Share News

Farmer Loan Waiver: 11.42 లక్షల మంది ఖాతాల్లోకి నగదు

ABN , Publish Date - Jul 18 , 2024 | 02:39 AM

రాష్ట్రంలో రైతు రుణాల మాఫీకి రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4గంటలకు ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మాఫీ చేయనుంది.

Farmer Loan Waiver: 11.42 లక్షల మంది ఖాతాల్లోకి నగదు

  • ‘ఈ-కుబేర్‌’తో రూ.7 వేల కోట్లు జమ

  • 20 మంది రైతులకు సీఎం చేతుల

  • మీదుగా చెక్కుల పంపిణీ

  • నేటి ఉదయం బ్యాంకర్లతో రేవంత్‌ భేటీ

  • సీఎం చేతుల మీదుగా 20 మందికి చెక్కులు

  • రూ.7వేల కోట్లను సిద్ధంగా ఉంచిన సర్కారు

హైదరాబాద్‌, జులై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతు రుణాల మాఫీకి రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4గంటలకు ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మాఫీ చేయనుంది. సచివాలయంలోని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి బటన్‌ క్లిక్‌ చేయగానే... నేరుగా రైతుల ఖాతాల్లోకి ఏకకాలంలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. సుమారుగా 11.42 లక్షల మంది లబ్ధిదారులకు రుణ మాఫీ కింద సుమారుగా రూ.7వేల కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది కాగా, రైతులను మూడు కేటగిరీలుగా విభజించి రుణ మాఫీ చేయాలని సర్కారు నిర్ణయించింది. తొలి విడతలో రూ.లక్ష లోపు, రెండో విడతలో రూ.1.50లక్షల వరకు, మూడో విడతలో రూ.2లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. బ్యాంకులు, పీఏసీఎ్‌సల నుంచి ఇప్పటికే సేకరించిన వివరాలన్నింటినీ నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌లో విశ్లేషిస్తున్నారు.


మొత్తంగా రుణ మాఫీ పరిధిలోకి వచ్చే రైతు కుటుంబాలు 40లక్షలు ఉన్నట్లు లెక్క తేలింది. రూ.లక్షలోపు రుణాలు ఉన్న రైతుల వివరాలను జిల్లాల వారీగా బుధవారం సాయంత్రమే కలెక్టర్లు, డీఏవోలకు పంపించారు. మరోవైపు.. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 10గంటలకు ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఆర్థిక, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రూ.లక్ష లోపు రుణమాఫీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై బ్యాంకర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మాఫీ అయిన మేరకు మళ్లీ కొత్తగా పంట రుణాలు ఇవ్వడంపై ఆదేశాలు ఇవ్వనున్నారు. కాగా, రైతు బంధు మాదిరిగానే ఈ-కుబేర్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.


ఈ మేరకు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి... ఇప్పటికే ప్రొసీడింగ్స్‌ తీసి ట్రెజరీకి పంపించారు. రుణ మాఫీకి శ్రీకారం చుట్టే కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన 20 మంది రైతులకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కలిసి చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాగా, ఈ నెలాఖరులోపు రూ. 1.50లక్షల వరకు ఉన్న రుణాలు, ఆగస్టు మొదటివారంలో రూ. 2లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుంది. మొత్తం రుణమాఫీకి రూ.31వేల కోట్లు అవసరమవుతాయని అంచనాలు ఉండగా.. ప్రస్తుతం వెచ్చిస్తున్న రూ.7వేల కోట్లు కాకుండా, మరో రూ.24వేల కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.


ఖరీఫ్‌ సీజన్‌లోనే రుణమాఫీ పూర్తి చేస్తే... మళ్లీ రైతులు పంట రుణం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పంద్రాగస్టులోపు రైతులు రుణ విముక్తులు కానున్నారు. కాగా, గురువారం సాయంత్రం 4గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు, మండల కేంద్రాల్లో సంబరాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రుణ మాఫీ నిధులు జమ చేసిన రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్‌ మాట్లాడనున్న నేపథ్యంలో రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ యూనిట్లను సిద్ధం చేశారు. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొననున్నారు.

Updated Date - Jul 18 , 2024 | 02:39 AM