ఇండియాలో ఎంట్రీ తప్పితే ఎగ్జిట్ లేని ఈ ద్వీపం గురించి తెలుసా..
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:17 PM
మన భారతదేశంలోని ఓ రహస్య ప్రాంతం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ దీవుల్లోకి అడుగుపెడితే చావే. అక్కడకు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రయాణాలు నిషేధించింది. భారతదేశంలో మృత్యు దీవిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉందంటే..

సెంటినల్ ద్వీపం.. 2018 వరకు చాలా మంది ప్రజలకు దీని గురించి తెలియదు. కానీ అమెరికాకు చెందిన మత బోధకుడు జాన్ అలెన్ చౌ అనే వ్యక్తి.. సెంటినల్ ద్వీపానికి వెళ్లి.. అక్కడి ప్రజలకు మత బోధ చేయాలని భావించాడు. అయితే అనూహ్య రీతిలో సెంటినలీస్ తెగ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో.. సెంటినల్ ద్వీపం గురించి వెలుగులోకి వచ్చింది. ప్రపంచానికి దూరంగా ఉండే ఈ ద్వీపం, ఇక్కడ నివసించే జనాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ సెంటినల్ ద్వీపం వార్తల్లోకి ఎక్కింది.
అండమాన్ దీవుల్లోని నిషేధిత ప్రాంతం సెంటినల్ దీవుల్లోకి తాజాగా ఓ అమెరికా జాతీయుడు ప్రవేశించి.. అక్కడ వీడియోలు తీయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు అమెరికా పౌరుడిని అరెస్ట్ చేశారు. దాంతో మరోసారి సెంటినల్ దీవులు వార్తల్లో నిలిచాయి. మరి ఈ దీవుల కథ ఏంటి.. అక్కడ ఉండే జనాలు ఎవరు.. ఎందుకు ప్రభుత్వం అక్కడికి ప్రయాణాలు నిషేధించింది అంటే..
హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న సెంటినల్ దీవి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా విసిరి వేయబడినట్లుగా ఉంటుంది. ఇక్కడ సెంటినల్స్ తెగకు చెందిన వారు నివసిస్తున్నారు. వీరు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు. దీవిలో వీరు మహా అయితే 50-100 మంది ఉంటారని తెలుస్తోంది. ఇక సెంటినల్స్ ఆఫ్రికా నుండి వలస వచ్చిన తొలి మానవుల జాతికి చెందిన వారిగా భావిస్తున్నారు. సెంటినల్స్ అతి పురాతమైన తెగల్లో ఒకటి.
భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి అన్ని రకాల ప్రయాణాలను నిషేధించింది, బయటి వ్యక్తులు అక్కడికి వెళ్లడానికి లేకుండా ఆంక్షలు విధించింది.సెంటినలీస్ ప్రజలు సుమారు 60,000 సంవత్సరాలకు పైగా ఒంటరిగా జీవిస్తున్నారు. విల్లు, బాణాలతో వచ్చే సందర్శకుల బారి నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. పరిశోధకులు, ప్రభుత్వ అధికారులు, సాహసోపేత అన్వేషకులు ఎవరైనా ఈ ద్వీపానికి వెళ్దామని ప్రయత్నిస్తే.. వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
హింసాత్మక ఘటనలు..
సెంటినెలీస్ తెగ వారు వేల సంవత్సరాలుగా.. బయటి వ్యక్తుల నుంచి తమ ద్వీపాన్ని కాపాడుకోవడం సంప్రదాయంగా వస్తోంది. 1896లో, బీచ్‌లో కొట్టుకుపోయి తప్పించుకున్న భారతీయ ఖైదీని ఈ తెగ వారు హత్య చేశారు. 1974లో, సెంటినెల్స్ మీద పరిశోధన చేయడానికి వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ చిత్ర బృందంపై వారు బాణాలు వేసి దాడి చేశారు. 2004 హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చిన తర్వాత, ఈ తెగ వారి స్థితిగతులని అంచనా వేయడానికి పంపించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్‌పై బాణాలతో దాడి చేశారు. వారు తమ ఉనికిని బయటి ప్రపంచానికి వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు.
ఇక 2018లో అమెరికా మిషనరీ జాన్ అలెన్ చౌ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి సెంటినెల్ ద్వీపానికి చేరుకున్నాడు. ఆగ్రహించిన సెంటినెలీస్ ప్రజలు ఆయనను హత్య చేశారు.
ప్రయత్నం సఫలం..
సెంటినెలీస్‌తో చర్చలు జరపడానికి అనేక సార్లు ప్రయత్నాలు జరిగాయి. వీటిల్లో కొన్ని శాంతియుతంగా ముగిశాయి. 1990ల ప్రారంభంలో, భారతీయ మానవ శాస్త్రవేత్తలు త్రిలోక్‌నాథ్ పండిట్, మధుమాల చటోపాధ్యాయ సెంటినెల్స్ తో చర్యలు జరిపేందుకు ప్రయత్నం చేసి పురోగతి సాధించారు. వారు సెంటినెల్స్‌కు కొబ్బరికాయలు బహుకరించారు. ఆ తర్వాత మళ్లీ ఇది రిపీట్ అవ్వలేదు.
బ్రిటీష్ వారి కాలంలో.. సెంటినలీస్ తెగకు బయటి వ్యక్తుల పట్ల తీవ్రమైన అనుమానాలు మొదలయ్యాయి. 1880లో, బ్రిటిష్ నావికాదళ అధికారి మారిస్ విడాల్ పోర్ట్‌మన్ ఆరుగురు ద్వీపవాసులను కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్‌కు తీసుకువచ్చాడు. ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేక.. అనారోగ్యం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మరణించారు. మిగిలిన నలుగురిని బహుమతులతో తిరిగి పంపించారు. కానీ అప్పటికే సెంటినల్స్ బయటి వారి మీద అనుమానాలు పెంచుకున్నారు.
రహస్యాలకు పుట్టిల్లు..
నార్త్ సెంటినల్ ద్వీపం ఇప్పటికీ ఒక నిగూఢ రహస్యంగా ఉండిపోయింది. శాటిలైట్ ఫొటోలను గమనిస్తే.. ఇక్కడ దట్టమైన అడవి, కొత్త బీచ్‌లు, చిన్న ఖాళీ స్థలాలను చూపిస్తాయి. కానీ రక్షణ చట్టాల కారణంగా ఈ ద్వీపంలోకి ఎవరూ ప్రవేశించలేరు.. దీని మ్యాప్‌ను కూడా సరిగా గీయలేకపోయారు. అనేక మంది చరిత్రకారులు సెంటినెల్స్ జీవితం, భాష, మనుగడ మార్గాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఆధునిక కాలంలో ప్రబలుతున్న వ్యాధులు, పర్యాటకం, వాతావరణ మార్పులు సెంటినెల్స్‌కు పెను సమస్యలుగా మారాయి. అయితే వారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా..ఒంటరిగా దీవిలో నివసించడమే వారి మనుగడకు ప్రధాన కారణమని నిపుణులు విశ్వసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
రెండున్నరేళ్లలో 150 నుంచి 75 కేజీలకు
ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..