రొయ్య.. విలవిల
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:46 AM
అమెరికాకు ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తులపై నిన్నటి వరకు మూడు నాలుగు నాలుగు శాతం సుంకం విధించేవారు. కాని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్‌లను ఒకేసారి 26 శాతానికి పెంచడంతో కలకలం రేపింది.

భారీగా పతమైన రొయ్యల ధరలు.. లబోదిబోమంటున్న రైతులు
30 కౌంటు ధర రూ.410.. 40 కౌంటు రూ.350
ప్రకటించిన రేట్లకు, కొనే రేట్లకు పొంతన లేని వైనం
(ఆకివీడు రూరల్/ముదినేపల్లి–ఆంధ్రజ్యోతి):
అమెరికాకు ఎగుమతి చేసే ఆక్వా ఉత్పత్తులపై నిన్నటి వరకు మూడు నాలుగు నాలుగు శాతం సుంకం విధించేవారు. కాని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్‌లను ఒకేసారి 26 శాతానికి పెంచడంతో కలకలం రేపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి ఆక్వా ఉత్పత్తులే అత్యధికంగా అమెరికాకే వెళతాయి. ఇది ఆక్వాపై పెను ప్రభావం చూపింది. ఇదే అదనుగా ట్రేడర్స్, ఏజెన్సీలు కొనుగోళ్లలో చేతివాటం మొదలు పెట్టాయి. 30, 40 కౌంటులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అంతే కాకుండా అతి తక్కువ ధరకు కోట్ చేస్తున్నారు. ట్రంప్ ప్రకటనకు ముందు 30 కౌంటు ధర కేజీ రూ.470 ఉండగా, ప్రస్తుతం రూ.410కు కొనుగోలు చేస్తున్నారు. అంటే రూ.60 రూపాయలు పడిపోయింది. 40 కౌంటు ధర రూ.415 నుంచి రూ.350కు పడిపోయింది. 60, 70 కౌంటులు మాత్రమే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. వంద కౌంట్ రొయ్యల ధరలు కేజీ ఒక్కింటికి రూ.250 నుంచి రూ.200కు పడిపోయింది. ఒక్కసారిగా రూ.50 తగ్గిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. సుంకం పెరగక ముందు కొనుగోలు చేసి నిల్వ ఉంచిన రొయ్యలకు, వ్యాపారులు, ఎగుమతిదారులు తగ్గిన ధరల ప్రకారం సొమ్ము చెల్లిస్తామని చెబుడు తుండటం రైతులకు ఆందోళన కలిగిస్తున్నది.ఈ ధరలు మరింత తగ్గు తాయని ప్రచారం జరుగుతుండడంతో రైతులు ఆందోళనతో అయినకాడికి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉత్పత్తులు తక్కువ మొత్తంలో (టన్ను) ఉంటే కొనుగోలు చెయ్యడానికి ముందుకు రావడం లేదు.
అమెరికాకు చేసే ఎగుమతులలో రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి ఐదు స్థానాలలో ఉంది. ఇందులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మొదటి స్థానంలో ఉండడంతో ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించింది. అయితే ఈలోపే ట్రేడర్స్, ఏజెన్సీలు రైతులను అందిన కాడికి దోచుకుంటున్నాయి. వైరస్, వైట్‌కట్ వంటివాటితో ఇప్పటికే రైతులు నష్టపోయారు, విస్తీర్ణంలో తక్కువగా సాగవుతున్నప్పటికి ట్రేడర్స్ అవేమి చూడడం లేదు. అయిన కాడికి దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ చేసుకునే అవకాశం లేని ఉత్పత్తి కావడంతో తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆకివీడు, కైకలూరు, నిడమర్రు, గణపవరం, భీమవరం, ముదినేపల్లి ప్రాంతాల్లో వేలాది ఎకరాల చెరువుల్లో పట్టుబడికి సిద్ధంగా వున్న రొయ్యలను పట్టి మార్కెటింగ్ చేయడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఎక్కువ కాలం పట్టకపోతే వైరస్ ప్రమాదంతో మరింత నష్టం కలుగుతుందని, కొన్ని ప్రాంతాల్లో రొయ్యల పట్టుబడులు నిర్వహించి ప్రస్తుత ధరలకే అమ్మేస్తున్నారు.
పర్యవేక్షణ అవసరం : అల్లాడి బాలాజీ, ఆక్వా రైతు, చినకాపవరం
ప్రస్తుత తరుణంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పర్యవేక్షణ చేపట్టాలి. ధరలు తగ్గకుండా, గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. ట్రేడర్స్, ఏజెన్సీలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. కోల్డ్ స్టోరేజీలు నిర్మించి, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.