సర్కారుకు.. ఎర్రచం‘ధనం’!
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:51 AM
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం తిరుపతిలో 905.71 టన్నుల ఎర్రచందనం గ్లోబల్ వేలం ద్వారా అమ్మేందుకు సిద్ధమైంది. గతంలో తక్కువ స్పందన వచ్చినా, పరిశ్రమల పుంజుకోవడంతో ఈసారి విజయవంతమయ్యే అవకాశం ఉంది.

అమ్మకానికి 905 టన్నులు సిద్ధం
నేడు ప్రపంచస్థాయి టెండర్లు
రూ.200 కోట్లు సమకూరే అవకాశం
మంగళం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం అమ్మకాల ద్వారా కొంత ఊరట పొందాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలోని తిమ్మినాయుడుపాళెంలోని సెంట్రల్ గోదాములో ఉన్న 5,300 టన్నుల్లో 905.71 టన్నులకు గురువారం ప్రపంచస్థాయి(గ్లోబల్)లో వేలం వేసేందుకు సిద్ధమైంది. తద్వారా దాదాపు రూ.200 కోట్లు చేకూర్చుకోవచ్చని ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. గత ఏడాది నవంబరులో నిర్వహించిన గ్లోబల్ టెండర్లకు స్పందన కరువైంది. కరోనా కారణంగా చైనాలో ఎర్రచందనం ఆధారిత పరిశ్రమలు మూతపడడంతో చందనం కొనుగోలు దారులు పెద్దగా స్పందించలేదు. తాజాగా ఎర్రచందనంతో తయారు చేసే వస్తువుల ఉత్పత్తి పరిశ్రమలు పుంజుకుంటున్న నేపథ్యంలో దాదాపు 905.71 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎర్రచందనం దుంగలను 3 గ్రేడ్లుగా విభజిస్తారు. ఎలాంటి వంపులు లేకుండా నిటారుగా ఉన్న, చేవ(నాణ్యత) కలిగిన ఎర్రచందనాన్ని ‘ఏ గ్రేడ్’గా పరిగణిస్తారు. ఇది దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల వయసున్న వృక్షాల ద్వారానే లభ్యమవుతుంది. ఎర్రచందనం కాండం(మొదలు) సైజును బట్టి దాని నాణ్యతను నిర్ణయిస్తారు. దీనికన్నా తక్కువ నాణ్యత ఉన్న దాన్ని ‘బీ గ్రేడ్’గా పరిగణిస్తారు. వంపులు తిరిగి చేవ తక్కువగా ఉన్న దానిని ‘సీ గ్రేడ్’గా లెక్కిస్తారు. ఆయా దుంగల నాణ్యత, వయసు ఆధారంగా ధరలను నిర్ణయిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గత నెల 28న నిర్వహించాల్సిన ఎర్రచందనం గ్లోబల్ టెండర్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో గురువారం నిర్వహించనున్న టెండర్లలో ఏ గ్రేడ్ ఎర్రచందనం 10, బీ గ్రేడ్ 10 దుంగలు, సీ గ్రేడ్ 30 దుంగలను విక్రయించనున్నారు.
రూ.48.05 లక్షల డిపాజిట్
టెండర్లలో పాల్గొనే వారు రూ.48.05 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొన్న వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకంటే ఎక్కువ ధరకు కోట్ చేసి.. దుంగలను దక్కించుకుంటే డిపాజిట్ సొమ్ము మినహా మిగిలిన సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. తాజా టెండర్లకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చైనా, జపాన్, మలేషియా, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన వ్యాపారులు రావచ్చని అంచనా వేసింది. ఇదే జరిగితే ప్రభుత్వానికి రూ.200 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..