Share News

బాలుడిని చంపి..టవర్‌ ఎక్కి ఉరేసుకున్న దొంగ

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:30 AM

వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడే ఓ వ్యక్తి ఓ దుకాణంలో దొంగతనం చేశాడు. ఆ దొంగతనాన్ని చూశాడని ఓ పన్నెండేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా చంపాడు. ఆపై, డబ్బు కోసం

బాలుడిని చంపి..టవర్‌ ఎక్కి ఉరేసుకున్న దొంగ

దొంగతనాన్ని చూశాడనే గొంతు నులిమి చిన్నారి హత్య

మరో వ్యాపారిపై దాడి.. ఆపై, సెల్‌టవర్‌

ఎక్కి రాత్రంతా అక్కడే.. ఉదయం ఆత్మహత్య

జోగిపేటలో ఓ ఉన్మాది క్రైమ్‌ కథాంతం

దొంగతనానికి సాక్ష్యంగా ఉన్నాడని హత్య

ఆపై, సెల్‌టవర్‌ ఎక్కి రాత్రంతా అక్కడే

ఆదివారం ఉదయం ఆత్మహత్య

జోగిపేట, ఏప్రిల్‌ 21: వ్యాపారులను బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడే ఓ వ్యక్తి ఓ దుకాణంలో దొంగతనం చేశాడు. ఆ దొంగతనాన్ని చూశాడని ఓ పన్నెండేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా చంపాడు. ఆపై, డబ్బు కోసం మరో చిరు వ్యాపారిపై హత్యాయత్నం చేశాడు. అనంతరం మద్యం మత్తులో సెల్‌టవర్‌ ఎక్కి రాత్రింతా అక్కడే గడిపాడు. మద్యం మత్తు దిగో.. చేసిన తప్పులకు భయపడో చివరికి అదే సెల్‌ టవర్‌పై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన ఓ దొంగ క్రైమ్‌ కథాంతమిది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జోగిపేటలో నివాసముండే వడ్డె నాగరాజు(28) స్థానిక అందోల్‌ రోడ్డులోని చిరువ్యాపారులపై రౌడీయిజుం చేస్తూ వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఓ దుకాణంలో వైరు దొంగతనం చేశాడు. అదే ప్రాంతానికి చెందిన ఆలకుంట శేఖర్‌(12) అనే బాలుడు దొంగతనం చేసింది నాగరాజేనని సదరు దుకాణ యజమానికి చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు శనివారం సాయంత్రం శేఖర్‌ను తన వద్దకు పిలిచాడు. మాట్లాడుకుందామని చెప్పి స్థానిక వెంకటేశ్వర థియేటర్‌ వెనక ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు నులిమి శేఖర్‌ను చంపేశాడు.ఆపై, బండరాయితో శేఖర్‌ తలపై మోది మృతదేహాన్ని సమీపంలోని పాడుబడ్డ బావిలో పారేశాడు. ఆ తర్వాత అడిగితే డబ్బు ఇవ్వలేదని కారణంతో అయిత ప్రకాశ్‌ అనే చిరువ్యాపారిపై దాడి చేసి అతని తల పగలగొట్టాడు. అనంతరం.. నీ కొడుకును చంపి బావిలో పడేశానని.. శేఖర్‌ తల్లికి సమాచారమందించాడు. ఆపై, శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించిన నాగరాజు పట్టణంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం రాము అనే స్నేహితునికి ఫోన్‌ చేసి తాను సెల్‌ టవర్‌పై ఉన్నానని, బీరు, బిర్యానీ తీసుకురమ్మని కోరాడు. ఈ మేరకు అక్కడికి వెళ్లిన రాము ఎంత నచ్చజెప్పినా నాగరాజు కిందికి రాకపోగా.. అతని కోసం పైకి వచ్చిన రాముపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రాము టవర్‌ కిందకు దిగి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎంత చెప్పినా నాగరాజు కిందకు దిగలేదు. నాగరాజు బాగా ఎత్తులో ఉండటం, ఎండ అధికంగా ఉండటంతో ఏమీ కనిపించకపోవడంతో డ్రోన్లు తెచ్చేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులు తిరిగొచ్చి డ్రోన్ల సాయంతో చూసేసరికి నాగరాజు సెల్‌టవర్‌పై ఉన్న వైర్లుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. కాగా, మృతదేహాన్ని కిందికి దించిన పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. అలాగే, పాడుబడిన బావిలో ఉన్న శేఖర్‌ మృతదేహాన్ని కూడా వెలికి తీశారు.

Updated Date - Apr 22 , 2024 | 05:30 AM