Share News

Year Ender 2024: శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ ఏడాది టాప్ ఆవిష్కరణలు ఇవే!

ABN , Publish Date - Dec 27 , 2024 | 08:08 AM

ఈ ఏడాది శాస్త్రవేత్తలు మానవాళి సమస్యల పరిష్కారంలో ఎంతో పురోగతి సాధించారు. మరి 2024లోని టాప్ ఆవిష్కరణలు ఏవో ఈ కథనంలో చూద్దాం.

Year Ender 2024: శాస్త్రసాంకేతిక రంగాల్లో ఈ ఏడాది టాప్ ఆవిష్కరణలు ఇవే!

ఇంటర్నెట్ డెస్క్: మానవాళిని వేధిస్తున్న అనేక సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి శ్రమ ఫలితంగా ఈ సంవత్సం మానవాళి శాస్త్రసాంకేతిక రంగంలో గొప్ప పురోగతి సాధించింది. మరి 2024లో వెలుగులోకొచ్చిన టాప్ ఆవిష్కరణలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

బయోఫ్యూల్స్ రంగంలో పురోగతి

మొక్కల్లో నూనెల ఉత్పత్తి పెంచే దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు. పర్యావరణహిత బయోఇంధనాల రూపకల్పనలో ముందగుడు వేశారు. ఆహార భద్రతకు ఢోకా లేకుండా హరిత ఇంధనాల ఉత్పత్తిలో ఇదో కీలక మైలురాయని శాస్త్రప్రపంచం చెబుతోంది. తద్వారా భవిష్యత్తులో బయో ఫ్యూల్స్ మరింత అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.


హెచ్ఐవీకి మరో విరుగుడు

హైచ్ఐవీ పీడ వదిలించుకునే దిశగా మరో గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. హెచ్ఐవీ బారిన పడకుండా ఉండేందుకు లెనకాపావిర్ అనే ఔషధాన్ని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇది తీసుకున్న వారికి ఆరు నెలల పాటు హెచ్‌ఐవీ నుంచి రక్షణ లభిస్తుంది. దీన్ని ఈ ఏటి మేటి ఆవిష్కరణగా ప్రఖ్యాత సైన్స్ మేగజైన్ గుర్తించింది.

సూపర్ ఎర్త్

భూమికంటే ఒకటిన్నర రెట్లు పెద్దదిగా ఉన్న ఓ భారీ సూపర్ ఎర్త్‌ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి టీఓఐ-715బీ గా నామకరణం చేశారు. ఇది భూమికి 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక్కడి ఉష్ణోగ్రత, వాతావరణం ప్రాణులు జీవించేందుకు కొంచెం అనువుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతరించిపోతున్న జీవాలకు కొత్త ఆశ

అంతరించిపోతున్న జీవాలను కాపాడుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో కీలక ముందడుగు పడింది. చైనాకు చెందిన శాస్త్రవేత్తలు పాండా ఎలుగుబంటి చర్మ కణాల నుంచి ప్లూరీపొటెంట్ మూల కణాలను అభివృద్ధి చేయగలిగారు. ఈ సాంకేతికతతో పాండాలతో పాటు అంతరించిపోయే దశలో ఉ్న సుమాత్రాన్ రైనో సరస్, గ్రేవీ జీబ్రాలను కాపాడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


ఒకరికొకరు పేర్లు పెట్టుకునే కోతులు

ఒకరినొకరు పేర్లతో సంబోధించుకోవడం అనేది ఇప్పటివరకూ మనుషుల్లోనే చూశాం. అయితే, మార్మొసెట్స్ జాతి కోతుల్లో కూడా దాదాపు ఇలాంటి తీరును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ కోతులు ఒకదాన్నొకటి పిలుచుకునేందుకు ప్రత్యేక ఫ్రీక్వెన్సీ కలిగిన శబ్దాలు చేస్తాయని, ఒక్కో ఫ్రీక్వెన్సీ శబ్దాన్ని అవి పెట్టుకున్న ఒక పేరుగా భావించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మేధో సామర్థ్యానికి ఇదో చిహ్నమని అంటున్నారు.

ఆఫ్రీన్ రైనోలను కాపాడుకునేందుకు మరో ముందడుగు

ప్రస్తుతం ప్రపంచంలో రెండే రెండు ఆఫ్రికన్ వైట్ రైనో సరాస్ (ఖడ్గమృగాలు ఉన్నాయి). అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ జీవాలను కాపాడుకునేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు కృత్రిమగర్భధారణ పద్ధతుల ద్వారా ఆడ రైనో శరీరంలోకి ఓ పిండాన్ని ప్రవేశపెట్టగలిగారు.

నెలసరి రక్త పరీక్ష

నెలసరి రక్తస్రావాన్ని పరీక్షించడం ద్వారా పలు అనారోగ్యాలను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ పరీక్షకు ఇప్పటికే అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లభించింది. ఈ రక్తపరీక్ష ద్వారా ఎండోమెట్రియోసిస్, క్లమిడియా, డయాబెటీస్, హార్మోన్ల సమతౌల్యంలో మార్పులు, సర్వైకల్ క్యాన్సర్ వంటి సమస్యలను గుర్తించొచ్చని చెబుతున్నారు.


ఫ్రూట్ ఫ్లై బ్రెయిన్ మ్యాప్

ఫ్రూట్ ఫ్లై అనే ఈగ మెదడులోని నాడీ కణాల మధ్య కనెక్షన్లతో కూడిన ఓ మ్యాప్‌ను శాస్త్రవేత్తలు తాజాగా రూపొందించారు. ఫ్రూట్ ఫ్లై ప్రవర్తనను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ మ్యాప్ ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా మానవుల మెదడు మ్యాప్‌ను కూడా రూపొందించొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఆల్జైమర్స్‌ను గుర్తించేందుకు సింపుల్ పరీక్ష

ఆల్జైమర్స్ వ్యాధిని గుర్తించేందుకు ఓ సులభమైన పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటివరకూ ఆల్జైమర్స్‌ను గుర్తించేందుకు ఖరీదైన పెట్ స్కాన్స్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్స్ పరీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు కేవలం రక్త పరీక్ష‌తో ఆల్జైమర్స్‌ను గుర్తించే కల సాకారమైంది. రక్తంలోని ఫాస్ఫో టౌ 217 స్థాయిల ఆధారంగా ఆల్జైమర్స్‌ ఎంత స్థాయిలో ఉందో గుర్తించొచ్చని చెబుతున్నారు.

For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 27 , 2024 | 08:33 AM