Ambulance fleet: పది నిమిషాల్లోనే అంబులెన్స్
ABN , Publish Date - Dec 03 , 2024 | 03:45 AM
రాష్ట్రంలో కొత్తగా 213 అంబులెన్స్‌లను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని, వీటితో కలిపి మొత్తం అంబులెన్స్‌ల సంఖ్య 1003కి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
మా ప్రభుత్వ లక్ష్యం ఇదే: దామోదర
కొత్తగా 213 అంబులెన్స్‌లు అందుబాటులోకి
ప్రజలను రెచ్చగొడితే ఊరుకోం: భట్టి
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 213 అంబులెన్స్‌లను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని, వీటితో కలిపి మొత్తం అంబులెన్స్‌ల సంఖ్య 1003కి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. కొత్త వాహనాల రాకతో అంబులెన్స్ రెస్పాన్స్ టైమ్ సగటున 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గుతుందన్నారు. పది నిమిషాల్లోనే అంబులెన్స్‌ను పంపించి ప్రాణాలు కాపాడాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో, ఇతర ఎమర్జెన్సీ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడేలా రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పేద ప్రజలను దోచుకోవద్దని, నిబంధనలకు ప్రకారం వైద్యం అందించాలని ప్రైవేటు ఆస్పత్రులను హెచ్చరించారు. అనారోగ్యంతో ప్రజలు అప్పుల పాలు కాకూడదని, రోగం వస్తే ఉచితంగా వైద్యం అందుతుందనే భరోసా వారికి కలగాలని, ఆ భరోసాను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నాడైనా, నేడైనా విద్య, వైద్యం వంటి కనీస వసతుల కల్పన అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్‌మెంట్ అయినా వాటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలను పెంచామని, ఏడాదిలో ఆరోగ్య శాఖలో 7,774 పోస్టులను భర్తీ చేశామని, మరో 6,470 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. 16 నర్సింగ్, 28 పారామెడికల్ కాలేజీలను ప్రారంభించామన్నారు.
ప్రజలను రెచ్చగొడితే ఊరుకోం: భట్టి
కొన్ని రాజకీయ పార్టీలు అడ్డగోలుగా రోడ్లపైకి వచ్చి ప్రజలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. పనిలేని నాయకులు ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా జీవించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే బీఆర్‌ఎస్, బీజేపీలను దూరంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఏడాది కూడా అధికారం లేకుండా బీఆర్‌ఎస్ ఉండలేకపోతోందని విమర్శించారు. ప్రజారోగ్యాన్ని పదేళ్లపాటు బీఆర్‌ఎస్ సర్కారు గాలికి వదిలేసిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు ఎన్నికలతోనే సరిపోయిందని తెలిపారు.