Posani Krishna Murali: బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:32 AM
వైసీపీ అధికారంలో ఉన్నపుడు హద్దూపొద్దూ లేకుండా ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇప్పుడు గుంటూరు మెజిస్ట్రేట్ ముందు ఆవేశంతో ఊగిపోయారు. తన తప్పు ఉందని తేలితే మెడ నరికేయండి అంటూ రెచ్చిపోయారు.

గుంటూరు కోర్టులో పోసాని బెదిరింపులు
తప్పుంటే మెడ నరికేయండంటూ ఆవేశం
మెజిస్ట్రేట్ ముందు ఎమోషనల్ బ్లాక్‌మెయిల్
14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
అమరావతి/గుంటూరు/కర్నూలు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో ఉన్నపుడు హద్దూపొద్దూ లేకుండా ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇప్పుడు గుంటూరు మెజిస్ట్రేట్ ముందు ఆవేశంతో ఊగిపోయారు. తన తప్పు ఉందని తేలితే మెడ నరికేయండి అంటూ రెచ్చిపోయారు. రెండు రోజుల్లో బెయిలు రాకపోతే ఆత్మహత్య చేసుకుని చస్తానంటూ మెజిస్ట్రేట్ సమక్షంలోనే బెదిరింపులకు దిగారు. జడ్జిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు పోసానిని కర్నూలు జిల్లా జైలు నుంచి సీఐడీ పోలీసులు బుధవారం రాత్రికి పీటీ వారెంట్‌పై గుంటూరుకు తీసుకువచ్చారు. రాత్రి 8:30 గంటల సమయంలో సీఐడీ కోర్టు ఇన్‌చార్జి మేజిరేస్టట్ అయిన ప్రొహిబిషన్ అండ్ ఎకే్ౖసజ్ కోర్టు మెజిరేస్టట్ స్పందన ఇంటికి తీసుకు వెళ్లి హాజరుపరిచారు. ప్రస్తుతం తనకు 70 సంవత్సరాల వయసని.. ఇప్పటికే రెండుసార్లు స్టెంట్స్ వేశారని, గొంతుకు పెరాలసిస్ తరహా రోగం వచ్చిందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని జడ్జికి పోసాని చెప్పారు. ఈ వయసులో ఈ విధంగా వేధించడం దారుణమన్నారు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ స్పందన ఆదేశించారు. దీంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. పోసానిపై తెనాలి, బాపట్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటికే పీటీ వారెంట్లు తీసుకున్నారు. మార్ఫింగ్ వీడియోపై సీఐడీ కేసు: చంద్రబాబు అమిత్‌షా కాళ్లు పట్టుకుంటున్నట్లుగా ఓ మార్ఫింగ్ ఫొటోను సృష్టించి హైదరాబాదులో మీడియా సమావేశంలో పోసాని చూపారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ముస్లింలు ఓట్లు వేయొద్దు అంటూ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి గత ఏడాది అక్టోబర్ 9న సీఐడీ అదనపు డీజీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీటీ వారెంట్‌పై బుధవారం ఆయన్ను గుంటూరు కోర్టులో హాజరు పరిచారు.
లంచ్‌మోషన్‌గా హైకోర్టులో విచారణ
చంద్రబాబును అసభ్యపదజాలంతో దూషించారంటూ మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పోసాని బుధవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని లంచ్‌మోషన్‌గా స్వీకరించింది. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ జారీ చేసిందని, పోలీసులు వారెంట్‌ను అమలుచేసి పిటిషనర్‌ను అరెస్ట్ చేశారని తెలిపారు. పీటీ వారెంట్ అమలైనందున క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. న్యాయమూర్తి ఈ వాదననతో ఏకీభవిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.