Telugu Literature Legend: ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ తుమ్మల రామకృష్ణ మృతి
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:14 AM
ప్రసిద్ధ తెలుగు కథా రచయిత, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య తుమ్మల రామకృష్ణ (67) అనారోగ్యంతో మృతి చెందారు. బహుజన జీవితాన్ని ప్రతిబింబించే ఆయన కథలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా అనువాదమయ్యాయి

కుప్పం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ తెలుగు కథా రచయిత, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి ఆచార్య తుమ్మల రామకృష్ణ(67) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్‌లో ఒక ప్రయివేటు ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందారు. తుమ్మల రామకృష్ణ స్వస్థలం చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఆవులపల్లె. ఎస్వీ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆచార్యునిగా చేసి పదవీ విరమణ చేశారు. 2020లో ద్రవిడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులయ్యారు. 2023 నవంబరు దాకా ఈ పదవిలో ఉన్నారు. బహుజన జీవితాన్ని కథలుగా రాశారు. ‘మట్టి పొయ్యి’ పేరుతో వెలువడ్డ ఆయన కథల సంపుటి తెలుగు సాహిత్యంలో మంచి స్థానం పొందింది. తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటూ మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి ఆయన కథలు అనువాదం అయ్యాయి. ఆయన సాహిత్య వ్యాసాలు రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. తుమ్మల రామకృష్ణ సాహిత్య ప్రస్థానంపై పలువురు రచయితల వ్యాసాలతో ‘సీమ సంతకం’ అనే సంకలనం ప్రకటితమైంది. తుమ్మల రామకృష్ణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాదు లింగపల్లిలోని స్వగృహం వద్ద మంగళవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.