Share News

High Court: మార్గదర్శిపై విచారణ జరగాల్సిందే

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:48 AM

నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణ జరగాల్సిందేనని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హైకోర్టును కోరింది.

High Court: మార్గదర్శిపై విచారణ జరగాల్సిందే

  • క్వాష్‌ పిటిషన్‌ను వ్యతిరేకించిన ఆర్బీఐ

  • హైకోర్టులో కౌంటర్‌ దాఖలు

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణ జరగాల్సిందేనని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హైకోర్టును కోరింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై 2008లో నమోదైన కేసును కొట్టేయరాదని విజ్ఞప్తి చేసింది. అందువల్ల 2011లో మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేయాలని నివేదించింది. మార్గదర్శి క్వాష్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఇటీవల కౌంటర్‌ దాఖలు చేసింది. మార్గదర్శి చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని పేర్కొంటూ 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.


ఈ కేసును కొట్టేయాలని మార్గదర్శి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2018లో ఉమ్మడి ఏపీ హైకోర్టు రెండుగా విడిపోవడానికి చివరిరోజు అయిన డిసెంబర్‌ 31 రోజున మార్గదర్శికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మార్గదర్శికి వ్యతిరేకంగా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతోపాటు డిపాజిట్లను పూర్తిగా తిరిగి ఇచ్చినందున కేసును కొట్టివేసింది. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఆర్బీఐ సహా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరుల వాదనలు తాజాగా వినాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ కేసును మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.


జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపడుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్బీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. పిటిషనర్‌ చర్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పుడు క్వాష్‌ పిటిషన్‌ను అనుమతించే అవకాశం ఉండదని అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ద్వారా స్పష్టమైందని తెలిపింది. అందువల్ల మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరింది. ఈ పిటిషన్‌ ఈనెల 20న మరోసారి విచారణకు రానుంది.

Updated Date - Aug 18 , 2024 | 03:48 AM