కొత్త బడ్జెట్‌పై కసరత్తు షురూ
ABN , Publish Date - Jan 02 , 2024 | 03:41 AM
రాష్ట్ర ఆర్థిక శాఖ కొత్త బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ప్రగతి, నిర్వహణ పద్దులవారీగా ప్రతిపాదనలు కోరింది.
ప్రతిపాదనలు పంపాలని
శాఖలకు ఆర్థిక శాఖ లేఖ
11లోపు అందాలని ఆదేశం
వివరాలన్నీ ఆన్‌లైన్ లో
పంపాలని సూచన
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖ కొత్త బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ప్రగతి, నిర్వహణ పద్దులవారీగా ప్రతిపాదనలు కోరింది. ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, ఇతర అత్యవసర ఖర్చులన్నింటినీ పంపాలని సూచించింది. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన ఉత్తర్వులు (జీవో నంబర్ 150)జారీ చేశారు. విభాగాధిపతులు(హెచ్ వోడీలు) తమ శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించి ఈనెల 9లోపు వారి శాఖల ముఖ్యకార్యదర్శులకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిని ముఖ్యకార్యదర్శులు పరిశీలించి, తగు సలహాలు, సూచనలతో ఆర్థిక శాఖకు 11లోపు పంపించాలని తెలిపింది. అంతా ఆన్‌లైన్‌లో జరగాలని సూచించింది. 11 తర్వాత పంపే సవరణ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపింది. నిర్దేశిత గడువులోగా, పక్కా సమాచారంతో బడ్జెట్ అంచనా ప్రతిపాదనలను పంపాలని ఆదేశించింది. అంచనాల్లో రాబడి, వ్యయాలు పక్కాగా ఉండాలని తెలిపింది. తమ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కేడర్ స్ట్రెంథ్, వారి వేతనాలకయ్యే వ్యయాలను పొందుపర్చాలని సూచించింది. హోంగార్డులు, అంగన్‌వాడీలు, వీఆర్‌ఏ, డెయిలీవేజ్ సిబ్బంది, జూనియర్ పంచాయతీ సెక్రటరీల వివరాలు కూడా పంపాలని తెలిపింది. కొత్త పథకాలకయ్యే వ్యయాలు, 2023 డిసెంబరు31 నాటికి మిగిలిపోయిన పథకాల వ్యయాలు పంపాలని పేర్కొంది. అంచనాలు వాస్తవ అవసరాలను ప్రతిబింబించాలని ఆదేశించింది.