Share News

Bathukamma festival: పూల పండుగ.. మన సంస్కృతికి ప్రతీక

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:26 AM

ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని తెలిపారు.

Bathukamma festival: పూల పండుగ.. మన సంస్కృతికి ప్రతీక

  • బతుకమ్మ మహిళా శక్తిని చాటుతుంది

  • దుబాయ్‌ బతుకమ్మ వేడుకల్లో మంత్రి జూపల్లి

  • మరో కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్‌

హైదరాబాద్‌/చంపాపేట(ఆంధ్రజ్యోతి)/(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)అక్టోబరు 6: ప్రపంచంలో పువ్వులను పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బతుకమ్మ పండుగ మన సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. దుబాయ్‌లోని కైరో స్ట్రీట్‌ ఇత్తెహాద్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో లెవల్‌ నెక్ట్స్‌ గోల్డ్‌ ఈవెంట్స్‌ దుబాయ్‌, గల్ఫ్‌ తెలంగాణలు సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌సతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బతుకమ్మ పండుగ మహిళా శక్తిని చాటుతుందని, తెలంగాణ ఉద్యమాన్ని సంఘటిత శక్తిగా మార్చడంలో బతుకమ్మ వేడుకలు ప్రత్యేక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కాగా దుబాయ్‌ పర్యాటక శాఖ అధికారి జాసిం మొహమ్మద్‌ అల్‌ అవాదీతో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. ఆ దేశ పురోగతిలో పర్యాటక రంగ భూమిక గురించి మంత్రి తెలుసుకున్నారు. దుబాయ్‌లోని ఐపీఎఫ్‌ తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. సౌత్‌ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Updated Date - Oct 07 , 2024 | 04:26 AM