Share News

Rachakonda CP: పోలీసులు సివిల్‌ వివాదాలకు దూరంగా ఉండాలి..

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:36 AM

సివిల్‌ వివాదాలకు పోలీసులు దూరంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) సూచించారు. నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో నిర్వహించిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్ల ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు.

Rachakonda CP: పోలీసులు సివిల్‌ వివాదాలకు దూరంగా ఉండాలి..

  • రాచకొండ సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్‌ సిటీ: సివిల్‌ వివాదాలకు పోలీసులు దూరంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) సూచించారు. నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో నిర్వహించిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్ల ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు. నేరాల నియంత్రణ, నేరస్థులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీటీవీ ఫుటేజీలను వినియోగించుకోవాలన్నారు. పాత నేరస్థుల కదలికపై నిఘా ఉంచాలని, స్టేషన్‌కొచ్చే వారితో మర్యాదతో మసలుకోవాలని హితవుపలికారు. మహిళలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండాలని.. డ్రగ్స్‌ సరఫరా, విక్రయంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డీసీపీలు రాజే చంద్ర, ప్రవీణ్‌ కుమార్‌, కరుణాకర్‌, అరవింద్‌ బాబు, సునీతారెడ్డి, ఉషా విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: రూ.2 లక్షల రుణం ఇస్తామని.. రూ.1.20 లక్షలు కాజేశారు


గసగసాల పౌడర్‌, ఎండీఎంఏ విక్రేతల అరెస్ట్‌

బస్సులు, లారీలు, రైళ్ల ద్వారా నగరానికి మత్తు పదార్థాలు తరలించి విక్రయిస్తున్న ఇద్దరిని ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ, జవహర్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌తో కలిసి కేసు వివరాలను సీపీ వెల్లడించారు. రాజస్థాన్‌ జోథ్‌పూర్‌కు చెందిన పెయింటర్‌ ఓమా రామ్‌ అలియాస్‌ ఓం ప్రకాష్‌ (35) నల్లమందు, పాపిస్ట్రా పౌడర్‌ విక్రయించేవాడు. అదే రాష్ట్రానికి చెందిన సన్వాలరామ్‌ (33) చందానగర్‌(Chandanagar)లో ఉంటూ రోలింగ్‌ షట్టర్ల కార్మికుడిగా పనిచేస్తున్నాడు,. ఇద్దరూ కలిసి సులభంగా డబ్బులు సంపాదించే లక్ష్యంతో డ్రగ్స్‌ వ్యాపారి వికాస్‌ అలియాస్‌ ముఖేష్‌ నుంచి పాపిస్ట్రా పౌడర్‌, ఎండీఎంఏ కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. నిఘా ఉంచిన పోలీసులు.. జవహర్‌నగర్‌ పరిధిలోని తిమ్మాయిపల్లి శివారులో డ్రగ్స్‌ తరలిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 40 కిలోల పాపిస్ట్రా పౌడర్‌ (గసగసాల పొడి), 10 గ్రామల ఎండీఎంఏ, 3 మొబైల్‌ ఫోన్లు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సరఫరాదారుడు వికాస్‌ పరారీలో ఉన్నాడు


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 11:36 AM