Share News

Bus Incident: బస్సుపైకి బీర్‌ బాటిల్‌.. కండక్టర్‌పైకి పాము

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:35 AM

బస్‌స్టాపులో నిల్చుని చేయి అడ్డుపెట్టినా బస్సు ఆపకపోతే సాధారణంగానైతే ప్రయాణికులు ఏం చేస్తారు? పెదవి విరుస్తారు.. మరో బస్సు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు.

Bus Incident: బస్సుపైకి బీర్‌ బాటిల్‌.. కండక్టర్‌పైకి పాము

  • తీవ్ర ఆగ్రహంతో విసిరిన ప్రయాణికురాలు.. తాను చెయ్యి అడ్డుపెట్టినా అపలేదన్న ఆగ్రహంతోనే

  • భయంతో వణికిపోయిన మహిళా కండక్టర్‌

  • బీరు బాటిల్‌ ధాటికి పగిలిన బస్సు అద్దాలు

  • విద్యానగర్‌ బస్‌స్టాప్‌ వద్ద ఘటన

రాంనగర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): బస్‌స్టాపులో నిల్చుని చేయి అడ్డుపెట్టినా బస్సు ఆపకపోతే సాధారణంగానైతే ప్రయాణికులు ఏం చేస్తారు? పెదవి విరుస్తారు.. మరో బస్సు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. కానీ ఆ ప్రయాణికురాలు ఏం చేసిందో తెలుసా? తాను చెయ్యి పెట్టినా ఆపలేదన్న ఆగ్రహంతో బస్సు వెనుక అద్దాలపైకి బీరు బాటిల్‌ను విసిరింది. ఆపై తన సంచీలోంచి పాము తీసి.. మహిళా కండక్టర్‌పైకి విసిరి భయోత్పాతం సృష్టించింది. నల్లకుంట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని విద్యానగర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. సీఐ జగదీశ్వర్‌రావు కథనం ప్రకారం.. జవహర్‌నగర్‌లోని దమ్మాయిగూడకు చెందిన బేగం (60) అనే ప్రయాణికురాలు గురువారం సాయంత్రం విద్యానగర్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది.


సికింద్రాబాద్‌ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్లే బస్సు రావడంతో దాన్ని ఆపేందుకు ప్రయత్నించింది. డ్రైవర్‌ పట్టించుకోకుండా బస్సును ముందుకు ఉరికించడంతో ఆగ్రహించిన బేగం తన బ్యాగులోంచి బీర్‌ బాటిల్‌ను తీసుకొని బస్సు వెనుక అద్దాలపైకి విసిరింది. సీస తగిలి బస్సు అద్దాలు పగిలిపోయాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని కండక్టర్‌.. డ్రైవర్‌కు చెప్పారు. వెంటనే డ్రైవర్‌, కండక్టర్‌లు బస్సును రోడ్డుకు ఓ పక్కన ఆపేసి, సదరు ప్రయాణికురాలిని పట్టుకునేందుకు కిందకు దిగారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న బేగం.. ‘నేను చేయ్యెత్తినా బస్సు ఆపనంటావా? నీకు ఎంత ధైర్యం’ అంటూ తనవైపు వస్తున్న మహిళా కండక్టర్‌ స్వప్నను ప్రశ్నించింది.


ఆపై తన బ్యాగులోంచి జెర్రిగొడ్డు పామును తీసి కండక్టర్‌ స్వప్నపైకి విసిరి.. ‘ఈ బేగం అంటే ఏమనుకుంటున్నావ్‌?’ అంటూ కన్నెర్ర చేసింది. స్వప్న చెయ్యి అడ్డుపెట్టడంతో పాము చేతులకు తగిలి కింద పడిపోయింది. అయితే ఊహించని ఈ పరిణామంతో స్వప్న తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై స్వప్న నల్లకుంట పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బేగంను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నాగులపంచమి సందర్భంగా బేగం పామును తీసుకెళుతున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. కాగా, కండక్టర్‌పై విసిరిన పాము రోడ్డు పక్కన ఉన్న కిళ్లీకొట్టు డబ్బా వెనకనుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.


కాగా విద్యానగర్‌ బస్‌స్టా్‌పలో బస్సు ఆపకపోవడం వల్లే ప్రయాణికురాలు ఈ దాడికి పాల్పడిందని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని టీజీఎస్‌ ఆర్టీసీ పేర్కొంది. విద్యానగర్‌ సిగ్నల్‌ ఫ్రీ లెఫ్ట్‌ వద్ద ఆర్టీసీ బస్టాప్‌ లేదని వెల్లడించింది. ఇలాంటి దాడులను టీజీఎ్‌సఆర్టీసీ ఏమాత్రం ఉపేక్షించదని.. పోలీసు శాఖ సహాయంతో బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Aug 09 , 2024 | 03:35 AM