Share News

Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:02 AM

పులి సంచారంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతులు, కూలీలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెన్నాపూర్‌ శివారులోని ఓ పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు కలకలం రేపాయి.

Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!

  • భయంతో చెట్టు పైకెక్కిన కూలీలు

  • మంచిర్యాల జిల్లా చెన్నాపూర్‌ శివారులో ఘటన

భీమిని, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పులి సంచారంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతులు, కూలీలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెన్నాపూర్‌ శివారులోని ఓ పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు కలకలం రేపాయి. గ్రామ శివారులోని చేనులోకి గురువారం సాయంత్రం పులి రావడంతో పత్తి ఏరుతున్న కూలీలు పరుగులు పెట్టారు. పులిని చూసిన కోయ గోపాల్‌, ఠాకేర బాపు అనే కూలీలు చెట్టెక్కి ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. చెట్టు పైనుంచే కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి పెద్ద శబ్దాలు చేశారని, తరువాత పులి తెనుగుపల్లి వైపు వెళ్లిందని చెప్పారు.


పెద్దపులి సంచార విషయం తెలుసుకున్న కుశ్నపల్లి, తాండూరు అటవీ అధికారులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. పెద్దపులి ఎటువైపు నుంచి వచ్చింది? ఎంత సేపు ఉంది? తదితర వివరాలను తెలుసుకున్నారు. పత్తి సేకరణ పనులు జోరుగా నడుస్తుండగా చేలల్లోకి పెద్దపులి రావడంతో రైతులు, కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో పత్తి సేకరించే మహిళపై పులి దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే.

Updated Date - Dec 06 , 2024 | 05:02 AM