AP Mega DSC Notification: మాట ఇచ్చినట్టే మంచి పాలన
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:45 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిందని, ఇప్పుడు అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం: సీఎం
ఏప్రిల్ తొలి వారంలో మెగా డీఎస్సీ
16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం
ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయి రూ.7,230 కోట్లు చెల్లించాం
ప్రతి అధికారీ బాధ్యతగా, గౌరవభావంతో పథకాలు అందించాలి
వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్..15ు వృద్ధితోనే స్వర్ణాంధ్ర-2047
తాగునీటి సమస్య తలెత్తరాదు.. 20 వేల కి.మీ. గుంతల పూడ్చివేత
గంజాయి, రౌడీయిజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలోపెట్టి, పునర్నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తొమ్మిది నెలలుగా మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. మంగళవారం సచివాలయంలో జరిగిన మూడో విడత కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వం విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది. జరిగిన నష్టాన్ని అధిగమించి రాష్ట్రం అభివృద్ధి చెందేలా, ప్రజలకు సంక్షేమం అందించేలా చిత్తశుద్ధితో పనిచేయండి.’’ అని కలెక్టర్లకు ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం, జిల్లా కోసం ఏం చేయాలనేది కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని నిర్దేశించారు. ‘‘ప్రజలపై మీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ పనితీరుతో వచ్చే ఫలితాలు వారిపై శాశ్వత ముద్ర వేస్తాయి.’’ అని కలెక్టర్లను ఉద్దేశించి సీఎం అన్నారు. 26 జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. అన్నిశాఖల తీరుతెన్నులను ఈ సదస్సు తొలిరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
ప్రతి పనినీ సమీక్షిస్తున్నాం
‘‘సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలి. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమమూ చివరిస్థాయి వరకు చేరాలి. ప్రతి అధికారీ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకెళ్లాలి. మీరు చేసే ప్రతిపనినీ సమీక్షిస్తున్నాం. పౌరులకు అందించే 22 సేవల పై అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మా కోసమే పని చేస్తోందన్న నమ్మకం ప్రజల్లో కలిగించాలి.’’
అభివృద్ధి, సంక్షేమంతోనే సంతోషం
‘‘16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైలుపైనే మొదటి సంతకం చేశాం. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. పగడ్బందీగా నిర్వహించాలి. పాఠశాలలు ప్రారంభించే సమయానికి నియామకాలు పూర్తవ్వాలి. గతంలో రాష్ట్రంలో 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్‌లో 10 సూత్రాలు రూపొందించాం. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయం వరకు ప్రణాళికలు ఉండాల్సిందే. ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాల అమలు తప్పనిసరి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే తగినంత ఆదాయం రావాలి. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తే స్థిరంగా కొనసాగవు. గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ అప్పులు తీర్చాలి, వడ్డీలు కట్టాలి. రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చడానికి ఏర్పాటుచేసిన 204 అన్నా క్యాంటీన్లను కలెక్టర్లు సందర్శించాలి. పోలవరాన్ని కేంద్ర సహకారంతో గాడినపెట్టాం. 2027 నాటికి పూర్తిచేస్తాం. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచలోనే బెస్ట్‌మోడల్‌గా అభివృద్ధి చేస్తున్నాం. నక్కపల్లి స్టీల్‌ప్లాంట్ నిర్మాణంలోనూ ఈ తరహా మోడల్స్ చేపట్టాలి. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం అమరావతితో ప్రారంభమైంది. రూ.861 కోట్లతో 20,000 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చివేస్తున్నాం. 95 శాతం పనులు పూర్తయ్యాయి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుచేసుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తాయి. రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూఫ్‌టా్‌పల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి అసెంబ్లీ నియోకవర్గంలోనూ పదివేల రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేయాలి. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేశాం. రూ.4,000 కోట్లతో 40వేల పనులను పల్లె పండగ కింద ప్రారంభించాం. మే నెలలో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15,000 అందిస్తాం. పీ4లో భాగంగా అట్టడుగున ఉన్న పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయనున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ ప్రెన్యూర్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చాం.
అదనంగా లక్ష ఎకరాల్లో అరకు కాఫీ సాగు
గిరిజన సంక్షేమంలో భాగంగా అరకు కాఫీని ప్రోత్సహించాలి. ఐదేళ్లలో అదనంగా లక్ష ఎకరాల్లో సాగు చేపట్టాలి.
తాగునీరు లేదనే మాట రానీయొద్దు..
‘‘ఈ వేసవి కాలంలో వడదెబ్బ తగిలి ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు. ఎక్కడా తాగునీరు లేదనే మాట రాకూడదు. వేసవి పూర్తయ్యే వరకు జిల్లాల్లో తాత్కాలిక కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయాలి. మంచినీటి సమస్య ఎక్కడ తలెత్తినా రియల్‌టైంలో పర్యవేక్షించి పరిష్కరించాలి. చలివేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయాలి. రాష్ట్రంలోని అన్ని చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు పూర్తి చేసుకోవాలి. ఉపాధి నిధులు సక్రమంగా వినియోగించుకుని పనులు చేయాలి. ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ పని దినాలు కల్పించాలి. అటవీశాఖ కూడా ఉపాధి పథకాన్ని వినియోగించుకోవాలి.’’
308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
‘‘విజన్ అమల్లో రాజకీయ ఒత్తిళ్లు తలెత్తకుండా జిల్లాలకు స్థానికేతర అధికారులను ప్లానింగ్ బోర్డు చైర్మన్లుగా నియమించాం. జీఎస్డీపీ పెరుగుదల ద్వారా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. వచ్చే ఏడాదికి 15ు తగ్గకుండా జీఎ్‌సడీపీ సాధించేలా కలెక్టర్లు కృషిచేయాలి. వృద్ధిరేటు ఒక శాతం పెరిగితే రూ.15,000 కోట్ల ఆదాయం వస్తుంది. స్వర్ణాంధ్ర విజన్‌లో రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీని ఆవిష్కరించాలనేది మన సంకల్పం.’’
జనాభాను పెంచాలి..
‘‘ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో రూ.7,230 కోట్లను 9 నెలల్లో చెల్లించాం. ఉద్యోగులకు అలవెన్సులు చెల్లించకుండా గత ప్రభుత్వం రూ.20,637 కోట్లు బకాయిలు పెట్టింది. పీ4 కార్యక్రమంలో అధికారులు భాగస్వామ్యం కావాలి. వడ్డెర సామాజికవర్గానికి క్వారీలు ఇవ్వాలని సంకల్పించాజ. చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.5 శాతం జననాల రేటు ఉంది. దానిని పెంచాలి. 77 శాతం పెట్టుబడులు ప్రైవేటు రంగం నుంచి రాబోతున్నాయి. వాటి ద్వారా సంపద సృష్టించడమే కాకుండా, సంక్షేమాన్ని కూడా చేపట్టబోతున్నాం.’’ అని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు సురేశ్‌కుమార్, శశిభూషణ్‌కుమార్, పీయూష్‌కుమార్, మైనార్టీ సంక్షేమం శాఖ కార్యదర్శి హర్షవర్ధన్, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులతో జాగ్రత్త..
‘‘సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధం. మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలి. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 లక్షల బోర్లను ముందుగానే ఫ్లష్ అవుట్ చేయించాలి. మంత్రుల కమిటీ నాణ్యమైన ఆహార సరఫరాపైనా దృష్టి సారించాలి.’’
డెయిరీ-డ్వాక్రా అనుసంధానం
‘‘మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలి. రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు సాధించేలా ముందుకెళ్తున్నాం. పర్యాటకంలో 20 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయం సహాయక బృందాలను పాడి పరిశ్రమకు అనుసంధానం చేయాలి. డెయిరీ-డ్వాక్రా అనుసంధానంతో ఉత్తమ ఫలితాలుంటాయి. డెయిరీల్లో పాల సేకరణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించాలి. వేసవిలో గ్రాసానికి ఇబ్బంది లేకుండా ఎండు గడ్డి, పచ్చి గడ్డి లభ్యతలో లోటు ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి. పశుపోషణపై ఆసక్తి ఉన్న బీపీఎల్ కుటుంబానికి 2 ఆవులు లేదా గేదెలు రాయితీపై అందించాలి.’’
థర్డ్ పార్టీతో ఆడిట్..
‘‘ఈ ఏడాది జూన్ 15 నుంచి ఈ నెల 19వరకు రాష్ట్రంలో మొత్తం 8.26 లక్షల ఫిర్యాదులు రాగా, ఇప్పటి వరకు 7.22 లక్షల ఫిర్యాదులు పరిష్కరించాం. ఫిర్యాదులను కేవలం రొటీన్ విధానంలో పరిష్కరించడం కాకుండా ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కువ ఫిర్యాదులు వచ్చే శాఖలు మరింత దృష్టిపెట్టి పనిచేయాలి. సమస్యల పరిష్కారంపై థర్డ్‌పార్టీతో ఆడిట్ చేయించాలి. రాష్ట్రంలో వక్ఫ్ భూములు, ఆస్తుల ద్వారా ముస్లింలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలి. హజ్ యాత్రికులకు వచ్చే ఏడాది నుంచి గన్నవరంలోనే ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం.
మహిళలకు పింక్ టాయిలెట్స్
బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు పింక్ టాయిలెట్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్లను మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి కోరారు. బహిరంగ ప్రదేశాల్లో బేబీ ఫీడింగ్, చైల్డ్ కేర్ రూమ్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను సాక్షం అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలన్నారు.
జీఎస్టీపై సమీక్షలు చేసి బకాయిలు వసూలు చేయాలి. పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా ఉండాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్లు భావిస్తాం. శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దు. గంజాయి సరఫరా చేసే, రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపండి. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలెక్టర్లు కలిసి పనిచేయాలి.
- సీఎం చంద్రబాబు
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే
Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్
Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ