగుభాషా సేవకుల్లో అగ్రగణ్యుడు. పత్రికలో వాడుక భాషనే వాడాలని పట్టుబట్టారు. ప్రపంచీకరణలో భాగంగా తెలుగును ఇంగ్లిష్‌ మింగేస్తున్న విషయాన్ని గ్రహించి దాన్ని పరిహరించేందుకు తన పత్రిక, చానెళ్ల ద్వారా సాధ్యమైనంత కృషి చేశారు. వ్యవహారిక భాషలో ఉండే కథలు, నవలలను ఆదరించడం కోసం విపుల, చతుర పేరుతో మాసపత్రికలను నిర్వహించారు. ‘తెలుగు వెలుగు’ పేరుతో సాహితీ మాస పత్రికను, పిల్లల కోసం బాలభారతం మాస పత్రికను నడిపారు. ఆయన సేవలను గుర్తించి వెంకటేశ్వర వర్సిటీ డాక్టరేట్‌ ఇచ్చింది. తెలుగులో వ్యవహారిక పదకోశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు అదొక ప్రామాణిక నిఘంటువు. ఆయన న్యూస్‌టైం పేరుతో ఆంగ్లపత్రికను నిర్వహించారు.


యాక్టివిటీతో జనంలోకి..

పత్రిక జనంతో మమేకం అవ్వాలంటే వాళ్ల సమస్యలపై వార్తలు రాయడమే కాకుండా ప్రజల్లోకి వెళ్లి కార్యకలాపాలు చేపట్టాలన్నది రామోజీరావు విధానం. అందుకే, విపత్తులు వచ్చినపుడు సహాయ కార్యక్రమాల్లో, సామాజిక ఉద్యమాలు వచ్చినపుడు పాల్పంచుకోవడంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ వార్తలు రాయించేవారు. 1984లో ఎన్టీఆర్‌ను కేంద్రం అక్రమంగా గద్దె దించినపుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని కూడా అలాగే చేపట్టి నడిపించారు. తుఫాను బాధితులకు పాఠకుల నుంచి విరాళాలు సేకరించి ఇళ్లు నిర్మించి ఇచ్చారు.


టీడీపీకి అధికారంలో పాత్ర

1982లో ఎన్టీఆర్‌ నేతృత్వంలో టీడీపీ ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక ప్రభంజనం. ఆనాటిప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఢీకొని అధికారంలోకి రావడం దేశంలోనే ఒక సంచలనం. కొత్తగా ఏర్పడిన పార్టీకి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచి విస్తృత ప్రచారమిచ్చి ప్రజల్లోకి వెళ్లేందుకు రామోజీరావు కృషి చేశారు.


మొండి పట్టుదల

ఆత్మగౌరవం విషయంలో రామోజీరావుది రాజీలేని ధోరణి. చేయని తప్పుకు శిక్ష విధించాలని శాసన మండలి నిర్ణయించిందని భావించిన ఆయన మండలి ఆదేశాలకు తల వంచలేదు. చివరికి ప్రభుత్వమే మండలిని రద్దు చేసే పరిస్థితి వచ్చింది. తర్వాత కాలంలో కాంగ్రెస్‌, వైసీపీ ప్రభుత్వాలతోనూ ఆయన అదే రాజీలేని ధోరణిని కనబరిచారు. ఆరు దశాబ్దాలుగా చిట్‌ఫండ్స్‌ నిర్వహిస్తూ రాజకీయ ప్రత్యర్థులు సంక్షోభం సృష్టించే ప్రయత్నం చేసినా తట్టుకొని నిలబడ్డారు. ఫైనాన్స్‌ రంగం చిన్న తప్పుడు ప్రచారానికే కూలిపోయేంత సున్నితమైనది. ప్రభుత్వాలు తన మూలాలను దెబ్బ తీయాలని యత్నించినా చిట్టీల చందాదారుల నమ్మకంతో నిలబడ్డారు. ప్రైవేటు రంగంలో ఒకటో తారీఖునే జీతాలివ్వడం అనే సంప్రదాయాన్ని సృష్టించారు. మీడియా, సినిమా, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మాత్రమే కాకుండా హాస్పిటాలిటీ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లోనూ విస్తరించారు.


తొలి వ్యాపారం ఖమ్మం నుంచే...

ఖమ్మం సంక్షేమ విభాగం: దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో రామోజీరావుకు మంచి స్నేహం ఉంది. ఆయన సూచన మేరకు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన రామోజీ రావు.. ఖమ్మంలోనే తొలి వ్యాపారం ప్రారంభించారు. 1970లోనే ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయ ఉన్న భవనంలో రెండు గదులను అద్దెకు తీసుకొని ఎరువుల దుకాణం ఏర్పాటు చేశారు. అయితే, రైతుల కష్టాలను దగ్గర్నుంచి చూసిన ఆయన... బాకీలు వసూలు చేయలేకపోయారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో రెండేళ్లకే దానిని మూసివేశారు. ఆ తర్వాతి కాలంలో జలగం సూచనతో హైదరాబాద్‌కు వెళ్లి పలు వ్యాపారాలను ప్రారంభించారు. ఖమ్మంకు చెందిన విలాసరావుకు రామోజీతో బంధుత్వం ఉంది. మయూరి లాడ్జి బుచ్చిబాబు, డాక్టర్‌ హరీశ్‌రావుతోపాటు ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకాచౌదరి, తమ్మినేని వీరభద్రం, పోటు రంగరావు, కూనంనేని సాంబశివరావుతో ఆయనకు స్నేహ సంబంధాలు ఉన్నాయి.


నచ్చిన జర్నలిస్టు బీజీ వర్గీస్‌

ఇష్టమైన ఆహారం పెసరట్టు, మీగడ పెరుగు

మీడియా రంగ దిగ్గజమైన రామోజీరావుకు నచ్చిన జర్నలిస్టు ఒకరు ఉన్నారు. ఆయనే బీజీ వర్గీస్‌. రామోజీరావుకు ఇష్టమైన ఆహారం వేరుశనగ పప్పు, పెసరట్టు, మీగడ పెరుగు. ఎన్ని సాధించినా తీరని కల ఏదని ఆయన్ని అడిగితే.. తీరని దానిని తానెప్పుడూ కలగనని స్పష్టంగా చెప్పారు. ప్రపంచం మిమ్మల్ని ఏ విధంగా గుర్తించుకోవాలనుకుంటున్నారని అడిగితే.. ‘‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను’’ అనుకుంటే చాలని వ్యాఖ్యానించారు.


స్నేహం చేసే ముందే ఆలోచించాలి

‘‘స్నేహం చేసేముందే జాగ్రత్తగా ఆలోచించి చేయాలి.. ఒక సారి స్నేహం చేశాక తర్వాత ఆలోచించకూడదు. తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్నేహాన్ని, స్నేహితుడిని వదలకూడదు’’ అని రామోజీరావు తనతో తరచూ చెప్పేవారని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పలు సందర్భాల్లో చెప్పారు. రామోజీరావు ఓ చిత్రంలో నటించారు. ఆ చిత్రం పేరు ‘‘మార్పు’’ ఇందులో ఆయన న్యాయవాది పాత్రలో నటించారు. అథితి పాత్రలోనే అయినప్పటికీ ఆయన ఫొటో సినిమా పోస్టర్‌లో ముద్రించారు.


రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్‌ దాకా!

1962లోనే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు శంకుస్థాపన

1974 ఆగస్టు 10న ఈనాడు దినపత్రిక ప్రారంభం

చెరుకూరి రామోజీరావు ప్రస్థానం అనితరసాధ్యం

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి వెంకటసుబ్బారావు, వెంకట సుబ్మమ్మ దంపతుల కుమారుడైన రామోజీరావు.. 1936 నవంబరు 16న జన్మించారు. గుడివాడలోని మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో 1947లో 8వ తరగతిలో చేరి, సిక్స్త్‌ ఫాం వరకు అక్కడే చదివారు. గుడివాడ కళశాలలో ఇంటర్మీడియట్‌, బీఎస్సీ పూర్తి చేశారు. ఢిల్లీలోని ఓ యాడ్‌ ఏజెన్సీలో ఆర్టి్‌స్టగా తొలి ఉద్యోగం చేశారు. 1961ఆగస్టు 19న రమాదేవిని వివాహం చేసుకున్నారు. 1962లో హైదరాబాద్‌ వచ్చిన రామోజీరావు.. అదే ఏడాది మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు శంకుస్థాపన చేశారు. 1965లో కిరణ్‌ యాడ్స్‌ పేరిట మరో సంస్థను ప్రారంభించారు. 1969లో రైతుల కోసం అన్నదాత పత్రికను ప్రారంభించారు.


1970లో ఇమేజెస్‌ అవుట్‌డోర్‌ అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీకి శ్రీకారం చుట్టారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్‌ హోటల్‌ను నిర్మించి, ప్రారంభించారు. 1974 ఆగస్టు 10వ తేదీన విశాఖ వేదికగా ఈనాడు దినపత్రికకు శ్రీకారం చుట్టారు. 1975 డిసెంబరులో ‘ఈనాడు’ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 1976లో సినీ ప్రేమికుల కోసం సితార, 1978లో విపుల, చతుర మాసపత్రికలను ప్రారంభించారు. 1980లో ప్రియా ఫుడ్స్‌ పేరిట నోరూరించే పచ్చళ్లను తయారు చేసి, ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. 1983లో ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థను ప్రారంభించారు. 1992-93 మధ్య ఈనాడు ద్వారా సారాపై సమరం ప్రకటించిన రామోజీ రావు.. మద్య నిషేధంపై ఉత్తర్వులు వచ్చే వరకూ పోరాడారు. ప్రపంచంలోనే అతి పెద సినీ స్టూడియోగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్‌ సిటీని 1996లో స్థాపించారు. 2002లో ఈటీవీ ఆరు ప్రాంతీయ చానళ్లను ప్రారంభించి, టీవీ రంగంలో సరికొత్త మార్పునకు నాంది పలికిన రామోజీరావును బీడీ గోయెంకా అవార్డు, యుధ్‌వీర్‌ అవార్డు వరించాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్‌ అవార్డును ప్రకటించింది.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 07:23 AM

Advertising
Advertising