Share News

ACB Inquiry: ప్రభుత్వ ప్రకటనల జారీకి ప్రాతిపదికేంటి

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:19 AM

వైసీపీ హయాంలో ప్రభుత్వ ప్రకటనలు జగన్ సొంత మీడియాకు అధికంగా జారీచేసిన అంశంపై ఏసీబీ మాజీ ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిని విచారించింది. ఆయన ఏసీబీ ప్రశ్నలకు సూటిగా సమాధానమివ్వకపోవడంతో మరింత లోతుగా విచారణ కొనసాగనుంది.

ACB Inquiry: ప్రభుత్వ ప్రకటనల జారీకి ప్రాతిపదికేంటి

జగన్‌ పత్రికపై ప్రేమ.. ఇతర పత్రికలపై వివక్ష ఎందుకు

ఏబీసీ మార్గదర్శకాలను ఎందుకు విస్మరించారు?

ఎవరు ఒత్తిడి చేశారు.. అలా ఎందుకిచ్చారు?

ఐ అండ్‌ పీఆర్‌ మాజీ కమిషనర్‌కు ఏసీబీ ప్రశ్నలు

పొంతనలేని జవాబులిచ్చిన విజయ్‌కుమార్‌రెడ్డి

గుంటూరులో 8 గంటలపాటు సుదీర్ఘ విచారణ

నేడు మళ్లీ రావాలని ఏసీబీ అధికారుల స్పష్టీకరణ

అమరావతి/గుంటూరు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం పత్రికలకు జారీచేసే ప్రకటనలకు ప్రాతిపదిక ఏంటి.? పత్రికలకు ఏబీసీ మార్గదర్శకాలు ఉంటాయి కదా.. వాటిని ఎందుకు విస్మరించారు.? జగన్‌ పత్రిక, టీవీపై ప్రేమ చూపించి.. ఇతర పత్రికలు, మీడియాపై వివక్ష ఎందుకు చూపించారు.? ఎవరు మీపై ఒత్తిడి చేశారు.. ఇలా ఏకపక్షంగా ప్రకటనలు ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది.. అని సమాచార, పౌరసంబంధాల (ఐ అండ్‌ పీఆర్‌) మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్‌ సొంత మీడియాకు ప్రజల సొమ్మును దోచిపెట్టి.. ఇతర పత్రికలకు తక్కువ ప్రకటనలు జారీ చేయడం, ఆంధ్రజ్యోతికి అసలేమీ ఇవ్వకపోవడంపై.. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడకు చెందిన ఒక జర్నలిస్టు చేసిన ఫిర్యాదుతో విజిలెన్స్‌ విచారణ చేపట్టింది.


2019-24 మధ్య రూ.859 కోట్లు ప్రభుత్వ ప్రకటనలు జారీచేయగా.. అందులో సగానికి పైగా జగన్‌ సొంత మీడియాకు, మిగతా మొత్తంలోనూ అత్యధిక వాటా సానుకూల మీడియాకు విడుదల చేసినట్లు గుర్తించింది. ఈ బాగోతంపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడంతో గత నవంబరులో కేసు నమోదు చేసిన గుంటూరు ఏసీబీ అధికారులు విజయ్‌కుమార్‌రెడ్డిని నిందితుడిగా చేర్చి విచారణకు పిలిచారు. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన కోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు. విచారణకు సహకరించని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించడంతో తప్పని పరిస్థితుల్లో ఆయన బుధవారం గుంటూరులోని ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 7.15 వరకు సుమారు 8 గంటలపాటు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మధ్యాహ్నం కొద్ది సమయం భోజన విరామం ఇచ్చారు.

TIRUPATI_PATH_F.gif

ఏబీసీ గురించి ఏసీబీ అడుగగా.. తాను పీఐబీతో సంప్రదించానంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. ఏసీబీ అధికారుల ప్రశ్నలకు ఆయన సూటిగా జవాబులివ్వలేదని తెలిసింది. డాక్యుమెంటరీ ఆధారాలను ముందుంచి ప్రశ్నించడంతో ఆయన ఏమీ మాట్లాడలేదని సమాచారం. ఈ నేపథ్యంలో మరింత లోతుగా ప్రశ్నించడానికి గురువారం కూడా విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీబీ అదనపు ఎస్పీ మత్తె మహేంద్ర ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు.. ఏమేం అడిగారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. విజయ్‌కుమార్‌రెడ్డి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:19 AM