Share News

Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వు

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:03 PM

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్న స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది మరోసారి ప్రస్తావించారు.

Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వు
Supreme Court

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేలు (Telangana MLAs) పార్టీ మారిన వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి (Abhishek Manu Singhvi) వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి తెలిపారు. మణిపూర్ వ్యవహారం (Manipur Issue) పూర్తిగా భిన్నమైనదని, ఆ ఒక్క విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించారని అన్నారు. అలాగే రాణా కేసు (Rana Case) పూర్తిగా ప్రత్యేకమైనదని, ప్రస్తుత ఆ అంశానికి సరిపోదని సింఘ్వి కోర్టుకు తెలిపారు. దీంతో రాణా కేసులో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించిందని జస్టిస్ గవాయ్ (Justice Gavai) తెలిపారు. మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏంటి అని సింఘ్విని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. సుప్రీం ర్టుకు వచ్చిన తర్వాత న్యాయవాదుల తీరు పూర్తిగా మారిపోతోందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. ఇదే అంశంపై బుధవారం కూడా సుదీర్ఘవిచారణ జరిగింది. స్పీకర్ తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. గురువారం స్పీకర్ కార్యదర్శి తరఫున సింఘ్వి వాదనలు వినిపించారు.

Also Read..: ఎండాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినడం సురక్షితమేనా..


సీఎం స్వీయ నియంత్రణ పాటించలేరా..

ఇటీవల సీఎం అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది మరోసారి ప్రస్తావించారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావని, స్పీకర్ తరపున కూడా చెపుతున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను న్యాయవాది ప్రస్తావించారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని వ్యాఖ్యానించారని న్యాయవాది అన్నారు. దీంతో ముఖ్యమంత్రి కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని జస్టిస్ గవాయ్ అన్నారు.


రెచ్చగొట్టిన ప్రతిపక్షం

దీంతో అభిషేక్ మను సింఘ్వి మాట్లాడుతూ ప్రతిపక్షం నుంచి అంతకు మించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం అని ధర్మాసనం పక్కన పెట్టింది. సీఎం మాటలు కోర్టు దిక్కారం కింద తీసుకోవాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు. మేము సంయమనం పాటిస్తున్నామని, మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు పిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూసారని సింఘ్వి అన్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడివరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణకు వచ్చిన తర్వాతే నోటీసులు ఇచ్చారని గవాయ్ అన్నారు. ఈ క్రమంలో మణిపూర్ వ్యవహారం, రాణా కేసుతో పాటు మరికొన్ని అంశాలను అభిషేక్ సింఘ్వి కోర్టుకు వివరిస్తూ వాదనలు ముగించారు.


సుప్రీంకు అన్ని అధికారాలు ఉంటాయి..

అభిషేక్ మను సింఘ్వి వాదనలు ముగియడంతో.. పిటీషనర్ల తరపున కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్యామ సుందరం మరోసారి చివరి వాదనలు వినిపించారు. మహారాష్ట్ర వ్యవహారం సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిందన్నారు. స్పీకర్‌కు తగిన ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయన్నారు. సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ తప్పక తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పేర్కొందని న్యాయవాది ఆర్యామ సుందరం అన్నారు.

వాదనలు పూర్తి తీర్పు రిజర్వు..

జనవరిలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించాక స్పీకర్ నోటీసులు ఇచ్చారని, మూడు వారాలు సమయం ఇచ్చారని, ఆ మూడు వారాల సమయం కూడా పూర్తి అయిందని న్యాయవాది ఆర్యామ సుందరం అన్నారు. నోటీసులు పంపిన సమాచారం కూడా ప్రతిపక్ష నేతకు ఇవ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రస్తావించారు. దీనిపై న్యాయవాది ముకుల్ రోహత్గీ అభ్యంతరం చెప్పారు. ధర్మాసనం కూడా తాము ఆ విషయంలోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో ముగిసింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. అయితే 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టును న్యాయవాది ఆర్యమ సుందరం కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చే టిప్స్..

కూల్ వాటర్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..

రేణుక, సుధీర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్:మావోయిస్టు పార్టీ

For More AP News and Telugu News

Updated Date - Apr 03 , 2025 | 03:04 PM