ACB Raids: మాజీ డిప్యూటీ కలెక్టర్ ఆస్తులు 150 కోట్లు.. సీజ్ చేసిన ఏసీబీ అధికారులు
ABN, Publish Date - Nov 11 , 2024 | 09:04 AM
మదనపల్లిలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. మాజీ డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి పెట్టడంతో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారు నగలు.. ఇక బ్యాంకు అకౌంట్లలో కోట్లలోనే బ్యాంకు బ్యాలెన్సులు.. ఇదంతా ఓ మాజీ డిప్యూటీ కలెక్టర్ అవినీతి భాగోతం. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఈ భారీ అవినీతి తిమింగలం చిక్కింది.
చిత్తూరు: మదనపల్లి మాజీ డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళి భారీ అవినీతి బట్టబయలైంది. అక్రమ మార్గాల్లో ఆయన కూడబెట్టిన ఆస్తులపై శనివారం మొదలైన ఏసీబీ తనిఖీలు రెండు రోజులుగా కొనసాగాయి. మురళి నివాసంలో కిలో బంగారం, 800 గ్రాముల వెండి, వివిధ ఆస్తులకు సంబంధించిన డాంక్యుమెట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా 20 బ్యాంకుల్లో ఉన్న ఖాతాలతో పాటు ఏడు ఇళ్లు, ఓ హోటల్, 12 స్థలాలు గుర్తించినట్లు తెలిసింది. మార్కెట్ ధరల ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారుగా రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఏసీబీ అధికారుల సోదాలు ముగియడంతో మాజీ డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళిని అరెస్ట్ చేసిన తర్వాత నెల్లూరులోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు. మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో కొన్ని రోజుల క్రితం అగ్నిప్రమాదం సంభవించి కొన్ని కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఈ విషయంలో మురళి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును సీఐడీ అధికారులు సీరియస్‌గా విచారిస్తున్నారు. మరోవైపు మురళికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ రంగంలోకి దిగింది.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో తిరుపతి, చిత్తూరు, వి.కోట పలమనేరు, మదనపల్లి, కడప, నెల్లూరు తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. తిరుపతి వి.కోటలోని మురళి నివాసాలతో పాటు ఆయన బంధువులు మిత్రులు బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాల్లో ఏసీబీ అధికారులు సెర్చ్ చేశారు. మురళి కూడబెట్టిన అక్రమ ఆస్తులు బినామీల పేరిట పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి అనుగుణంగా బీనామీల పైనే ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా మురళి వద్ద పనిచేసిన కిందిస్థాయి రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారని, బినామీల్లో ఎక్కువగా రిటైర్ట్ ఉద్యోగులు ఉన్నారని సమాచారం.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 11 , 2024 | 09:04 AM