Share News

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:56 PM

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ నేతలు కలిసి చర్చించారు. ఈ మేరకు టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో  ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ
Telangana Congress

ఢిల్లీ: పార్లమెంట్‌లో ఇవాళ(గురువారం) కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీని (Rahul Gandhi) తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం (Telangana Congress Leaders) కలిశారు. జంతర్ మంతర్‌లో బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివరించారు. మంత్రులు, ఎంపీలను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీని కలిశారు. మర్యాదపూర్వకంగా అధిష్టానం పెద్దలను కలిశారు.


నేతలు మరింత కష్టపడాలి.. సోనియాగాంధీ దిశానిర్దేశం..

అధిష్టానం పెద్దలతో తెలంగాణ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. 2008లో సోనియా గాంధీని కలిశానని పాత జ్ఞాపకాలను ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై జంతర్ మంతర్‌లో పాల్గొన్నట్లు సోనియాకు విప్ ఆదిశ్రీనివాస్ వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని ఈ సందర్భంగా నేతలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌కు వెన్నంటే ఉన్నారని వారికి చేసే మేలు ప్రజలు మరవరని అన్నారు. బీసీ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు లు తెస్తాయని ఉద్ఘాటించారు. నేతలు మరింత కష్టపడాలని.. అందరికి సంక్షేమ పథకాలు అందించాలని సోనియా గాంధీ సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వంతో బలంగా కొట్లాడుతామని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర వైఖరిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ తెలిపారు. సోనియా , రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.

congress.jpg


బీసీలకు మంత్రి పదవులపై చర్చ...

బీసీలకు మరో రెండు మంత్రిపదవులు ఇవ్వాలని కోరామని.. ఇద్దరికీ ఇచ్చే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) తెలిపారు. బీసీలకు మంచి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. ఇవాళ సోషల్ జస్టిస్ మంత్రిని కలవనున్నామని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసే అవకాశం లేదని చెప్పారు. బీజేపీ నేతలు అపాయింట్‌మెంట్ తీసుకుంటే తాము భేషజాలు లేకుండా వారితో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వడం లేదన్నారు. ముస్లింలు ఈ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. ముస్లింలు బీసీల్లో ఉన్నారని.. దానిలో భాగంగానే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు బిల్లు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడ చెప్పలేదని అన్నారు. ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం వారే నిర్ణయం తీసుకుంటారని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

congress--3.jpg


మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ చర్చ..

తమ అభిప్రాయాలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తీసుకున్నారని.. తగిన సమయంలో మంత్రి వర్గ విస్తరణపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముస్లింలను అడ్డంపెట్టుకుని బీసీలకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గుజరాత్‌లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని.. మోదీ సీఎంగా ఉన్నప్పుడు కూడా అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లతో పాటు రాజకీయ, విద్య, ఉద్యోగాలు రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించామని తెలిపారు. బీసీ కుల సంఘాల నేతృత్వంలో జంతర్ మంతర్‌లో ధర్నా చేశామని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.


రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉన్నాం..

కాంగ్రెస్ చిత్తశుద్ధితో 42 శాతం రిజర్వేషన్లు అమలుకు ఆమోదం తెలిపిందని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఓబీసీలు తెలంగాణలో 56 శాతం ఉన్నారని లెక్క తేలిందని అన్నారు. అన్ని కుల సంఘాలు చేసిన ధర్నాకు 18 పార్టీల నేతలు మద్దతు తెలిపారని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఇవాళ కలిశామని రాష్ట అంశాలను వివరించామని అన్నారు. బీజేపీ నేతలు జంతర్ మంతర్ ధర్నాకు రాకుండా మొఖం చాటేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. 9వ షెడ్యూల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రధాని మోదీని తెలంగాణ బీజేపీ నేతలు ఒప్పించాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: రేవంత్ ప్రభుత్వానిది రియల్‌ ఎస్టేట్‌ ఆలోచన

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

BJP: ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే..

CM Revanth Reddy: సర్వాయి పాపన్నకు సీఎం రేవంత్‌ నివాళి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Apr 03 , 2025 | 01:10 PM