Share News

బీఆర్‌ఎస్‌ దగ్గర ఏముంది?

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:47 AM

బీఆర్‌ఎ్‌సతో బీజేపీ పొత్తు ఉంటుందని ప్రచారం చేసేవాళ్లు మూర్ఖులేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

బీఆర్‌ఎస్‌ దగ్గర ఏముంది?

వాళ్లతో పొత్తా?.. ఆ ప్రచారం మూర్ఖుల పనే

అసలు తెలంగాణకు బీఆర్‌ఎస్‌ అవసరమా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర

భాగ్యలక్ష్మి ఆలయం వద్ద వాహనాలకు పూజ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సతో బీజేపీ పొత్తు ఉంటుందని ప్రచారం చేసేవాళ్లు మూర్ఖులేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. మూర్ఖులు, దుర్మార్గులు చేసే ప్రచారాన్ని ఖాతరు చేయబోమన్నారు. మెడపై తలకాయ ఉన్నవారెవరూ ఇలాంటి ప్రచారం చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ. అలాంటి నావకు సహకరించే ప్రసక్తే లేదు. మాకు ఒక్క ఎమ్మెల్యే సీటు వచ్చినప్పుడే బీఆర్‌ఎ్‌సతో కలవలేదు. ఇప్పుడెందుకు కలుస్తాం? కలవడానికి బీఆర్‌ఎస్‌ దగ్గర ఏముంది? తెలంగాణకు ఆ పార్టీ అవసరం ఉందా?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే తరహా ప్రచారం చేశారన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ దమ్మున్న పార్టీ అని, రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లకూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎ్‌సతో బీజేపీ పొత్తు అంటూ ఎవరైనా మాట్లాడితే రెండు చెంపలపై కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానాన్ని కూడా గెలుచుకుంటామని చెప్పారు. ప్రతి పోలింగ్‌ బూత్‌లో కనీసం 25 మంది కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలని జాతీ య అధ్యక్షుడు నడ్డా సూచించారని కిషన్‌రెడ్డి తెలిపారు. యాత్రల సందర్భంగా కూడా చేరికలు ఉంటాయన్నారు. పార్టీ మొదటి పార్లమెంటరీ బోర్డు భేటీలో తెలంగాణ అభ్యర్థులు కొంతమంది ఉంటారని తెలిపారు. విచారణకు పిలిచినవారందరినీ అరెస్టు చేయరని ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసుపై ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

యాత్ర పోస్టర్‌, సీడీల ఆవిష్కరణ

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభమయ్యే విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌, పాటల సీడీలను కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. యాత్ర మార్చి 2 వరకు కొనసాగుతుందని తెలిపారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి విజయ సంకల్ప యాత్ర వాహనాలను ప్రారంభించారు. రాష్ట్రం లో 5 విభాగాలుగా యాత్ర జరుగుతుందన్నారు. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్‌ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందని చెప్పారు. మంగళవారం నుంచి 4 యాత్రలు కొనసాగుతాయన్నారు. అన్ని యాత్రల్లో రోడ్‌షోలు మాత్రమే ఉంటాయని వివరించారు. 5 యాత్రలు 5,500 కి.మీ. మేర కొనసాగుతాయని.. 17 పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలను కలుస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

నారాయణపేటలో పాల్గొననున్న కిషన్‌రెడ్డి

నారాయణపేట జిల్లాలో మంగళవారం ప్రారంభమయ్యే యాత్రలో కిషన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉద యం 9గంటలకు కృష్ణా నదిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం కృష్ణ గ్రామంలో యా త్రను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మాగునుర్‌ మండ లం మీదుగా మక్తల్‌ టౌన్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఉట్కూరు మండలంలో రైతులతో ముఖాముఖీలో పాల్గొంటారు. రాత్రి నారాయణపేటలోనే బస చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Feb 20 , 2024 | 04:47 AM